Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం అనేక రకాల దినోత్సవాలు ఆవిష్కరించడం సామాన్యమైపోయింది. అందులో మదర్సే డే, ఫాదర్స్ డే, యూత్ డే, ఉమెన్స్ డే, లవర్స్ డే... ఇలాంటివన్నీ అంతర్జాతీయ స్థాయిలో నగరాల నుండి గ్రామాల వరకు చేరుకున్నాయి. అంతో ఇంతో డబ్బున్నవారు, అక్షరజ్ఞానం ఉన్నవారు తమతమ స్థాయిలో తప్పకుండా ఈ రోజులను జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ యువజన దినోత్సవం జరగడం ఓ విశేషం. నేటి తరానికి బాధ్యతలు గుర్తు చేసేందుకు, యువత శక్తిని చాటి చెప్పేందుకు 2000 సంవత్సరం నుండి ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
నేటి యువతే రేపటి భవిత. యువత శక్తి అంతులేనిది.. అపారమైనది. దేశ ఉన్నతికి, ఔన్నత్యానికి ఈ శక్తిని ఫణంగా పెడితే అన్నీ తిరుగులేని విజయాలే. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు సామాజికమైనవి. ఈ శక్తి ఎప్పుడూ అనుకూల పథంలో సాగాలి. అప్పుడే యువశక్తి దేశానికి ఎంతో మేలు చేస్తుంది. గతి తప్పితే మాత్రం అంతకు రెట్టింపు కీడుచేస్తుంది. అందుకే యువశక్తి సరైన దిశలో నడవాలి.
అవగాహన కలిగించేందుకు
ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యక్రమాల పట్ల యువతకు అవగాహన కలిగించేందుకే ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని అనేక దేశాల నుండి యువతీ యువకులు ఓ చోట చేరి తమ దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా ఉద్యోగ పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, జనాభా రీత్యా ఉన్న అవకాశాలు... తదితర అంశాలపై చర్చ జరుపుకుంటున్నారు. ఇలా భవిష్య ప్రపంచాన్నేలే యువకులు ఒకే చోట, ఒకే సారి చర్చించడం కారణంగా అందరికీ అన్ని దేశాల పరిస్థితులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో యువతకు తమ భవిష్యత్ అంచనా వేసుకోవడానికి మంచి అవగాహన కలుగుతుందనడంలో అనుమానం లేదు. ఈ ఒరవడి ''యువతరం శిరమెత్తితే... నవతరం గళమెత్తితే... లోకమే మారిపోదా... ఈ దేశమే మారిపోదా...'' అన్న ఓ తెలుగు కవి ఆశయానికి దగ్గరగా ఉంది. దీన్ని యువతీ యువకులంతా గమనంలో పెట్టుకుని తమ రాబోయే తరాలకందించాలి.
అంతర్జాతీయ యువజన దినోత్సవ ప్రాధాన్యం
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఆగస్టు 12, 1999లో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కార మార్గాలు వంటి అంశాలపై చర్చించారు. అప్పటి నుండి యువత తమ భవిష్యత్‌ని నిర్ణయించుకోడానికి దిశా నిర్దేశం రూపొందించే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 2000లో తొలి ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహించారు. ''యువత భావి పౌరులు'' అన్నది ఆ ఏటి లక్ష్యం. విద్య, ఉద్యోగం, పేదరికం, ఆరోగ్యం, వాతావరణం, డ్రగ్స్, బాలనేరాలు, ఖాళీ సమయాల్లో సేవా కార్యక్రమాలు చేయడం ఇందులో భాగంగా ఎంచుకున్నారు.
