Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విక్కీ... ఎదిగే వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన సమయంలో కుటుంబ బాధ్యతలను భుజాలకెత్తుకున్నాడు. 20 ఏండ్లకే ఇద్దరు తమ్ముళ్ళకు పెద్ద దిక్కయ్యాడు. ఆఫీస్బారుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి హెయిర్ డ్రెస్సర్‌గా ఎదిగాడు. లక్ష్యం చేరేందుకు తపించాడు. ఎన్నో కష్టాలు భరించి కోరుకున్న మజిలీకి అతి చేరువలో ఉన్న ఆ యూత్‌ఫుల్ సక్సెస్ స్టోరీ ఈ వారం జోష్‌లో...
నా అసలు పేరు వెంకటేష్. ఇండ్రస్టీలో అందరూ విక్కీ అని పిలుస్తారు. మా సొంత ఊరు జగ్గయ్య పేట. నాన్న నాగమల్లేశ్వరావు లారీ డ్రైవర్‌గా చేసేవారు. అమ్మ దుర్గ హౌస్ వైఫ్. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. నాన్న వృత్తి రీత్యా మేమంతా విజయవాడకు వెళ్ళాం. ఇంటర్ వరకు అక్కడే చదివాను. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు నాన్న ఆరోగ్యం పాడైపోయింది. ఎక్కువగా డ్యూటీలకు వెళ్ళడం, టైమ్‌కి తిండి లేకపోవడం వల్ల నాన్నకు ఈ సమస్య వచ్చింది. దాంతో డ్రైవింగ్ మానేశాడు. మళ్ళీ జగ్గయ్య పేటకు వెళ్ళిపోయాం.
అస్సలు అనుకోలేదు
అక్కడకు వెళ్లిన తర్వాత సెండక్ ఇయర్లో చేరాను. నాన్న ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడింది. మళ్ళీ డ్యూటీలో చేరాడు. సెకండ్ ఇయర్ వేసవి సెలవుల్లో నాన్నకు ఉన్నట్టుండి సడన్‌గా కడుపునొప్పి వచ్చింది. అక్కడే డాక్టర్ దగ్గర చూపించి మందులు వాడాం. నాలుగు రోజులైనా తగ్గలేదు. అంత సీరియస్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నాన్న బాధ భరించలేకపోతుంటే విజయవాడకు తీసుకెళదామని బయలు దేరాం. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. నాన్న మాకు దూరమయ్యాడు.
తల్లినే బిడ్డలా...
అమ్మ ఆరోగ్యం కూడా బాగోదు. మా రెండో తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు అమ్మ కిందపడింది. అప్పుడు వెన్నుముక చిట్లింది. అప్పటి నుండి ఏ పనీ చేయలేదు. అప్పుడు నాకు ఏడేండ్లు ఉంటాయి. అమ్మకు అన్ని పనుల్లో సాయంగా ఉండేవాడిని. ఇంట్లో పనులన్నీ చేసేవాడిని. అమ్మకు తల దువ్వడం, జడవెయ్యడం కూడా చేసేవాడిని. నేను లేకుండా అమ్మ అడుగు కూడా బయట పెట్టేది కాదు. మా అత్త కూతురు కూడా మాకు హెల్ప్ చేసేది. అసలే అనారోగ్యంగా ఉన్న అమ్మ, నాన్న పోయిన తర్వాత మరింత కుంగిపోయింది. కుటుంబంలో నేనే పెద్దవాడిని. చదువుకుంటూ కూర్చుంటే ఇల్లు గడవడం కష్టం. పైగా నాన్న పోయిన తర్వాత చదువుపై దృష్టి పెట్టలేకపోయా. అందుకే ఏదైనా పని చేయాలనే నిర్ణయానికి వచ్చాను.
అమ్మపైనే ప్రయోగాలు
అమ్మకు జడ వేసేవాడిని కదా అప్పటి నుండే హెయిర్‌డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం. దాంతో యూటూబ్‌లో చూస్తూ రకరకాల జడలు వేయడం మొదలుపెట్టాను. అమ్మపైనే ప్రయోగాలు చేసేవాడిని. అలా నేను వేసిన రకరకాల జడలను ఫొటోలు తీసి ఫేస్బుక్లో పెట్టేవాడిని. ఇండిస్టీలో హెయిర్ డ్రెస్సర్‌కు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఎప్పటికైనా ఇండిస్టీలో గొప్ప హెయిర్‌డ్రెస్సర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాను.
