Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు వారీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎదురుదెబ్బలు, అవరోధాలు. ఇవి మనిషిని తీవ్ర నిరాశలోకి నెట్టేస్తాయి. మరీ ముఖ్యంగా యువతను. మరి వీటిని అధిగమిస్తూ ఎప్పుడూ ప్రేరణ పొందేదెలా? జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. లక్ష్యాన్ని సాధించాలంటే మనిషికి ప్రేరణ అవసరం. ప్రేరణ ఉంటేనే మనిషి ఆశావాదంతో ఎన్ని అవరోధాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. మరి ప్రేరణగా ఉండడమెలా? ఎప్పుడూ ప్రేరణగా పొందడానికి ఉపయోగపడే చిట్కాలు కొన్ని మీ కోసం...
కష్టంగా ఉంటే: ఏ పనైనా చేసే ముందు నిరాశ, నిస్పృహ ఎదురైతే ఆ పనిని చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది. దాంతో, కొంతమంది అసలు ఆ పనిని చేయడమే మానేస్తారు. అలా కాకుండా, అటువంటి సమయాలలో చేయాలనుకున్న పనిని చిన్న చిన్నగా పనిని మొదలుపెట్టడం మంచిది.
నేర్చుకుంటూ ఉండాలి: జీవితంలో ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. ఎంత వీలైతే అంత నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి. అలా ఎంత నేర్చుకుంటే మీరు అంత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే మీరు ఎన్నో కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టగలుగుతారు.
సవాళ్ళు ఎదురైనప్పుడు: జీవితంలో కొన్నిసార్లు అవరోధాలు, సవాళ్లు ఎదురవడం సహజమే. వాటిని ఎదురుకోవడానికి ఎంతో ధైర్యం మాత్రమే కాదు తెలివితేటలు కూడా అవసరం. ఎప్పుడైనా అవరోధాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఏం చేస్తే వాటిని దాటగలరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. భయంభయంగా ఉన్నప్పటికంటే ధైర్యంగా ఉన్నప్పుడే మంచిగా ఆలోచించగలుగుతారు. అప్పుడే చెడులోనూ మంచిని చూడగలుగుతారు.
ఆలోచిస్తూ కూర్చోవద్దు: జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఆలోచనలు పక్కన పెట్టి పని మొదలుపెట్టాలి. ఏదైనా పని చేయడానికి మీకు ఆసక్తి కరువైతే... అప్పుడు వేరే పని మొదలుపెట్టండి. చిన్న విషయమైనా చేస్తూ ఉంటే రాను రాను ముఖ్యమైన అంశాలు మొదలుపెట్టగలుగుతారు. ఏ పనైనా మొదలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఎంతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లే.
మీ గురించి మీరు: ఏదైనా సాధించాలంటే మీరు మీ గురించి ముందుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎటువంటి సందర్భాలలో మీ గురించి గొప్పగా భావిస్తారో అలాగే ఎటువంటి సందర్భాలలో మీ గురించి తక్కువుగా అనుకుంటారో తెలుసుకోవడం ఎంతో అవసరం.
నిత్యం గమనించుకోవాలి: మీరు చేస్తున్న పనిలో మీ పనితనం ఎలా ఉందో వాటిలో అభివృద్ధి ఉందో లేదోనన్న విషయాలు కూడా మీరు గమనించాలి. అలా గమనిస్తూ ఉంటే మీరు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి.
స్నేహితులకు ధైర్యం చెప్పండి: నిరాశలో కూరుకుపోయిన మీ స్నేహితులకు మీ సహాయం ఎంతో అవసరం. ఎందుకంటే, వారు కూడా జీవితంలో విజయం సాధించాలంటే ప్రేరణ చెందడం ఎంతో ముఖ్యం. అందుకే నిరాశలోవున్న మీ స్నేహితులకు కూడా మీరు ధైర్యం చెప్పి మోటివేటెడ్గా ఉంచడానికి ప్రయత్నించండి. నిజానికి ఇతరులకు సహాయం చేయడమంటే మీకు మీరు సహాయం చేసుకున్నట్లే. ఎందుకంటే ఇతరులకు సహాయం చేస్తూ మీరూ కొన్ని నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు. అలాగే ఆశావాదులైన మీ స్నేహితులను చూసి మీరు అలాగే ఉండడానికి ప్రయత్నించాలి కూడా.
కొందరికి దూరంగా ఉండాలి: ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించే వారితోనే స్నేహం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. సానుకూలంగా ఆలోచించేవారు మీరు సవాళ్ళను ఎదురుకుంటున్నప్పుడు కూడా మీకు ధైర్యం చెబుతారు. కఠినమైన సమయాలలో కూడా మీరు మంచి అవకాశాలను చూసేటట్టు చేస్తారు. ప్రతికూల ఆలోచనాపరులు మీ ధైర్యాన్ని పోగొడతారు. అందుకే ప్రతికూలంగా ఆలోచించేవారికి దూరంగా ఉండడం మంచిది.
ఈ చిట్కాలు పాటిస్తే అనుకున్న లక్ష్యాలను అతి సులభంగా చేరుకోగలుగుతారు. మీరు కల కంటున్న విజయాల్ని సొంతం చేసుకోగలుగుతారు.