Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ ఒడి వీడాక.. నాన్న చేయి వదిలాక.. దొరికే తొలితోడు స్నేహం. కొండంత కష్టమైనా, కడలి నిండే కన్నీళ్ళైనా పంచుకునేది నేస్తమే. చిరు చెమటల్లో చిరుగాలై.. నడి వేసవిలో మంచు బిందువై.. అడుగులో అడుగై.. జీవితాంతం మనసు పంచుకునే ఆత్మీయబంధం స్నేహం. స్నేహం కూడా ప్రేమ లాంటిదే. ఎప్పుడు, ఎందుకు, ఎవరి మీద, ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమకు స్నేహమే తొలి అడుగు అవుతుంది. ఆ మాటకొస్తే నిజమైన స్నేహితులు అతి తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే స్నేహమనేది చాలా విలువైనది. విలువైనదేదీ ఎవరికీ అంత సులువుగా దొరకదు. నిజమైన స్నేహమంటే 'నీ కన్నా ముందు నడవక నీ కన్నా వెనుక నడవక నీతో పాటే కలిసి అడుగులు వేయడమే' అంటారో రచయిత.
నిజమైన స్నేహంలో తన మిత్రులలోని మంచినీ, చెడునీ రెండింటినీ అంగీకరించే మనసుంటుంది. ఈ మానవాళిలో అత్యంత తీయనైనది, అద్భుతమైనది, ఎల్లలు లేనిది, స్వార్థం లేనిది స్నేహం మాత్రమే. రక్త సంబంధాలకు, బంధుత్వాలకు అతీతమైనది, ధనిక పేదలనే తేడా తెలియనిది, కుల, మత, వర్గ భేదాలు తెలియనిది స్నేహం. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని మనసుల మధ్య అల్లుకుపోయే పవిత్రబంధం. అది అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం తెలియదు. మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కావాలంటే మనిషికి స్నేహం చాలా అవసరం. స్నేహితులున్న వారు ఆరోగ్యంగా కూడా ఉంటారనేది వైద్యశాస్త్రం కూడా అంగీకరించిన విషయం.
రసాయనిక చర్య
స్నేహంలో అతి ముఖ్యమైనది నమ్మకం. అలాగే ఇచ్చి పుచ్చు కోవడం. అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలనుకునేవారి మధ్య స్నేహం ఎంతోకాలం నిలవదు. ఎదుటివారి మాటకు విలువ నివ్వడం అలవాటు చేసుకుంటే, ఆ స్నేహం పదికాలాల పాటు నిలిచి ఉంటుంది. ఏ స్నేహానికైనా పరిచయమే పునాది. ఒకరి సాంగత్యలో మరొకరు ఆనందం పొందుతున్నప్పుడూ, అదే సందర్భంలో తప్పును సున్నితంగా తెలియజెప్పడంలో ఉన్న నేర్పరితనం వల్లనే వారి మధ్య స్నేహం బలపడుతుంది. ఏ రకమైన స్నేహమైనా ఇద్దరి మధ్య సర్దుకుపోయే గుణం ఉండాలి. ఒకరికొకరు భావాలనూ, బాధలనూ పంచుకొనే చొరవ ఇద్దరి మధ్య ఉన్నప్పుడే ఆ బంధం దృఢమవుతుంది. సందర్భం ఉన్నా, లేకపోయినా అనుక్షణం నీడలా వెన్నంటి ఉండే వారే నిజమైన స్నేహితులు. రంగు, రూపాలతో స్నేహానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం రెండు మనస్సుల మధ్య జరిగే రసాయనిక చర్య.
పైలంగుండాలి !
'స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం..' అన్నాడో సినీ కవి. అందుకే, ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా స్నేహబంధం మాత్రమే మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఆధునిక స్నేహాలు... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆధునాతన టెక్నాలజీ పరంగా స్నేహం సరికొత్త పుంతలు తొక్కుతోంది. అయితే, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మంచిని పెంచుకోవాల్సిందిపోయి చెడు మార్గాలు పట్టడం, దానికి స్నేహం అనే ముసుగు వేయడం బాధాకరమైన విషయం. ఫేస్బుక్, ట్విట్టర్ల వంటివాటిని వినియోగించుకోవడంలో ముందున్న యువత ముక్కూముఖం తెలియనివారితో అవసరానికి మించి చనువు ప్రదర్శించడం, అవతలి వ్యక్తి అసలు ఆడో మగో కూడా తెలియకుండా స్నేహం చేస్తున్నాం అనుకోవడం వంటి వాటివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తున్నాం. కొందరు స్వార్థపరుల వల్ల స్నేహం కూడా వ్యాపారీకరణకు గురవుతున్న సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌ను సన్మార్గంలో ఉపయోగించుకున్న వారికి మంచి స్నేహితులు లభిస్తారు. కాబట్టి ఈ ఆధునిక యుగంలోనూ స్నేహానికి ఉన్న వన్నె తగ్గలేదు.
వదిలించుకోవాల్సినవి...
అవును నిజమే వది లించుకో వాల్సిన స్నేహాలు కూడా ఉంటాయి. అవి ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ఆరోగ్యకరం. మంచి స్నేహితులున్నట్లే కొంతమంది చెడ్డవారూ ఉంటారు. అలాంటి వారు స్నేహాం ముసుగులో చేసే పనుల వలన మిగతా వారిని కష్టాలు పాలు చేస్తుంది. ఒక్కొక్కసారి జీవితాలనే చిందర చేస్తుంది. వారితో జర జాగ్రత్తగా ఉండటం కంటే మరో మార్గం ఉండదు. గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కొంత వయస్సు వచ్చేవరకైనా వారి స్నేహితులెవరనేది ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంత తీరిక తల్లితండ్రులకు లేదు. ఈ బిజీ లైఫ్‌లో వారు ఇరువురూ ఉద్యోగస్తులైౖతే, వారి పిల్లలను ఎక్కడో దూరంలో ఉన్న ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచడంవల్ల వారు ఎవరితో స్నేహం చేస్తున్నారో వీరికి తెలియదు. కాబట్టి మన స్నేహితుల విషయంలో అనేక జాగ్రత్తలు అవసరం. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించాల్సిందే.
స్నేహితుల దినోత్సవానికి నాంది...
నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. సరిగ్గా 84 సంవత్సరాల కిందట అమెరికా ప్రభుత్వం ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. స్నేహ మాధుర్యాన్ని చవిచూసిన ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను గౌరవించారు, ఏకీభవించారు. ఇక అప్పటినుంచి ఈ ఫ్రెండ్షిప్ డే అలా అలా వ్యాపిస్తూ విశ్వవ్యాప్తమయ్యింది. స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు.... ఇలా ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. మనసులో స్నేహం భావం ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గుతాయి. ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివలన సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి. మనుషుల మధ్య స్నేహం ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కానీ ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది.
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా....
ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఓ నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.
- అనంతోజు మోహన్‌కృష్ణ
8897765417