ఈ ఏడాది లక్ష్యం
అంతర్జాతీయ స్థాయిలో 10 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్కులు 180 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య ప్రపంచ భవిష్యత్‌కు దిశా నిర్దేశాలు రూపొందించే స్థాయిలో ఉంది. ప్రస్తుతం ప్రజలు ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న అత్యధిక మంది చదువుపై శ్రద్ధ చూపుతుండటం గొప్ప విషయం. అందుకే 2019కి గాను ''పరివర్తన కలిగిన విద్య'' అనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. దీని ప్రకారం అందరికీ సమాన ప్రతిపత్తిమీద విద్యనభ్యసించే అవకాశం కల్పించడం, బతుకు తెరువుకు ఉయోగపడే వృత్తివిద్యా కోర్సులు నిర్వహించడం, అందరికి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం దీని ఆశయం. ఇలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో అంతర్జాతీయ యువజన దినోత్సవం ముందుకు వెళుతుంది. ఈ ఏడాది పరివర్తనమైన విద్య అందేలా చూడడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ యువజనోత్సవాల్లో 2030 లోపు అందరికీ సమానమైన విద్య, ఉద్యోగం అన్న నినాదంతోనే చర్చ జరపాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అసెంబ్లీ నిర్ణయించింది.
మీ కంటూ కొన్ని లక్ష్యాలు
యవ్వనంలో మంచి భవిష్యత్ కోసం గట్టి పునాది వేసుకోవాలి. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. డబ్బు సంపాందించాలి. మంచి ప్రేమను పొందాలి... ప్రేమను పంచాలి. ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్‌ను కలిగి ఉండాలి. అదేవిధంగా కొత్త విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కొత్త విషయాలను నేర్చుకోవడం ముఖ్యం. యంగ్ ఏజ్‌లో ఎక్కువగా కష్టపడితే మిడిల్ ఏజ్‌లో సంతోషంగా గడపొచ్చు. దాని కోసం కొన్ని సూచనలు మీ కోసం...
మీకు నచ్చిన దానికి కోసం వెతుక్కోవడం
జీవితంలో మీరు దేనివల్ల అయితే సంతోషంగా గడపగలరో దాన్ని వెతుక్కోవడం ముఖ్యం.అది మీరు యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు. ఇది తర్వాత మీ తర్వాతి జీవన విధానానికి గొప్పగా సహాయపడుతుంది.
జీవిత ఆశయం
మీకు ఏవైనా జీవితాశయాలున్నట్లైతే వాటిని యవ్వనంలోనే నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు : సంగీత విద్వాంసులు, ఆర్ట్స్‌లో ఎక్స్ పర్ట్స్, సైంటిస్టులు...
కెరీర్ ఎక్సపరిమెంట్
మీరు ఎక్కువ బాధ్యతలు, కుటుంబ సమస్యలు లేనప్పుడు మీ కెరీర్‌కు సంబంధించి కొన్ని విషయాల్లో వినూత్నంగా ప్రయత్నించవచ్చు . అదే బాధ్యతలు ఉన్నప్పుడు అలా ఆలోచించడం కుదరదు. అందుకే ఏ ప్రయత్నం చేయాలన్నా 30ఏండ్ల లోపు పూర్తి చేసుకోవడం మంచిది.
డబ్బు సేవ్ చేసుకోవడం
మీరు యవ్వనంలో ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవడం, సంపాదించినదాన్ని పొదుపు చేసుకోవడం వల్ల మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అంతే కాదు వయసైన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బందులుండవు.
ప్రేమలో పడటం
జీవితానికి ప్రేమ కూడా ముఖ్యమే. యవ్వనం ఒక్కసారే వస్తుంది. అలాంటి యవ్వనాన్ని వృధా చేయకుండా మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన వారితో ప్రేమలో పడటం, దాన్ని వ్యక్తీకరించడం ఒక్క యవ్వనంలోనే సాధ్యమౌతుంది. వయసు మీరిన తర్వాత నిజమైన ప్రేమను పొందడం కష్టం అవుతుంది.
దేశాలను చుట్టి రండి
యవ్వనంలో ఉన్నప్పుడు కుటుంబంతో, డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్లైతే మీకు నచ్చిన ఇతర ప్రదేశాలు, దేశాలను చుట్టి రావాలి. యవ్వనంలో ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్ళి రావడం వల్ల కొత్త ఆలోచనలు చేయగలుగుతారు.
పుస్తకాలు చదవడం
యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఏది చదివినా జీవితంలో బాగా గుర్తుపెట్టుకోగల వయసు యవ్వనం.
అలవాట్లను దూరం చేసుకోవాలి
యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే జీవితానికి ఓ మంచి పునాది వేసుకోవాలి. అలాంటి జీవిత లక్ష్యం పెట్టుకొన్నవారు , చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసలుకాకూడదు. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి.