Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉషోదయం పులకించెను నీ మోమును చూసి
కలువపూలు తరియించెను నీ కనులై పూసి
నిరంతరం కాంతి చిందు సూర్యబింబమైనా
తిలకముగా వెలిగిపోవు నీ నుదుటను మెరిసి
కొండమల్లె జాజిమల్లె గులాబీలు అన్నీ
పరిమళాలు వెదజల్లెను నీ చెమటను తడిసి
సరిగమలను స్వరజతులను చిలికే నీ మాటలో
వరదలుగా పొంగిపోయె వెన్నెలలే కురిసి
ఆ నింగీ ఈ నేలా వేరువేరుగా ఉన్నా
అవి రెండూ కలిసిపోయె నీ తలపున విరిసి
అవనిలోన నడయాడిన పాలరాతి బొమ్మవా?
పవనాలే పులకించెను నీ ఊహలు మోసి
ఆరాధన భావాలను రాశులుగా పేర్చి
'శరత్ 'మురిసిపోయేను ఈ గజల్ ని రాసి.
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682.