Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి యువత చాలా మంది ఉదయం లేచిన దగ్గర నుంచి చదువులు, ఉద్యోగాలు, పనులతో జీవితం సాగిపోతోంది. ఈ ఒత్తిడి జీవన శైలీలో చాలామంది నవ్వడమే మర్చిపోతున్నారు. దాంతో వారిపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. అందుకే, హాస్య చతురత పెంచుకుంటే ఎంతో మంచిది. మరి హాస్య చతురతని పెంచుకోవడం ఎలాగో చూద్దాం...
మనసారా నవ్వండి: హాస్యకళని పెంచుకునే ముందు మీరు నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతోనే ఒత్తిడికి బారు చెప్పొచ్చు. ఒకవేళ మీరు రోజులో కనీసం డజను సార్లైనా నవ్వకపోతే మీరేదయినా నిస్పృహలో గాని లేదా మితిమీరిన ఒత్తిడితో బాధపడుతున్నారేమో తెలుసుకోండి.
కామెడీ సినిమాలు చూడండి: కామెడీ సినిమాలను తరుచూ చూస్తూ ఉండండి. మీ నిత్యజీవితంలో హాస్య సినిమాలను చూడడం కూడా ఓ భాగం చేసుకోండి. కామెడీ సన్నివేశాలనూ మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబసభ్యులతో ఆ హాస్య సన్నివేశాల గురించి చర్చిస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్ గా జోక్స్ కూడా వేయడం మొదలుపెడతారు.
ఇబ్బందిలోనూ హాస్యం: మీ జీవితంలో చోటుచేసుకున్న బాధాకరమైన క్షణాలను గుర్తుకుతెచ్చుకోండి. వాటిలో వినోదాత్మకమైనదేమైనా ఉందేమో కనిపెట్టండి. ఆ తరువాత వాటిని ఇంకా హాస్యభరితంగా మార్చి మీ స్నేహితులకో, బంధువులకో చెప్పండి. ఈ విధంగా చేస్తే... మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు కూడా ఎంతో హాస్య భరితంగా మారతాయి.
కోపం, నిరాశ వచ్చినప్పుడు: నిత్య జీవితంలో కోపం, నిరాశ కలిగించేవి ఎన్నో ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు సాధారణమే. కొంతమంది మాత్రం చిన్నదాన్ని పెద్దది చేసి మరీ బాధపడిపోతారు. ఇలా చేయడం మంచిది కాదు. దీనివల్ల రాను రాను ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే చిన్న చిన్న చికాకులకు కూడా నవ్వడం మొదలుపెట్టండి. మీ మూడ్ మారేదాకా నవ్వడం ఆపకండి.
హాస్య పుస్తకాలూ చదవండి: హాస్య పుస్తకాలను కూడా రోజూ చదవడానికి ప్రయత్నించండి. మీకు బాగా నచ్చిన జోక్స్‌ని కత్తిరించి మీరు తరుచుగా చూసే వాటిపై అంటే ఫ్రిడ్జ్, బీరువా, కప్ బోర్డు వంటి వాటిపై పెట్టుకుంటే చూసిన ప్రతి సారి నవ్వే అవకాశం ఉంటుంది.
క్యాప్షన్లు ఇవ్వండి: సరదాగా దిగిన ఫొటోలకూ తమాషాగా క్యాప్షన్లు రాయండి. సమయం వచ్చినప్పుడు ఆ ఆల్బంని బయటకు తీసి అందరికి చూపించి అందరూ నవ్వుకునేటట్లు చేయండి. దాంతో అంతా సందడి వాతావరణం నెలకుంటుంది.
భోజనం చేసేటప్పుడు: మీ కుటుంబ సభ్యులతో భోజనం చేస్తున్న సమయంలో సరదాగా కబుర్లు చెప్పడానికి ప్రయత్నించండి. వీలైతే వారిని కూడా తమాషా సంఘటలను చెప్పమని కోరండి. ఈ విధంగా ప్రతి సందర్భాన్ని హాస్యభరితంగా మార్చడానికి ప్రయత్నించండి.
ఎవరైనా బాధపెడితే: ఎవరైనా మీరు బాధపడేటట్లు మాట్లాడినా లేదా మీకు కోపం వచ్చేటట్టు చేసినా అందులోనూ హాస్యం ఉందేమో చూడండి. ఎవరో ఎదో అన్నారన్న బాధతో మీలో మీరు ఇబ్బంది పడకుండా అందులోనుంచి కూడా హాస్యాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించండి. జీవితంలో చోటుచేసుకునే ప్రతి సంఘటనకీ బాధ పడితే ఇక ఆనందించడానికి ఏమి మిగలదు. అందుకే జీవితాన్ని ఆశ్వాదించడం నేర్చుకోండి. ఒకవేళ, మిమ్మల్ని కావాలని తరుచూ ఎవరైనా బాధపెడితే దానికి మీరు ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవాల్సిందే. కానీ, అప్పుడప్పుడు వచ్చే సమస్యల్లోంచి మాత్రం వినోదాన్ని వెతుక్కుని సరదాగా నవ్వుకుని వాటిని వదిలేస్తే మంచిది.