మోసం చేశాడు
అనుకున్నట్టుగానే ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ కలిశాడు. అవకాశం ఇప్పిస్తానని రెండు వేలు అకౌంట్లో వేయమన్నాడు. నేను కూడా అతన్ని నమ్మి డబ్బులు వేశాను. కానీ అతను మోసం చేశాడు. దాంతో మరింత కసి పెరిగింది. ఎక్కడ మోసపోయానో అక్కడే నేనేంటో నిరూపించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను.ఫేస్బుక్లో ఫొటోలను చూసి ఓ ఫ్రెండ్ హైదరాబాద్ రమ్మని కబురు పంపాడు. అలా 2017లో మొదటి సారి హైదరాబాద్‌లో అడుగుపెట్టాను.
మనసు చంపుకొని...
అప్పట్లో అంతా కొత్త. పరిచయాలు ఏమీ లేవు. తెలిసిన వాళ్ళ రూముల్లో ఉండేవాడిని. వచ్చిన వెంటనే అవకాశాలు ఎలా వస్తాయి. ముందు షెల్టర్ కావాలి. అందుకే మనసు చంపుకొని ఓ ఆఫీస్‌లో బారుగా చేరాను. అది నాకు నచ్చలేదు. కానీ తప్పదు. బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. అనుకున్నది సాధించాలంటే ఇక్కడే ఉండాలి. అందుకే చేరాను.
మేకప్ అసిస్టెంట్‌గా...
కొన్ని రోజుల తర్వాత మేకప్ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఈ పని కూడా మొదట్లో ఫ్రీగానే చేసేవాడిని. అయితే ఒక సార్ వాళ్ళ బిల్డింగ్‌లోనే ఉండేందుకు కింద రూం ఇచ్చి ఖర్చుల కోసం రోజుకు 30 రూపాయలు ఇచ్చేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు షూటింగ్‌లోనే ఉండేవాడిని. అక్కడ మూడు నెలలు చేశాను. కానీ నేను వచ్చింది మేకప్ చేయడానికి కాదు. హెయిర్ డ్రెస్సర్ ఎదగడానికి. పైగా మేకప్ అసిస్టెంట్‌గా నేను చేసేది కూడా ఏమీ ఉండదు. ఊరికే అద్దం పట్టుకొని పక్కన నిలబడాలి. ఇక ఇక్కడే ఉంటే డెవలప్మెంట్ ఉండదని నిర్ణయించుకున్నాను.
అమ్మ బతిమలాడింది...
అమ్మను వదిలి ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటి సారి. ఇక్కడ పని కూడా నాకు తృప్తిగా లేదు. దాంతో వినాయక చవితి వస్తే ఊరికి వెళ్ళాను. నెలన్నర ఇంట్లోనే ఉండిపోయా. అమ్మనే బతిమలాడి మళ్ళీ పంపించింది. మా పెద్ద తమ్ముడు అమ్మను చూసుకునేవాడు. అమ్మ అంతగా చెప్పడంతో మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నా.
