Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకో లేఖ రాయాలని ఎంతకాలం నుండో అనుకుంటున్నాను. నా హృదయాన్నంతా ఇలా దోసిళ్ళలో తీసుకువచ్చి నీ చూపుల చేతుల్లో ఆసాంతం పెట్టిపోదామని ఎప్పుడూ తలపోస్తూనే వున్నాను. నేనెలావుంటానో నాకప్పుడైనా చూసే అవకాశం వస్తుందని అనుకుంటా. నే చేస్తున్న నా ప్రయత్నం ఏదో ఒక రోజు ఫలిస్తుందన్న ఆశమాత్రం నాలో ఇప్పటికీ వెలుగుతూనేవుంది.
నిన్నెలా పిలవాలో, ఎలా సంబోధించాలో అర్థం కాక కొన్ని లక్షలసార్లు తెల్లకాగితంలోనే తెల్లవార్లూ ఆలోచనల్ని మేల్కొలుపుతూనే ఉండేవాన్ని. 'ప్రియమైన' అని ఎంతోమంది వాడిన పదాన్నే నీ కోసం ఉపయోగించడం మనస్కరించటంలేదు. నిజంగా నీపై నాకున్న ప్రేమ, ఇష్టమూ, అభిమానమూ, స్నేహమూ, గౌరవమూ, అనురాగము, మమత, వాత్సల్యము, స్వేచ్ఛ , హక్కు, అధికారము, లొంగుబాటు, మోహము, స్వాతంత్య్రమూ, సరసమూ, ఆరాధనా, ఆత్మైక్యమూ అన్నీ కలిపిన పిలుపేదీ నాకు దొరకలేదు. వీటన్నింటినీ కలిపినదో, అన్నింటికీ అతీతమైనదో, ఏదో నాకింకా చిక్కనేలేదు. అయినా నిన్ను నిన్నుగా పిలవాలని ఎంతో కోరిక నాకు.
ఓ నా ప్రాణ సఖీ! హృదయకౌముదీ, ప్రేమ పరిమళమా, నా ఆరాధ్య సౌందర్యరసధునీ, నా భాషకుఅందని భావరూపిణీ! కవిత్వంగా నువ్వొక కల్పనవనుకుంటారు చాలా మంది. పిచ్చి వాళ్ళు.. వాళ్ళకేం తెలుసు. నిండిన ప్రేమ గుండెలు రెండుగా వుండవని. ఈ లోకపు కల్మషాలేవీ, కాలుష్యాలేవీ అంటుకోని స్వచ్ఛస్నేహార్తి నిత్యం, ఈ దేహాలకావల ఎదురు చూస్తూ నేవుంటుందని, ఈ సమాజపు భ్రమల పొరలు తొలగించి చూస్తే కానీ అర్థం కాదు. పోనీలే, వాళ్ళేమను కున్నా ఏదో ఒక నాడు తెలుసుకోకపోరు.
ఒకసారి వీళ్ళకు విడమర్చి నువ్వైనా చెప్పు. హృదయాలు, శరీరాలు, వేరువేరని తలవని ఇద్దరు, ఒకరికొరకు ఒకరు ఎదురుచూడటంలో వున్న ఆనందం ఎంత మధురమైనదో కదా! అసలు ఎదురు చూడటానికి ఒకరు వుండటం. ఎదురుచూడబడటమూ ఈ రెండింటి కంటే, అనుభూతి, సౌఖ్యమూ సుఖము మరేదేమైనా వుందా!
ఇక నా క్షేమం గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదుకదా! నీకు తెలుసు నువ్వు లేకుండా,
రాకుండా నేనెలా క్షేమంగావుంటాను. అసలు క్షేమమంటే ఏమిటో నాకిప్పటికీ అర్థం కాదు. క్షేమమంటే బ్రతికుండటమా! ఆరోగ్యంగా వుండటమా! ఐశ్వర్యంతో కొనసాగటమా!కష్టమో, బాధో, దు:ఖమో, కలహమో ఏదీ లేకుండా వుండటమా! ఇవేవి లేని కాలం మనిషికుంటుందా? ఆరోగ్యంగావున్నవాళందరూ క్షేమంగా వున్నామని, ఐశ్వర్యంతోవున్న వాళ్ళు క్షేమంగావున్నామని అనుకుంటారా? లేదు.. అనుకోలేరు. మరి క్షేమమంటే ఏమిటి? క్షేమమంటే నీ కోసం నేనుంటానని, భరోసా యివ్వటం! క్షేమంగా వున్నామంటే ప్రేమతోనేవున్నానని అంతే!