Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరి మధ్య స్నేహం పుట్టడానికి ఎక్కువ కాలం పట్టదు. కానీ, దాన్ని జీవితాంతం నిలుపుకోవాలంటే చాలా కష్టం. మరి స్నేహం కలకాలం నిలవాలటే ఏం చేయాలంటే...
స్నేహితుల మధ్య అరమరిరకలు ఉండకూడదు. ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే అవతలి వారితో మనసు విప్పి మాట్లాడాలి. అలా మాట్లాడితే తప్పు పట్టుకుంటుంకదేమో, ఇలా మాట్లాడితే సరికాదేమో... అని సందేహపడకండి. తన గురించి అంచనాలు వేస్తూ దూరంగా ఉండిపోకండి. మీ మనసుకు నచ్చింది, నిజాయితీగా మాట్లాడండి. తప్పకుండా ఎదుటి వాళ్లు అర్థం చేసుకుంటారు.
బంధం గట్టిపడాలంటే కొంత సమయం స్నేహితుల కోసం కేటాయించాలి. ఏవైనా పనులుంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఇద్దరూ కలిసి మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. నచ్చిన పదార్థాలను కొనుక్కుని తినండి. పుట్టిన రోజులూ, ఇతర ప్రత్యేక సందర్భాలప్పుడు కుదిరితే కానుక ఇవ్వండి. లేదంటే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయండి. వీటన్నింటి వల్లా మీ బంధం బలపడుతుంది.
మీకు ఏదైనా సమస్య తలెత్తితే పంచుకోవడానికి మొహమాటపడకండి. అలాంటివి చెబితే మీరేంటో అవతలి వాళ్లకి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా మీరేంటో వాళ్లకు తెలుసు కాబట్టి మీ మధ్య అపార్థాలు వచ్చేందుకు అవకాశం ఉండదు.
వాళ్ల బలహీనతల్ని స్వీకరించండి. మీ అభిప్రాయం ఏదైనా అడిగినప్పుడు... వాళ్లు చెప్పేదంతా విన్న తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. వాళ్ళకి సంబంధించిన ఆసక్తులను గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ స్నేహాన్ని దృఢంగా మారుస్తాయి.