Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ అనేది భావనే కావొచ్చు. భావనల, కల్పనల, కలల, ఊహల నైపుణ్యాలన్నీ మనిషి గూడులోనే పురుడు పోసుకుంటాయి. మనం మనుషులమైపోవటానికి అవన్నీ అవసరమే మరి! చెలీ! ఈ నా వివరణలన్నీ నీకు బోధించాలని, నేర్పించాలని చేసినవి కావు. నేననుకుంటున్న వాటి గురించి నీవేమనుకుంటావో ఎలా స్పందిస్తావో విందామన్న కోరికమాత్రమే.
నువ్వొక విశాల గదిలో, చల్లగా శ్వేతవర్ణ వస్త్ర శోభతో వెలుగుతున్న శయ్యపై పవళించి నా ఉత్తరాన్ని యెత్తిపట్టుకుని చదువుతున్న వేళ గది కిటికీకావల సూర్య కిరణాల స్పర్శ వలన పచ్చని ఆకులన్నీ పసిడి వెలుగులు విరజిమ్ముతుంటాయి... కొమ్మలపై తన తోడుకోసం గొంతును గోముగా విప్పుతున్న కోకిల గానం, పువ్వుల నవ్వుల పలకరింపులు, నీ యేకాగ్రతను పక్కదారి పట్టిస్తాయి. ప్రకతి అందానికి పరవశించటం ఒక మారు పక్కనపెట్టి, నా మనసు అక్షర వరుసల్ని నీ నీలి కళ్ళతో నిదానంగా సృశించు.
నేనూ హించగలను.. లేఖను చదువుతున్నప్పుడు నీ మోముపై కలిగే భావ సంజ్ఞలు, చిగురుల్లాంటి నగవుల మెరుపు తీగలు, ఎగిరిపడితున్న నత్య భంగిమలను. లేఖనంతా చదివి ఒక్కసారి ఆ నీలి కండ్లపై రెప్పలను వాల్చి, నా చేతివేళ్ళ నుండి ప్రభవించిన అక్షర పత్రాన్ని నీ గుండెపై హత్తుకుని, నన్ను కలవరించు ప్రియా! నీ ఊహల దృశ్యంలోకి నేను లీలగా వచ్చి వీచికనై పలకరించిపోతాను, ఓ మధురస్మితా!
నీ కోసం ఈ లేఖ రాస్తున్నపుడు నా యెద నిండా ఆనందం పొంగిపొరలింది. రెక్కలు విప్పిన పక్షిలా అనంత భావవిహారం చేసాను. నా హృదయానికి, కలానికి ప్రేమ దారాలతో ముడులు వేసి, ప్రాణవాయువు నింపిపోసాను. ఇన్ని చేసింది నా ఆలోచనలు నీ చేతుల్లోకి చేరాలన్న ప్రగాఢమైన కోరికతోనే. లేఖలో నీ తో మాట్లాడుతున్నంతసేపు నా లోపలి గదులన్నింటినీ శుభ్రం చేస్తున్నట్టు, అంతరంగ లోగిళ్ళలో రంగవల్లులేసి, రంగులద్దినట్టు, నాలో అపూర్వ వెలుగుల కళ ఏదో కదలాడుతూనే వుంది. రాజ్యాన్ని జయించినవాడికేం తెలుస్తుంది. అదే గొప్ప కార్యమని ఈ లోకంలో మరేది అంతకంటే ఘనమైనది లేదనుకుంటాడు. ఒక సారి నిజమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన ప్రేమను గెలుచుకొమ్మని చ్వెప్పు. అదెంత మహౌన్నతమైనదో తెలుస్తుంది. ప్రేమను గెలుచుకోవడమేకాదు, ప్రేమను యిచ్చిచూడమను. మహా మహా చక్రవర్తుల కీర్తి చరిత్రలన్నీ ప్రేమముందు వెలవెలపోవాల్సిందే.
నా అజ్ఞానం కాకపోతే. ఇదంతా నా కోసం నేనే పున్ణశ్చరణ చేసుకుంటున్నా. నా మనసును పంచుకునే వాళ్ళెవరున్నారు ప్రియా.. నువ్వుతప్ప. అందుకే యేదైనా నీకే నివేదించుకుంటాను. నువ్వక్కడున్నమాటే కానీ, నా ప్రతి తలపులో, కలలో, కదలికలో నా ముందరే కనిపిస్తుంటావు. కొండంత ఆశను అందిస్తూనేవుంటావు. నీతో మాటాడుతూనేవుండాలన్న ఆతృతలో చదవటానికి నువ్వలసిపోయేంత రాస్తూనేవున్నాను. ఈ మూటకట్టిన మాటలన్నీ వీక్షించిన మరుక్షణమే నీ హృదయమయ ప్రతిస్పందనను రాగమయంచేసి నా వీనులకు విందుగా అందిస్తావని వేయికళ్ళతో ఎదురుచూస్తూ...
- ఆనందాచారి,
9948787660