Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆన్ లైన్ వ్యాపారం క్రేజ్ తారస్థాయికి చేరినప్పుడు.. అన్నింటిలోలాగే నిత్యావసరసరుకుల కోసం కూడా పెద్ద ఎత్తున ఆన్ లైన్ బజార్లు పుట్టుకొచ్చాయి. వినూత్నమైన పోకడలు, వింత మార్కెట్ పద్దతులతో ఖర్చులు, ఆదాయంపై అవగాహన లేకుండా చాలా కంపెనీలు పరుగులు ప్రారంభించడంతో మొదటికే మోసం రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఓ రకంగా ఇప్పుడు కిరణా ఈ-టెయిలింగ్ మార్కెట్లో కరెక్షన్ లాంటిది వస్తోంది. ముందస్తు వ్యూహం, ఆదాయమార్గాలు, ఖర్చుల నియంత్రణ లాంటివాటిపై స్పష్టమైన అవగాహనతో ప్రారంభిస్తే తప్ప ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టాడు 21ఏండ్ల యువకుడు షెరుంజ్ జలాన్. ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు పెద్ద పెద్ద సంస్థలు చేతులెత్తేసిన సమయంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయాణం ప్రారంభించాడు.
19 ఏండ్లకే ఆలోచనలు
మనకు కావాల్సినవి అన్నీ ఆన్ లైన్లో దోరుకుతుంటే గ్రోసరీ కూడా ఇందులో అందుబాటులో ఉంటే బాగుండు అనే ఆలోచన జలాన్ కు వచ్చింది. అప్పటికే ఆ రంగంలో ఉన్న వారితో మాట్లాడితే 'చాలా ఇబ్బందులున్నాయి వద్దు' అన్నారు. 'చాలా సంస్థలు అలాంటి కొత్త ట్రెండ్స్ తీసుకువచ్చి కష్టాలు పడి వదిలేశారు' అని కూడా తెలిపారు. కానీ వినలేదు ఉడుకు రక్తం కదా! ఈ సీఏ చదువుతున్న షెరుంజ్ జలాన్ ఆన్ లైన్ గ్రోసరీ ఫ్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నాడు. 'చదువు కొనసాగించాలి ఎట్టి పరిస్థితిలోను ఆపకూడదు' అని ఇంట్లో వాళ్ళు పెట్టిన షరతుకు అతను అంగీకరించాడు. తన పాకెట్ మనీ నుండి దాచుకున్న రూ.30 వేలు పెట్టుబడి పెట్టి పని ప్రారంభించాడు. కొడుకు పట్టుదలకు మెచ్చి తల్లిదండ్రుల కూడా మరికొంత సాయం చేశారు.
పేరెంట్స్ ఆర్థిక సాయంతో
ఆక్టోబర్ 2014లో బజార్ కార్ట్ ఈ-టెయిలింగ్ ఫ్లాట్ ఫామ్‌ను ప్రారంభించాడు జలాన్. ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్‌లలో మొదటగా కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో ఈ-టెయిలింగ్ మార్కెట్లో ఉన్న పరిస్థితులతో జస్ట్ ఇన్ టైమ్ మోడల్ ను వినియోగదారులకు ఆఫర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత గంటలోపే డెలివరీ ఇవ్వడం బజార్ కార్ట్ ప్రత్యేకత. ఇందు కోసం కొన్ని కీలకమైన ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా షాపు యజమానులతో ఒప్పందం చేసుకున్నాడు.
కష్టం అంటే ఏమిటో తెలిసింది
దిగితేగానీ లోతు తెలియదన్నట్టు కొన్ని రోజులకే జలాన్‌కి అసలు కష్టం అంటే ఏమిటో తెలిసొచ్చింది. వ్యాపారాన్ని చురుగ్గా చేయాలంటే ఎక్కువ మంది డెలివరీ బార్సు కావాలాని గుర్తించాడు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆర్డర్స్ డెలివరీ చేయడం అది కూడా ఇన్ టైంలో చేయడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. పైగా వ్యాపార అనుభవం లేకపోవడం, చదువుకుంటూ ఈ బిజినెస్ ప్రారంభించడంతో లాభాలను ఏ పద్దతిలో సాధించాలో జలాన్‌కు అర్థం కాలేదు. కానీ యువతరం తల్చుకుంటే సాధించలేనిది ఏది లేదు కదా అనేశాడు జలాన్.
సమస్యలతో సమరం...
