Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీవీలో కామెడీ చూసి, పత్రికల్లో జోకులు చదివి నవ్వుకుంటాం. నలుగురు కలుసుకున్నప్పుడు సెటైర్లు వేసుకుని హాస్యాన్ని పండిస్తాం. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా రోజుకోసారైనా చిరునవ్వు చిందిస్తాం. మన జీవన ప్రమాణాన్ని పెంచేది హాస్యమే. మానసిక ఆందోళనలు పక్కకు పెట్టి కాస్త నవ్వి చూడండి. ఎంత రిలీఫ్‌గా ఉంటుందనేది మాటల్లో చెప్పలేం. హాస్యానికి ఉన్న పవర్ అలాంటిది. యూత్ అన్నాక కేరింతలే కాదు కొంత గిలిగింతలూ ఉండాలంటున్నారు నిపుణులు.
నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లోననూ వేగం పెరిగింది. కాలంతో పాటు పరిగెత్తేందుకు మనిషి పోటీ పడుతున్నాడు. జీవితంలో రాణించాలనే అతృతతో సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు తప్పడం లేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడి. ఆరాటం, ఆందోళన, ఉద్విగత, ఉద్రికత చోటుచేసుకుంటున్నాయి. విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వారికి ఒక్కోసారి ఓటమి ఎదురవుతుంది. జీవితమన్నాక ఇలాంటివి మామూలే. వీటి నుంచి కొద్ది సేపు బయటపడితే కలిగే ఉపశమనం మాటల్లో చెప్పలేం. ఇందుకు రకరకాల సాధనాలను ఉపయోగిస్తున్నా అని ఇచ్చే వినోదం తాత్కాలికమే. అలాంటి సాధనాలు ఎన్ని ఉన్నా దైనందిన చర్యల్లో అలసిపోయిన వారికి కాస్త రిలీఫ్ ఇచ్చేది హాస్యం మాత్రమేనని విషయాన్ని మరువొద్దు. హాస్యాన్ని ఆస్వాదించని వారి జీవితం నిస్సారంగా, నిర్లప్తంగా సాగుతుంది. హాస్యాన్ని రంగరించగలిగితే ఎందటి చేదు అనుభవమైనా మధురంగా మారుతుంది. నిరాశ, నిస్పృహలకు గురైన వారికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే బలమైన టానిక్ హాస్యం.
ఎవకీ పేటెంట్ కాదు
హాస్యంపై మనలో చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. నవ్వులు పూయించడం సినీ కమెడియన్లకే సాధ్యమయే భావన ఉంది. హాస్యం ఒకరి సొత్తు కాదు. హాస్య నటులు మాత్రమే నవ్విస్తారనే అభిప్రాయం సరికాదు. హాస్యంపై ఎవరికీ పేటెంట్ హక్కు లేదు. మనసును కాస్త మళ్లిస్తే ఎవరైనా ఎక్కడైనా నవ్వుల జల్లులు కురిపించొచ్చు. నవ్వించడం, నవ్వడం, మానసికోల్లాసాన్ని నింపడం ఎవరికైనా సాధ్యమే. నలుగురు మిత్రులు కలుసుకున్న చోట హాస్యం పండుతుంది. వీరిలో ఎవరైనా మానసిక ఆందోళనలో ఉన్నా ఈ నవ్వులే వారిలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి.
నవ్వడం ఓ కళ
హాస్య ప్రియుల్లో ఒకరకమైన వారున్నారు. ఎంతసేపూ తామే హాస్యోక్తులను విసురుతూ ఎదుటి వారు నవ్వాలని చూస్తుంటారు. కానీ... ఎదుటి వారు వేసిన జోకులను స్వీకరించరు. నవ్వరు. హాస్యోక్తి ఎవరి నుంచి వచ్చినా మనసారా నవ్వగలగడం ఒక కళ. హృదయాలను దగ్గరకు చేరుస్తుంది హాస్యం. ఆత్మీయతను పెంచుతుంది.
అపహాస్యం కావొద్దు
హాస్యం పేరుతో కొంతమంది ఎదుటివారి మనసు గాయపడే విధంగా జోకులు వేస్తారు. ఏ ఒకరిని బాధపెట్టినా అది హాస్యం అనిపించుకోదు. ఇలా హాస్యాన్ని అపహాస్యం పాలు చేయకుండా శ్రుతిమించని, సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ ఆస్వాదిస్తూ పదిమందిని నవ్విస్తూ మనమూ నవ్వుతూ కొంతమేరకైనా జీవితాలను ఆనందమయం చేసుకుందాం.