Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకులు పరుగుల నగర జీవితం. తినడానికి కూడా తీరిక దొరకదు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి కొందరిది. పగలూరాత్రి తేడా లేకుండా సాగే ఉద్యోగాలు మరికొందరివి. ఇంట్లో వండుకోలేక.. బయట తినలేక నగరంలోని ఉద్యోగులు నానా అవస్థలు పడుతుంటారు. ఇందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ మీదే ఆధారపడుతుంటారు. దాంతో తరచు అనారోగ్యాల బారినపడుతుంటారు. ఇంటి వంట తినాలని చాలామందికి ఉంటుంది. కానీ ఎలా..? బాక్సు తెచ్చుకోవాలంటే టైం కుదరదు. ఇలాంటి వారి కోసమే హైదరాబాది డబ్బా వాలా ఏర్పాటు చేశాడు మహేష్. మరి ఆ డబ్బావాలా సంగతులేంటో మనమూ తెలుసుకుందామా?
హైదరాబాద్ మహానగరంలో చాలా మంది ఆ చివరి నుండి ఈ చివరికి ఉద్యోగాలకు వస్తుంటారు. అలాంటి వారికి ఇంట్లో వాళ్ళు వంట చేసి పెట్టాలంటే వారికంటే ముందే నిద్రలేచి వంట సిద్దం చేయాలి. అదేం పెద్ద కష్టం. బయట కష్టం చేసి పెట్టే వాళ్ళ కోసం ఆ మాత్రం వంట చేసి పెట్టలేమా అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే ఉదయం ఐదారుగంటలకు తీసుకెళ్ళిన లంచ్‌బాక్స్ ఎప్పుడో మధ్యాహ్నం తినాలంటే ఇబ్బందే. అప్పటికే అన్నం చల్లారుతుంది. కూర రుచి మారుతుంది. మొత్తంగా ఏదో తినాలి కనుక తింటున్నామనే ఫీలింగ్ కలుగకమానదు. ఇక ఇంట్లో వాళ్ళకు ఆదరాబాదరాగా వంట చేయడం, టైంకు బాక్స్ సిద్ధం కాక ఇబ్బంది పడటం. ఆఫీస్‌కు లేట్ అవ్వడం. ఇలాంటి ఎన్నో సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా మీ ఇంటి నుంచే వేడి వేడి లంచ్‌బాక్స్ మీ ఆఫీసుకే తెచ్చిస్తామంటున్నారు హైదరాబాద్ డబ్బావాలా నిర్వాహకులు. ముంబై డబ్బా వాలా స్ఫూర్తితో హైదరాబాద్ డబ్బావాలా ప్రారంభించారు ఈ యువకులు. ముగ్గురు మిత్రులు కలిసి నగరంలోనూ డబ్బావాలా పేరుతో కొత్తగా లంచ్‌బాక్స్ సర్వీసును ప్రారంభించారు.
ఇంజనీరింగ్ చదివి...
మనోజ్, మహేష్, మహదేవ్... ముగ్గురూ ఒకే కాలేజీలో ఏడాది కిందట ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఇంజనీరింగ్ పూర్తి కావస్తున్న ప్రతి ఒక్కరినీ వేదించే ప్రశ్న 'నేట్స్ ఏంటి?' ఈ ప్రశ్నే వీరిని కూడా వేదించింది. 'ఇంజనీరింగ్ అయిపోయిందిగా మరి ఎమ్మేస్ చేస్తావా లేదా జాబ్ చేస్తావా'' అంటూ ఇటు బంధువులు అటు ఫ్రెండ్స్ అడిగినవారు అడిగినట్లే ఉన్నారు. కానీ వీరికి మాత్రం సొంతగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఏం చేయాలనే స్పష్టత మాత్రం లేదు. అందుకే ఏవరైనా అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఎంతో అంతర్మథనం చేశారు.
ముంబయి డబ్బావాలా స్ఫూర్తితో...
పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే స్థితి లేదు. మరి ఏంచేయాలి? అని ఆలోచిస్తుంటే 130 ఏండ్ల కిందట ముంబయిలో ప్రారంభమైన డబ్బావాలా సేవల గురించి తెలిసింది. అంతేకాదు అదే నేపథ్యంగా వచ్చిన 'లంచ్‌బాక్స్' బాలీవుడ్ చిత్రం వాళ్లలో మరింత స్ఫూర్తిని నింపింది. విద్య, వైద్యం, శాస్త్ర, సాంకేతికం వంటి అనేక రంగాలకు నిలయంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌లో అలాంటి సర్వీసులు ఏమైనా ఉన్నాయా.. ఉంటే ఎక్కడున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఇలాంటి సర్వీసు అందిస్తున్న సంస్థలు ఒక్కటి కూడా లేవని తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే డబ్బావాలా పేరుతో మేమెందుకు ఒక స్టార్టప్ ప్రారంభించకూడదు అనే ఆలోచన వచ్చింది.
ఇన్నోవేటివ్ థాట్...
అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎంతవరకు వర్క్అవుట్ అవుతుందని తెలుసుకోవడం కోసం కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు, మిత్రులు, క్లాస్మేట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు...ఇలా దాదాపు వెయ్యిమంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వారిలో చాలామంది ఇదొక ఇన్నోవేటివ్ థాట్ అంటూ అభినందించారు. మొత్తంగా స్థానికుల నుంచి పాజిటివ్ ఒపీనియన్స్ రావడంతో వారి ఆలోచనను ఆచరణలో పెట్టారు. గతేడాది డిసెంబర్ 6న తొలిసారిగా హైదరాబాద్‌లోనూ డబ్బావాలా సేవలను ప్రారంభించారు.
ఆరంభం ఒక్క అడుగుతోనే
ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు మాత్రమే 'డబ్బావాలా' సర్వీసు అందిస్తోంది. ఇప్పటి వరకు 50 మంది కస్టమర్లకు వాళ్ల ఇళ్ల నుంచి లంచ్‌బాక్సును వారి కార్యాలయాలకు చేరవేస్తోంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపే క్యారియర్‌ను సంబంధిత ప్రదేశానికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆ నిర్వాహకులు చెబుతున్నారు. 'ఇంటి నుంచి లంచ్‌బాక్స్ చేర్చాల్సిన ప్రదేశానికి మధ్య దూరం ఆధారంగా చార్జీలు వసూలు చేస్తున్నాం. సమయానికి క్యారియర్‌ను అందించడం, కస్టమర్స్ కుటుంబ సభ్యులతో గౌరవంగా మసులుకోవడం, ఆహారాన్ని భద్రంగా తీసుకెళ్లడం వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాణ్యమైన సేవలను అందించాలన్నదే మా ఉద్దేశం' అంటున్నారు ఆ ముగ్గురు మిత్రులు.
చిరు ఉపాధి
హైదరాబాద్ డబ్బా వాలా సేవలు గచ్చిబౌలి, మియాపూర్, కెపీహెచ్ పి, కుకట్ పల్లి, హైటెక్ సిటి, మాధాపూర్‌ల వరుకే పరిమితమైంది. తమతో పాటు తమ మిత్రులకు కూడా చిరు ఉపాధి కల్పిస్తూ ఈ సేవలు అందిస్తున్నారు. 'హైదరాబాద్ డబ్బా వాలా సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకూడదు. అందుకే మరికొంత మంది మిత్రులను కలుపుకొని హైదరాబాద్ నగర వ్యాప్తంగా మా సేవలు అందిస్తాం' అంటున్నారు వారు. తాము బతకడంతోపాటూ మరో పదిమందికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాలను సైతం వదులుకుని ముందుకు సాగిపోతున్న వారిని కచ్చితంగా అభినందించాల్సిందే.
- అనంతోజు మోహనకృష్ణ
'డబ్బావాలా' సేవల కోసం సంప్రదించాల్సిన
- ఫోన్ నెంబర్లు 8317513265, 97004 25729.
WWW.hyderabad-dabbawala.com