Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతోనే ఎవరూ నాయకులు కాలేరు. లీడర్షిప్ అంటే ఒకరు తయారు చేసేది కాదు. తమను తాము అలవర్చుకుంటేనే ఆ లక్షణాలు వస్తాయి. దూరదృష్టి, ధైర్యం, చిత్తశుద్ధి, వినయం, వ్యూహం, కలుపుకుపోయేతత్వం, చేసే పనిపై ఏకాగ్రత, కార్యాచరణ నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. వీటిని ఎలా అలవర్చుకోవాలన్నదే ప్రశ్న. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎన్ని వచ్చినా ఈ విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే కొన్ని పాటిస్తే కొంతవరకైనా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోగలం. అవేంటో తెలుసుకుందాం...
ఆలోచనా ధోరణి మారాలి
సమాజంలో ముఖ్యంగా మూడు రకాల ఆలోచనా ధోరణులు ఉంటాయి. ఇందులో మొదటిది కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉండటం. దీనివల్ల చేసే పని, ఆలోచనలో స్థిరత్వం వస్తుంది. రెండోది... ప్రణాళికాబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, మనం ఎటు వెళ్తున్నామో తెలుసుకోవడానికి, ఏది కాదో తెలుసుకోవడం, మనం ఎటు వెళ్తున్నామో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మూడోది... చేస్తున్న పనిలో ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకోవడం. దీనివల్ల మన ప్రాధాన్యం తెలుస్తుంది. సమయం ఆదా అవుతుంది.
పరిష్కారం వెదకాలి
పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఎవరికీ ఉండవు. ముఖ్యంగా మహిళలకు. ఎంత పెద్దస్థాయిలో ఉన్నా ఇల్లూ, పిల్లల బాధ్యత చూడాల్సిందే. వాస్తవాలను అంగీకరిస్తూనే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకోవాలి. ఫ్రస్టేషన్‌కు గురవ్వడం వల్ల ఉపయోగం లేదు. సమస్యలకు పరిష్కారం వెదకాలి. ఇంట్లోని కొన్ని పనులను వేరే వారికి బదలాయించాలి. చేయాల్సిన పనులను వారు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి.
సెల్ఫ్‌చెక్ తప్పని సరి
మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. ఎదుటి వారి ప్రశ్నలకు ఎలా స్పందిస్తున్నామనేది చాలా ముఖ్యం. తరతరాలుగా ఈ సమాజం కొన్ని విలువలు, సిద్ధాంతాలను బోధించింది. మహిళలకు మరీ ఎక్కువ. అయితే వీటికి మీరు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బాధితులుగా భావిస్తున్నారా...మీరు తరచూ చిర్రుబుర్రులాడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అలాగైతే కొంత సెల్ఫ్‌చెక్ తప్పనిసరి. అలాంటి సమయంలో మనం అమితంగా ఇష్టపడే నాయకుడిని గుర్తు చేసుకోవాలి. సహనంతో శాంతియుతంగా ఉన్నప్పుడే పనులు అవుతాయి. ఇది కొంత అనుభవంతో వస్తుంది.
పని చేసే చోట...
నమ్మకమే గెలుపు సూత్రం అని భావించాలి. ఆఫీసులో సంయమనం పాటించాలి. మనపై నమ్మకం కలిగేలా మాట్లాడాలి. సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. నిజాయితీగా వ్యవహరించాలి. ఫీడ్‌బ్యాక్ తీసుకుని తప్పులుంటే సరిదిద్దుకోవాలి. అవసరమైన విషయాల్లో గోప్యత పాటించాలి. కింది వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచేయాలి. ఉద్యోగులను నియంత్రించాలి. ఒప్పందాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. నిలకడైన మనస్తత్వం కలవారని నిరూపించుకోవాలి. కిందస్థాయి ఉద్యోగుల సత్తాను తెలుసుకుని దానికి అనుగుణంగా వారికి పని అప్పగించాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. పరిస్థితుల దృష్ట్యా అప్పుడప్పుడు అభిప్రాయాలు మార్చుకోవడం తప్పదు. తోటి ఉద్యోగులను భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.
సరైన సంభాషణలే...
టీమ్ లీడర్‌గా మీరుతీసుకునే ప్రతి నిర్ణయానినకీ జట్టు సభ్యులంతా మద్దతు ఇచ్చేలా ఉండాలి. మాటలతో వారిని ఒప్పించాలి. సరైన సంభాషణలే గొప్ప లీడర్‌ను తయారు చేస్తాయి. మంచి వర్క్ కల్చర్‌కు మంచి మాటే దోహదం చేస్తుంది. మామూలు సంభాషణల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
టైమ్ మేనేజ్మెంట్
లీడర్షిప్కు సమయపాలన చాలా ముఖ్యం. టైమ్ మేనేజ్మెంట్ లేకుండా ఏ పనీ సవ్యంగా సాగదు. అర్జెంట్‌గా చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. కాస్త టైమ్ తీసుకున్నా పర్వాలేదనుకున్న పనుల మధ్య విభజన రేఖలు గీసుకోవాలి. తాను టీమ్ లీడర్ అనే విషయాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ పని చేయాలి. మన సత్తా, మన పనిని నమ్ముకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సంస్థలో, సమాజంలో మనం చూడాలనుకున్న మార్పు మనతోనే మొదలుకావాలి. బలహీనత, ఆత్మన్యూనతా భావాన్ని విడిచిపెట్టాలి.