Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమయం... ఎంతో విలువైనది. పాటిస్తే విజయ తీరాలకు చేరుస్తుంది. సమయం... ఎంతో కఠినమైనది. పాటించకపోతే అగాధంలోకి నెట్టేస్తుంది. వ్యక్తుల గెలుపోటముల వెనుక సమయం పాత్ర కీలకం. కొన్ని సందర్భాల్లో సమయపాలనే విజయానికి ఆధారంగా నిలుస్తుంది. కొన్నిసార్లు సమయపాలన లేకపోవడం ఓటమికి కారణమవుతుంది. అందుకే సమయం అనే దానికి అంత ప్రాధాన్యం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడంలోనూ, ఓటమి అనే పునాదులపై విజయ సౌధాలు నిర్మించడంలోనూ అసలైన మూల సూత్రం సమయమే. అందుకే ఆయా సంస్థలు కూడా టైమ్మేనేజ్మెంట్ను ఫాలో అవుతున్నాయి. మరి అలాంటి సమయ పాలన మన అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందాం...
సమయం విలువ గుర్తించకపోతే ఎలాంటి వారైనా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం బాధ్యత ఉన్నవారే కాదు, ఎవరైనాసరే ఆఫీసుకెళ్లడం, ఇంటర్వ్యూకు హాజరవడం, పని పూర్తి చేయడం.. ఇలా ఏదైనా సరే అంతా సమయం ప్రకారం చేయగలిగితే విజయం సాధ్యం. సమయాన్ని పాటిస్తూ, ఓ ప్రణాళిక రూపొందించుకుంటేనే అనుకున్న రంగంలో రాణించగలిగేది. 'ఎలాంటి బాధ్యతల్లో లేం కదా! కచ్చితంగా సమయం పాటించాల్సిన పనిలేదు' అనుకుంటే మాత్రం ఎప్పటికీ విజయం సాధించలేం.
ముందు వరుసలో ఉండాలి
విద్యార్థులైనా, ఉద్యోగులైనా, ఉద్యోగానికి ప్రయత్నించేవారైనా తమకు నిర్దేశించిన సమయాన్ని పాటించి తీరాలి. అందుకు భిన్నంగా నడుచుకుంటే ఫలితాలూ అలాగే ఉంటాయి. ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. మరొకరు ముందుకు దూసుకెళ్తారు. అందుకే ఎప్పుడూ ముందువరుసలో ఉండడానికే ప్రయత్నించాలి. ఉదాహరణకు మీరో ప్రముఖ సంస్థలో ఇంటర్వ్యూ కెళ్లాలి. సరైన సమయానికి చేరుకోకపోతే ఆ అవకాశం వేరొకరు పొందొచ్చు. ఇంటర్వ్యూకే ఆలస్యంగా వచ్చిన మీరు ఇక ఉద్యోగంలో క్రమశిక్షణగా ఏం మెలుగుతారనే నెగెటివ్ ఫీలింగ్ కూడా ఆ సంస్థ యాజమాన్యానికి కలుగక మానదు. అందుకే కచ్చితమైన సమయాన్ని పాటించి తీరాలి. అదే మిమ్మల్ని సక్సెస్‌వైపు నడిపిస్తుంది.
విసృత పరిచయాలు ఉండాలి
ఈ రోజుల్లో సమయపాలనతోపాటు విస్తృత పరిచయాలు, నెట్వర్కు కచ్చితంగా ఉండాలి. మారిన పరిస్థితుల్లో, బిజీలైఫ్‌లో ఒకరి గురించి ఇంకొకరు ప్రత్యేకించి తెలుసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి.. అవసరం వున్న చోట మీ గురించి మీరే చెప్పుకోవాలి. మీ ప్రయత్నం మీరే చేయాలి. ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. మీపట్ల మీరు పూర్తి విశ్వాసంతో ఉండాలి. సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి. అయితే ఇవన్నీ సమయపాలనలో భాగంగా, సామాజిక స్పృహతో జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. చాలా మంది ఏదో సాధించాలని ఉంటుంది. కానీ సమయం కుదరట్లేదు అంటుంటారు. ఇలా అనుకుంటే ఎన్నటికీ కుదరదు. కాబట్టి అది కుదిరేలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా వీలైతే అలా ప్రయత్నించాలి. అవసరమైతే విస్తృతమైన నెట్వర్క్ పెంచుకోవాలి. పుస్తకాలు, పత్రికలు చదవాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొందరి రిఫరెన్సు వల్ల మంచి అవకాశం దొరకవచ్చు. కొందరి సలహా మీ కెరీర్ ఎదుగుదలకు తోడ్పడొచ్చు. ఇలా ఏ ఒక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నా మీక్కావల్సింది పరిచయాలు, నెట్వర్క్, అవగాహన. అందుకే మీరెప్పుడూ నలుగురి దృష్టిలో పడాలి. ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి. మీ విజయానికి అదో మార్గం కావొచ్చు. సానుకూల దృక్పథానికీ, సరైన అవకాశాలకూ దారి తీయొచ్చు. అయితే వీటన్నింటిలోనూ సమయం పాలన, సమయ స్ఫూర్తి కీలకం.
