Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జస్పాల్ సింగ్ సేథీ, జస్పీత్ సింగ్ కాలేజీ రోజుల నుంచి ప్రాణమిత్రులు. చదువుకునే రోజుల్లోనే భవిష్యత్‌లో ఏం చేయాలనే దానిపై వీరిద్దరి మధ్య రోజూ చర్చజరిగేది. ఇద్దరూ కలిసి ఓ సంస్థను ప్రారంభించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అయితే చదువు ముగిసిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఎవరి ఉద్యోగం వారు చూసుకున్నారు. జస్పీత్ సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం సంపాదించి టెకీగా స్థిరపడ్డాడు. జస్పాల్ సొంతంగా ఓ టాక్స్ సర్వీస్ కంపెనీ పెట్టుకున్నాడు. కెరీర్లు వేరైనా, మనుషులు దూరమైనా వీరి స్నేహం మాత్రం మరువలేదు. రోజులు గడిచేకొద్దీ కలసి ఏదైనా చేద్దామనే ఆలోచనకు పదును పెట్టుకుంటూనే ఉన్నారు.
టెక్నాలజీ సమస్య వల్లనే
ఓ సారి జస్పీత్ ఇండియాకు వచ్చినప్పుడు జస్పాల్ సింగ్ ఆఫీస్‌కు వెళ్లాడు. అలా వెళ్లడమే పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే జస్పాల్ సింగ్ తన క్లయింట్లకు టాక్స్ ఫైలింగ్, పే రోల్ మేనేజ్ మెంట్ సేవలు అందించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దీనికి సరైన ఈఆర్పీ (ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ) సొల్యూషన్ లేకపోవడమే కారణమని జస్పీత్ అర్థం చేసుకున్నాడు. అయితే ఈ సమస్య ఒక్క తన మిత్రుని కంపెనీకి మాత్రమే కాదు... చిన్న, మధ్యస్థాయి కంపెనీలన్నింటికీ ఉందని తెలుసుకోడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న జస్పాల్ మిత్రుని ఆలోచనకు సై అన్నాడు. దాంతో 2012లో తన ఉద్యోగాన్ని వదులుకొని జస్పీత్ సిలికాన్ నుండి ఇండియాకు వచ్చేశాడు.
చిటికిలో సొల్యూషన్
తన సిలికాన్ వ్యాలీ అనుభవంతో జస్పీత్, టాక్స్ సర్వీస్ సంస్థను నిర్వహించిన ఎక్స్ పీరియన్స్‌తో జస్పాల్ జూలై 2015లో ట్యాక్స్ జిప్పిని లాంచ్ చేశారు. అలా లాంఛ్ చేసిన ఏడాది లోపే ట్యాక్స్ జిప్పి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో వచ్చే సాంకేతిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుంది. ఇది యూజర్లను బాగా ఆకర్షించడంతో ఈప్రయోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మిత్రులిద్దరూ భావించారు. తమ అనుభవాలకు పదును పెట్టి తీవ్రంగా శ్రమించి 2016, మేలో వర్క్ జిప్పిని లాంఛ్ చేశారు. ఇది చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎలాంటి సమస్యలు లేకుండా చిటికెలో సొల్యూషన్స్ అందిస్తుంది.
ఒక్కసారి ఎంటర్ చేస్తే చాలు
వర్క్ జిప్పి ఎంత చక్కగా పని చేస్తుందంటే ఒక్కసారి డిటైల్స్ ఎంటర్ చేస్తే చాలు సంస్థకు చెందిన రోజువారీ హెచ్ఆర్ కార్యకలాపాలన్నింటినీ ఆటోమేటిక్ గా నిర్వహించేస్తుంది. పే రోల్ మేనేజ్ మెంట్, ఉద్యోగుల హెల్త్ బెనిఫిట్ రోల్ అవుట్స్, ఉద్యోగులు అవుట్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు వారి ఖర్చులు నమోదు చేయడం, శాలరీ డాటా మేనేజ్ మెంట్, అటెండెన్స్, ఉద్యోగుల టాక్స్ ఫైలింగ్.. అన్నీ ఆటోమేటిక్ గా వర్క్ జిప్పి చేసి పెడుతుంది.
ఒకే ఒక్క క్లిక్‌తో...
ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి అప్ లోడ్ చేస్తేచాలు. ఓ తేదీ సెట్ చేసి పెడితే ఆ సమయానికల్లా ఆటోమేటిక్‌గా పే రోల్స్ రెడీ అయిపోతాయి. ఇందులో అద్భుతమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే.. జీతాలు చెల్లించాల్సిన తేదీని కూడా సెట్ చేసి పెడితే... ఆటోమేటిక్ గా జీతాలు ఉద్యోగుల అకౌంట్లలో క్రెడిట్ చేసేస్తుంది. దీని కోసం సంస్థ బిజినెస్ అకౌంట్ ను, ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేస్తే చాలు.
సమస్య ఎలాంటిదైనా...
ఈ విధంగా ఎంత సెట్ చేసి పెట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. సెట్ చేసిన తేదీన బ్యాంక్ హాలీడే వస్తే ఎలా..? దీన్ని పరిష్కరించడానికి కూడా వర్క్ జిప్పిలో అవకాశం ఉంది. బ్యాంక్ హాలీడే రోజు జీతాలు క్రెడిట్ చేయాల్సి వస్తే వారం ముందుగానే అలర్ట్స్ పంపుతుంది. ఈ ప్లస్ పాయింట్ వల్ల ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం మరింత మెరుగైన సేవలు అందించగలుగుతుంది. దీంతో పాటు ఎంప్లారు మేనేజ్ మెంట్ టూల్స్ అంటే.. క్యాలండర్స్, టైమ్ షీట్స్, ఎక్స్ పెన్స్ మేనేజ్ మెంట్ లాంటి వాటితో రోజువారి వ్యాపార నిర్వహణ విషయాలను వివరంగా మేనేజ్మెంట్ సులువుగా తెలుసుకోవచ్చు కూడా. దీనిలో ఉన్న ఎంబెడెడ్ ఎనలిటికల్ సామర్థ్యంతో ఖర్చులు, ఇతర పనులను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవచ్చు.
