Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణాలో పుట్టి పెరిగిన వారెవరికైనా డబల్ కా మీఠా అనే పేరు చెబితే చాలు నోరూరి పోతూంటుంది. ఆ కమ్మటి సువాసన, నోట్లో వేసుకుంటే కరిగిపోయి తేనెలూరిస్తూ... అలా లోపలికి జారిపోవడం డబల్ కా మీఠా సొంతం. ఇక హైదరాబాదీల సంగతి చెప్పనే అక్కరలేదు. డబల్ కా మీఠాను రుచి చూడలేదంటే... అసలు మీరేమీ తినలేదన్నట్లే.
ఒకప్పుడు డబల్ కా మీఠా లేని శుభకార్యం లేదంటే నమ్మితీరాలి. ఇప్పుడు దీని ప్రాశాస్త్యం అన్ని ప్రాంతాలకు పాకినా... కాస్త ఉన్నత వర్గాల వారు విందులలో ఐస్ క్రీమ్ లాంటివాటిని పెట్టినప్పటికీ డబల్ కా మీఠాను కూడా మరో డజెర్ట్గా యాడ్ చేసుకుంటున్నారు. ముస్లిం దావత్లలో డబల్ కా మీఠాకు అగ్రస్థానమే ఉంటుంది.
హైదరాబాద్ గల్లీల్లోనో, ముస్లిం మేనేజ్ మెంట్ ఉన్న హోటళ్ళు కానీ, చాలా ఏండ్ల నుంచి పేరొందిన హోటళ్ళ హోటళ్ళలో ఇప్పటికీ డబల్ కా మీఠా అందుబాటులోనే ఉంటోంది. తక్కువ ఖర్చుతో, అద్భుతమైన రుచితో ఉండే డబల్ కా మీఠాను దావత్ లలో అయితే హైదరాబాదీ బిర్యానీని లాగించిన తరువాత బహు పసందుగా తింటూంటారు. మరికొందరైతే బాల్యపు రుచులు గుర్తు చేసుకుంటూ అద్భుతమైన డబల్ కా మీఠా దొరికే స్వీట్ షాప్ లను వెదుకుతూ సిటీ అంతా గాలించేస్తుంటారు. డబల్ కా మీఠాను తయారు చేయడానికే ప్రత్యేకమైన డబల్ రోటీ (బన్ లాంటిదే ఇటుకల రూపంలో) అందుబాటులో ఉంటుంది. ఆ రోటీని తీసుకువచ్చి అనువైన ముక్కలుగా కట్ చేసి విశాలంగా ఆరబెడతారు. ఆ తరువాత వాటిని నేతిలో బాదాం రంగు వచ్చేలా వేయించుకుని, చక్కెర పాకం పట్టి అందులో వేయించిన డబల్ రోటీ ముక్కలను వేస్తారు. అలాగే వేడి చేసిన చిక్కటి పాలను కలుపుకుంటారు. ఇందులో పాకం సరిగా రాకపోయినా, పాలు సరిగా లేకపోయినా పాలు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే డబల్ కా మీఠా తయారీకి ప్రత్యేకమైన గిన్నెలు ఉంటాయి. చాలామటుకు టెంట్ హౌస్ నుంచి అద్దెకు తెచ్చుకుని మరీ ఈ స్వీట్ ను తయారు చేస్తుంటారు.
ఆ తరువాత నేతిలో వేయించిన బాదాములు, పిస్తా, ఎండు ఖర్జూరాలు, కిస్ మిస్, కాజు, వివిధ రకాల పుచ్చ పప్పుతో గార్నిష్ చేస్తారు. వీటన్నింటిని కలిపిన స్వీట్ ను నోట్లో వేసుకుంటే అలా కరిగిపోవాల్సిందే. అందుకే చాలామంది ప్రజలు ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. ఫేమస్ గా అందుబాటులో ఉండే... అంటే ఫలానా చోట కచ్చితంగా డబల్ కా మీఠా కచ్చితంగా దొరుకుతుంది అనే ప్లేసెస్ హైదరాబాద్ లో ఉన్నాయి. మోజంజాహీ మార్కెట్ ప్రాంతంలో ఉండే హమీదీ కన్ఫెషనర్స్, లక్ష్మణ్ కీ బండీ లు భలే ఫేమస్. అలాగే ప్రగతీ గల్లీలో కచ్చితంగా ఈ డిష్ దొరుకుతుంది. ఈసారెప్పుడైనా సిటీలో చక్కర్లు కొడుతున్నప్పుడు కచ్చితంగా డబల్ కా మీఠాను రుచి చూస్తారు కదూ.