సడన్‌గా పిలిస్తే...
మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటారు. ఓరోజు వాళ్ళు సడన్‌గా ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. అలాంటప్పుడు బయోడేటా, సర్టిఫికెట్స్ లాంటివి జిరాక్సు ఇవ్వాల్సిందిగా అడుగుతారు. అప్పుడు అవి మీ దగ్గర లేకపోత ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇస్తామని చెబితే అస్సలు బాగోదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మంచి అవకాశాలు చేజారిపోవచ్చు. మరుసటి రోజు మీ రెజ్యూమ్ ఇచ్చే వరకు ఆ అవకాశం మరొకరు సొంతం చేసుకోవచ్చు. అందుకే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సంస్థకెళ్ళినా మీ వెంట ఓ ఫైల్ తీసుకెళ్లండి. అందులో మీ సర్టిఫికెట్లు, బయోడేటా, రెజ్యూమ్ పెట్టుకోవడం మర్చిపోకండి.
మీ ప్రయత్నం మీరు చేయండి
మీరు ఓ ఉద్యోగం కోసం అప్లయి చేసువుంటారు. ఎన్ని రోజులైనా వారి నుండి ఎలాంటి సమాచారం అందదు. వాళ్ళే చెబుతారు కదా అని ఉండిపోకూడదు. మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయాలి. అసలే పోటీ ప్రపంచం. అందుకోసం మీరే చొరవ చూపండి. ఏ పత్రికలోనో, నెట్‌లోనో ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుంటే సరిపోదు. ఆ తర్వాత ఫాలో అప్ కూడా ఉండాలి. ఫోన్ ద్వారానో, ఈ-మెయిల్ ద్వారానే కనుక్కుంటూ ఉండాలి. అవసరమైతే ఆ ఆఫీస్‌కు వెళ్ళాలి.
పరిశీలించుకోండి...
పదో తరగతి కూడా పాస్ కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కలలుగంటే సాధ్యమా? అది ఎప్పటికీ సాధ్య కాదు కదా. అందుకే ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అందుకు తగిన నైపుణ్యం, అర్హతా మీలో ఉందో లేదో ఓసారి పరిశీలించుకోండి. లేకపోతే అలవర్చుకోండి. అర్హతకు సరిపోయే రంగంలో ప్రవేశించేందుకు ప్రయత్నించండి. అంతేగాని అందని ఆకాశానికి నిచ్చెనలేసినట్టు అందిరాని అవకాశాల కోసం సమయం వృధా చేయకండి.
పొరపాట్లను చక్కదిద్దుకోవాలి
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకెళ్లారు. అక్కడ మీరు సెలెక్టు కాలేదు. కానీ మీకదే సంస్థలో అదే ఉద్యోగం చేయాలని ఉంటుంది. ఏం చేస్తారు? అవకాశం చేజారిపోయిందని ఏడుస్తూ కూర్చుంటారా? కుంగి పోతారా? అలా అయితే ఇంకే ప్రయత్నంలోనూ సఫలం కాలేరు. విఫలం కావడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. పొరపాటును చక్కదిద్దుకోవాలి. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఎవరైనా సర్దుకుపోతారు. అందులో గొప్పతనమేమీ లేదు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురీదగలిగిన వారే నిజమైన విజేతలు. అలాంటి వారిలో మీరూ ఒకరిగా నిలవాలి. ఆటంకాల అవధులు దాటాలి. కొత్త మార్గాలు అన్వేషించాలి.