పలురకాల ప్యాకేజీలతో...
వర్క్ జిప్పి రెవిన్యూ మోడల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పలు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. పదిమంది లోపు ఉద్యోగులతో ఉన్న స్టార్టప్‌కు సెల్ఫ్ సర్వీస్ బేసిస్ మీద ఉచితంగా కూడా సేవలు అందిస్తుంది. పేరోల్ ప్లాన్ కింద ఓమాదిరి సంస్థలకు యూజర్‌కి రూ.25 చార్జ్ చేస్తారు. అయితే ఇది సెల్ఫ్ సర్వీస్ కేటగిరి కిందకే వస్తుంది. మేనేజర్ ప్లాన్ కింద వర్క్ జిప్పి మేనేజర్ స్వయంగా ఆ కంపెనీకి వెళ్లి ఉద్యోగులకు సంబంధించిన పేరోల్స్ సర్వీస్‌ను స్వయంగా నిర్వహిస్తారు. ఈ డీల్ కింద ప్రతి వంద మంది ఉద్యోగులకు రూ.3000 చొప్పున కంపెనీ చార్జ్ చేస్తుంది. అలాగే ఎలాంటి కంపెనీకైనా ఉచితంగా సేవలు అందించే ఫెసిలిటీ కూడా ఉంది. ఏ కంపెనీ అయినా వర్క్ జిప్పి ఫ్లాట్ ఫాం నుంచి ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తే ఆ సంస్థకు సేవలు ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీలతో వర్క్ జిప్పి నేరుగా ఒప్పందాలు చేసుకుంది. సామూహిక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకమైన ప్యాకేజీలను కూడా వర్క్ జిప్పి తన క్లైంట్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.
అకౌంటెట్ ప్లాన్ కూడా...
ఏదైనా కంపెనీ బాధ్యతలు వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అకౌంటెంట్లు కూడా వర్క్ జిప్పిని వాడుకోవచ్చు. ఇలా ఇరవై ఐదు కంపెనీల బాద్యతలు చూస్తున్న అకౌంటెంట్ వర్క్ జిప్పి ఫ్లాట్ ఫాంను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఏడాదికి పది వేల రూపాయలను చార్జ్‌గా నిర్ణయించారు.
టీ హబ్ తో టైఅప్
ప్రస్తుతం 1200 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీల కేటగిరిలో వర్క్ జిప్పికి 15 క్లైంట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దూసుకొచ్చిన కొన్ని స్టార్టప్స్ కూడా వర్క్ జిప్పి ఖాతాదారుల జాబితాలో ఉన్నాయి. లీన్ యాప్స్, వెంబ్లీ పెయింట్స్, జోష్ టెక్నాలజీ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పుడు వర్క్ జిప్పి క్లైంట్లు. కొత్త స్టార్టప్‌ను మరింత ప్రొత్సహించేందుకు హైదరాబాద్‌లో టీహబ్ తో పాటు 91స్పింగ్ బోర్డ్ అనే ఇంక్యూబేటర్ తోనూ టైఅప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వర్క్ జిప్పితోనే కాకుండా వీరిద్దరూ మొదట్లో ప్రారంభించిన ట్యాక్స్ జిప్పి ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. దీని ద్వారా సెల్ఫ్ ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్ ఫ్రీగా అందిస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్, ట్యాక్స్ నిపుణుల సలహాలతో ట్యాక్స్ ఫామ్ ఫైల్ చేయాలంటే ఆరు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు.
పోటీ ఉన్నప్పటికీ...
2020 నాటికి వృద్ధి ఇరవై ఐదు శాతంపైనే ఉంటుందని వీరు అంచనా వేసుకున్నారు. పెద్ద కార్పొరేట్ కంపెనీల కన్నా.. చిన్న, మధ్యతరహా సంస్థలే ఈ సేవలకు అతి పెద్ద మార్కెట్ గామారుతున్నాయి. అయితే ఈ రంగంలో పోటీ కూడా ఎక్కువే ఉంది. అయినప్పటికీ క్లియర్ ట్యాక్స్, మేక్ యువర్ ట్యాక్స్, ట్యాక్స్ టు విన్.. లాంటివి ఇప్పటికే పరుగు పోటీలో దూసుకెళ్తున్నాయి. అయితే వర్క్ జిప్పికి ప్లస్ పాయింట్ ఉంది. మిగతావన్నీ వ్యక్తిగతంగా ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్స్ అందిస్తూంటాయి. కానీ వర్క్ జిప్పి మాత్రం ఈఆర్పీ సొల్యూషన్స్ పైనా ఫోకస్ చేసింది.
తమ వర్క్జిప్పి మరింత అభివృద్ధి చేసేందుకు ఆ ఇద్దరు మిత్రులు మరో నలుగురితో కలిసి మొత్తం ఆరుగురు టీంగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ యువత బృందం తమలోని టాలెంట్‌తో అనుకున్నది సాధించేస్తారని ఈ పాటికే అందరికీ నమ్మకం వచ్చేసింది.