చిన్న వయసులోనే ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రారంభించి ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టినా జలాన్ వెనకడుగు వేయలేదు. వ్యాపారంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలకున్నాడు. తన మనసుకు ముసురుకున్న ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటిగా చేదించుకుంటూ ముందుకు సాగాడు. అసలు తను చేస్తున్న వ్యాపారం ఏమిటి..? ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి..? వాటిని పరిష్కరించుకునే మార్గాలేమిటి..? అని ఒక్కొక్కటిగా లెక్క వేసుకున్నాడు.
వర్క్‌ఫోర్స్...
వ్యాపారంలో జలాన్‌కు కనిపించిన మొదటి సమస్య వర్క్ ఫోర్స్. ఉద్యోగులు లేనిదే ఏ పనీ చేయలేమని గుర్తించాడు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చు అయ్యేలా అప్పుడే స్టడీస్ పూర్తి చేసుకున్న వారిని రిక్రూట్ చేసుకున్నాడు. అది సత్ఫలితాలను ఇచ్చింది. తక్కువ వేతనాలకు ప్రతిభావంతమైన ఉద్యోగులు లభించారు.
డెలివరీ...
రెండో సమస్య డెలివరీ... దీన్ని అధిగమించేందుకు మొదటిగా ఆఫర్ చేసిన జస్ట్ ఇన్ టైమ్ మోడల్ ను తీసేసి వ్యాపార చాత్యురం ప్రదర్శించాడు. ఇరవై నాలుగ్గంటల్లో డెలివరీ చేస్తామనే ప్రచారం ప్రారంభించాడు. తర్వాత తన బజార్ కార్ట్‌లో కొత్త కొత్త అంశాలను చేర్చాడు. పర్సనల్ కేర్, స్టేషనరీ కూడా అందుబాటులో ఉంచాడు. అసలైన వ్యాపార రహాస్యాన్ని పట్టుకున్నాడు. అదే ఈ రంగంలో తనని తిరుగులేని వ్యక్తిగా మర్చింది. లాభాలను పెంచుకోవడానికి రీటైలర్లతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులకు డెలివరీ చేయడం ప్రారంభించాడు. దానితో చుట్టుముట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించబడ్డాయి. దాంతో జలాన్‌లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది.
సక్సెస్ దారిలో మొదటి అడుగులు
ఇప్పటికి బజార్ కార్ట్‌కు 45,000 మంది పైగా యూనిక్ కస్టమర్లున్నారు. ఇందులో నలభై శాతం మంది తమ ఇంటి అవసరాలకు పూర్తిగా బజార్ కార్ట్ ఫ్లాట్ ఫామ్‌నే వాడుకుంటున్నారు. రోజుకు రెండు వందల ఆర్డర్లు, ఏడాదికి ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ప్రస్తుతం బజార్కార్ట్ నమోదు చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు ప్రారంభించారు. మెడిసిన్స్‌ను బజార్ కార్ట్‌లో యాడ్ చేయనున్నారు. ప్రస్తుతం బజార్ కార్ట్పేరుతో ఆఫ్ లైన్ స్టోర్లనూ ప్రారంభించే యోచనలో ఉన్నారు. అలా.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రంగాల్లో తనదైన ముద్రవేయాలని జలాన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. వచ్చే రెండేండ్ల కాలంలో కనీసం పది మెట్రో, టైర్ టూ సిటీస్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టున్నారు.
మార్కెట్ పెద్దదే.. కానీ ఒడిసి పట్టుకోవాలి
భారత ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ 2019 కల్లా 2.7 బిలియన్ల మార్క్‌ను అందుకుంటుందని అంచనా. గణాంకాలు ఎంతో ప్రొత్సాహకరంగా ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉన్న కంపెనీలు ఆ స్థాయిలో పనితీరు చూపించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. 2011 నుంచి గ్రూఫెర్స్, బిగ్ బాస్కెట్, జాప్ నౌ, పెప్పర్ ట్యాప్, లోకల్ బన్యా లాంటి సంస్థలు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. పెప్పర్ ట్యాప్, లోకల్ బన్యా భారీగా పెట్టుబడులను సాధించినప్పటికీ నిలబడలేకపోయాయి. కార్యకలాపాలు నిలిపివేశాయి.
అయితే ఈ రంగంలో యూత్ ప్రారంభించిన బజార్ కార్ట్ లాంటి చిన్న సంస్థలు తమదైన ప్రత్యేకత చూపిస్తున్నాయి. ఇవి 2.7 బిలియన్ల ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్‌గా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. జలాన్ లాంటి యువ ఎంటర్ ప్రెన్యూర్ల ఆలోచనలు ఈ దిశగానే సాగుతున్నాయి.