Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధురమైన భావన స్నేహం
చల్లగా సేదతీర్చి హాయినిచ్చే వీవన స్నేహం
మరపురాని మధురజ్ఞాపకం స్నేహం
జీవన పోరాటంలో నీడనిచ్చే వృక్షం స్నేహం
పసిపాప పాలనవ్వుల్లో చిందాడే సౌందర్యం స్నేహం
స్వార్థమెరుగని చెలిమి చెంతనుంటే
జీవితమే నిండుపున్నమి
వెండివెన్నెల వాడల్లో
ఘుమఘుమలాడే సుమమై విరిసిపోదా...
అమ్మలా లాలించే
నాన్నలా పాలించే
నేస్తం పక్కనుంటే
బతుకే బంగారంలా మెరిసిపోదా...
కలతలదుప్పటి నన్ను కప్పేసి
ఉపిరాడనివ్వని క్షణాన
దొరికింది నాకు నీ స్నేహం
చీకట్లో చిరుదివ్వెలా
గుబాళించే పువ్వులా
నర్తించే సిరిసిరిమువ్వలా
అప్పుడు నా మనసు
మురిసి మెరిసే రవికిరణంలా
పరవళ్లు తీసే చైతన్య జలపాతంలా
కష్టాలకడలిలో సుడిగుండాల పంజరంలో
చిక్కుకున్న నా జీవితాన
కోటి వసంతాలతో
సరికొత్త లోకాన్ని పరిచయం చేసింది నీ స్నేహం
నీ రాకతో నా మనసయింది
అందాల బృందావనం
శూన్యమైన జీవితాన
గుబులు నిండిన హృదయాన
కురిసే చిరునవ్వుల పువ్వులవాన నీ స్నేహం
నిదురించే నా కన్నులసౌధంలో
కనుమరుగైపోని కల నీ స్నేహం
నీవు నాపై కురిపించే మమతల సంద్రాన
ఎన్నటికీ చెదిరిపోని అల నీ స్నేహం
జన్మకు చెప్పేవరకు వీడ్కోలు
కమ్మని బంధమై
స్నేహలతలా నన్నల్లుకొని
అనురాగల సుమగంధమై
నన్ను వీడిపోదు నీ స్నేహం..
ఎన్నెన్ని యుగముల
నిరీక్షణ ఫలితమో గదా
నిర్మలమైన నీ స్నేహం
నేస్తమా.. ప్రియనేస్తమా
నీ చక్కని చిక్కని చెలిమి చెలిమెలో
నిండా మునిగి పరవశించిన నేను
నీ చేరువలో అనునిత్యం
మధురిమల జల్లులలో తడుస్తూ
మది నిండిన సంబరంతో
ఆలపించనా ఓ మధురగీతం
మన స్నేహగీతం...!!!
- రేవంత్ స్వామీ
9441140238