హీరోయిన్‌కి అసిస్టెంట్‌గా
తెలిసిన వాళ్ళు 'కార్తీకదీపం' సీరియల్‌కు హెయిర్ డ్రెస్సర్‌కు అసిస్టెంట్‌గా ఉంచారు. అయితే ఇండిస్టీలో మేకప్‌కు అసిస్టెంట్లు ఉంటారు గానీ హెయిర్ డ్రెస్సింగ్‌కి ఉండరు. దాంతో సీరియల్ వాళ్ళు ''ఇతనికి భోజనం ఎవరు పెడతారు'' అన్నారు. దాంతో ఆ సీరియల్ హీరోయిన్‌కి అసిస్టెంట్‌గా పెట్టించారు. రోజుకు నాలుగు వందలు ఇచ్చేవాళ్ళు. అమెకు సంబంధించిన పనులన్నీ చూసుకోవాలి. మంచినీళ్ళు, జ్యూసులు అందించడం దగ్గర నుండి ప్రతి పనీ చేయాలి. కానీ నా లక్ష్యం ఇది కాదు. అయినా రెండున్నర నెలలు చేశాను. ఎలాగైనా హెయిల్ డ్రెస్సర్‌గా గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఊరికే అవకాశాలు ఎలా వస్తాయి. డబ్బులు వస్తాయి కదా అని చేశాను. ఇలా ఫీల్డ్‌లో నిలదొక్కుకోడానికి చాలా కష్టపడ్డాను. హెయిర్డ్రెస్సింగ్కు సంబంధించిన మెటీరియల్ చేతిలో ఉంటే పని దొరుకుతుందని ఫ్రెండ్స్ చెబితే కొంత డబ్బు అప్పు చేసి మరీ కొనుక్కున్నా. ఆ తర్వాత 'దటీజ్ మహాలక్ష్మి', 'లక్ష్మీ కళ్యాణం' సీరియల్స్‌కు పని చేసే అవకాశం వచ్చింది.
పెద్ద ఆర్టిస్టులతో పరిచయం...
ఆ సమయంలోనే 'మాటే మంత్రం' సీరియల్‌కు ముగ్గురు హెయిర్ డ్రెస్సర్లను పెట్టుకున్నారు. అందులో నేను మూడో వాడిని. మిగిలిన ముగ్గురు నాకంటే సీనియర్లు. అయితే వాళ్ళు వేరే అవకాశాలు రావడంతో ఈ సీరియల్ నుండి వెళ్ళిపోయారు. దాంతో నన్నే పర్మినెంట్ హెయిర్ డ్రెస్సర్‌గా పెట్టుకున్నారు. ఆరు నెలలు అక్కడే పని చేశాను. ఆ సీరియల్ ద్వారానే కరాటే కళ్యాణి, శివపార్వతి గారి లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. నా పని వాళ్ళకు బాగా నచ్చేది. అందరూ ఎంతో అభిమానంగా చూసుకునేవారు.
కొంత వరకు తీరింది
తర్వాత 'మౌనరాగం' అనే సీరియల్ కోసం అడిగారు. ప్రస్తుతం ఈ సీరియల్‌తో పాటు 'కార్తీక దీపం' కు కూడా చేస్తున్నాను. ఇప్పటికీ హెయిర్ డ్రెస్సర్‌గా ఎదగాలనే నా కోరిక కొంత వరకు తీరింది. మా పెద్ద తమ్ముడికి ఎలక్ట్రిల్ వర్క్ అంటే ఇష్టం. ఊళ్ళో ఉంటూ అదే పని చేస్తున్నాడు. రెండో తమ్ముడు కొన్ని రోజులు నా దగ్గర పని చేశాడు. కానీ చేయలేకపోయాడు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి కంప్యూటర్ వర్క్ చేస్తున్నాడు.
మాటలు అన్నవాళ్ళు కడుపునింపరుమా కుటుంబాల్లో ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నేనే మొదటి వాడిని. 'చదువు కోకుండా ఇలాంటి పనులు చేస్తున్నావేంటి' అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాటలు అన్నవాళ్ళు కడుపు నింపరు. అందుకే ఎవరి మాటలూ పట్టించుకోను. అలాగే 'సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి వచ్చావు' అని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా నా కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా చాలా కష్టపడాలి. నేర్చుకోవాలి. వచ్చే ఏడాది ఈ టైం కల్లా సినిమాల్లో వర్క్ చేయాలనే లక్ష్యాని పెట్టుకున్నా.
అమ్మ హ్యాపీగా ఉందిఊళ్ళో అయితే ఆడపిల్లలా జడవేయడం ఏంటి అని కామెంట్ చేస్తారు. కానీ ఇండిస్టీలో మాకు మంచి డిమాండ్ ఉంది. ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా సొంత టాలెంట్‌తో ఎదిగిన నన్ను చూసి అమ్మ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఏడాది నుండి మంచి మందులు వాడుతుంది. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెల్లమెల్లగా ఇంటి పనులు కూడా చేసుకుంటుంది.