Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈతరం యువతలో చాలా మంది తమలో లోపాల్ని ఎంచుకొని ఎదుటివారిలో బలాల్ని చూస్తుంటారు. నిజానికి ప్రతి ఒక్కరిలోనూ బలహీనతలతో పాటు బలాలూ ఉంటాయి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు అవి బయటకొస్తాయి. అందుకే ప్రతిరోజూ మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకోవాలి. ఎప్పుడూ ఇబ్బందుల గురించి ఆలోచించుకుంటూ చాలామంది తమలో తామే మధనపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ భావాలే మనసులో ఉండిపోతాయి. అందుకే మనకంటే మరిన్ని ఇబ్బందుల్లో ఉన్నవాళ్ల గురించి తెలుసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు తెలుస్తుంది మన పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందీ అన్నది.
జీవితంలో చాలా విషయాల్లో రాజీపడుతూనే ఉంటాం. అందుకే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన వాటిల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం, నచ్చిన దుస్తులు వేసుకోవడం, ఇష్టమైన గ్యాడ్జెట్లు కొనుక్కోవడం... ఇలా ఇతరులతో సంబంధం లేని విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు.
ఇతరుల్లో మంచి లక్షణాల్ని గుర్తించి ప్రశంసించడం వల్ల వారిలో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. స్నేహం వృద్ధి అవుతుంది. అలాగే మనలోని మంచి గుణాలనూ మనమే విశ్లేషించుకోవాలి. వాటివల్ల జీవితంలో ఎలాంటి మార్పులు కలిగాయె గుర్తు చేసుకోవాలి. ఈ తీరు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.
చేసే పనిలో తప్పులు జరిగినప్పుడూ, తీసుకొన్న నిర్ణయం సరైనది కానప్పుడూ... ఇతరుల వద్ద వాదించడం వల్లా, దాన్ని కప్పిపుచ్చడం వల్లా ప్రయోజనం ఏముంది. మనసుతో ఓసారి మాట్లాడుకుని, నిజాయితీగా జరిగింది ఒప్పుకుని, ఆ లోపాల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిది. దీనివల్ల మనకి మనమేంటో అర్థమవుతాం.
సంతోషాన్ని కలిగించే సందర్భం ఎదురైనప్పుడు వేడుక చేసుకోవాలి. ఇతరులతో పంచుకోవాలి. అలాంటి సమయంలో నలుగురితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుస్తుంది.