Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి 14... దీని కోసం ఎంతో మంది ప్రేమికులు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటి వరకు తమ మనుసులోనే దాచుకున్న ప్రేమను చెప్పేందుకు ఇదే మంచి రోజని ఓ నమ్మకం. అందుకే ప్రేమికుల దినోత్సవానికి ఏడాదికేడాది ప్రాధాన్యం పెరిగిపోతుంది. అయితే ప్రేమించడం గొప్ప కాదు.. ఆ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవడం గొప్ప. కొంతమంది కొన్ని రకాల పుకార్లతో ప్రేమని దూరం చేసుకుంటారు. అవేంటో చూద్దాం..
గాసిప్స్..
గాసిప్స్.. ఇతరుల గురించి అయితే ఎంతో ఎంజారు చేస్తాం. అదే గాసిప్ మీ గురించి, మీకు ఇష్టమైన వ్యక్తి గురించి అయినప్పుడు అది చాలా బాధ కలిగిస్తుంది. తరచుగా పుట్టే గాసిప్స్ ఒక్కసారిగా వ్యాపిస్తాయి. అవి ఒకరి ఖ్యాతిని తగ్గిస్తాయి. పుకార్లు నిజమో కాదో అని ఎవరూ తెలుసుకోరు. చాలా మంది కూడా విన్నదే నిజమని అనుకుంటారు. గాసిప్ ఏదైనా సరే బాధ కలిగిస్తుంది. అది మీ ప్రేమ విషయం అయితే మరింత బాధ ఉంటుంది. గాసిప్స్ విషపూరితమైనవి. ప్రేమ జీవితంలో ఏవైనా గాసిప్స్ రూపంలో వస్తే అవి మానసిక వేదనను కలిగిస్తాయి.
ఇలాంటి వారితో జాగ్రత్త...
మీ వెనుక మాట్లాడే వ్యక్తులకి సరదాగానే అనిపించినా అది ఇతురుల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో బంధాలు చాలా ముఖ్యమైనవి. కానీ ఈ రోజుల్లో బంధాలు కూడా గాసిప్స్ వల్ల నాశనమైపోతున్నాయి. ఎందుకంటే నిజమో కాదో తెలియని పుకార్లతో వారి జీవితాలను వారే చేజేతురాల నాశనం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి పై స్నేహం, ప్రేమ, పెండ్లి వంటి బంధం ఏర్పడే క్రమంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూ వుంటాయి.
మరి వీటి నుండి బయటపడటం ఎలా..?
పట్టించుకోకండి..
గాసిప్స్ పుట్టడానికి ముఖ్య కారణమేంటంటే.. క్యూరియాసిటీ. ప్రతి ఒక్కరి మీద ఎదో సమయంలో పుకార్లు వస్తాయి. ఎందుకంటే మనల్ని మానసికంగా కృంగదీయటానికి ఇలా చేస్తారు. ఆ సమయంలోనే మనం కాస్త ధైర్యం తెచ్చుకొని వాటిని ఎదురించగలగాలి. ఎందుకంటే మీరు పుకార్లను ఎంత ఆపడానికి ప్రయత్నిస్తే అంత బలంగా పెరుగుతాయి. మీ గురించి, మీ ప్రేమ గురించి ఏదైనా గాసిప్ విన్నప్పుడు అది మనసుని బాధ పెడుతుంది. ఇలాంటి పుకార్లను పట్టించుకోకుండా ఉంటే మీకు మీరే సాయం చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వాటిని పట్టించుకుంటే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. నిజానికీ గాసిప్స్ బాధని కలిగిస్తాయి..కానీ, వాటిని పట్టించుకోకపోవడమే అసలైన మందు. దీనికోసం మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకునేలా ప్రయత్నించండి. కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన స్నేహితులతో బయటకు వెళ్లండి. దీని వల్ల గాసిప్స్ పుట్టించే వారు వాటివల్ల మీరు బెదరడం లేదని తెలిసి వారే మానేస్తారు.
వినకుండా వెళ్ళిపోవడం మంచిది
మీకు ఇతరుల గురించి చెప్పే వారు.. మీ గురించి కూడా గాసిప్స్ సృష్టిస్తారు అని తెలుసుకోండి. ఎవరైనా మనకి ఏదైనా విషయంలో గాసిప్స్ చెప్పేటప్పుడు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే పక్క వారి కోసం మాట్లాడే వారు రేపటి రోజున మన గురించి కూడా మాట్లాడతారు. అందుకే అలాంటి వారు స్నేహతులైనా వారి మాటలను మనం వినకుండా వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే మీరు ఎవరితో ఎంత బాగున్నా సరే , ఆ వ్యక్తికి మీతో ఇతరుల గురించి గాసిప్స్ చెప్పే అలవాటు ఉంటే ఏదో ఒక రోజున మీ గురించి కూడా అలాంటివి సృష్టిస్తారు. భవిష్యత్‌లో మీరు వారు సృష్టించే గాసిప్స్‌కి బాధితులు అవుతారు. మీరు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేదా వారు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మీరు అక్కడ ఉండొద్దు.
ఒంటరిగా ఓడించలేం
ఒక వేళ ఎవరైనా మీ మాజీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలిని కలిపే విషయంలో గాసిప్స్ సృష్టిస్తే.. దాని గురించి మీ పార్టనర్‌కి ముందుగానే చెప్పడం మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మద్దతు మీకు ఉన్నంతవరకు మీ గురించి ఎంత మంది ఏం మాట్లాడినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి పుకార్లను ఒంటరిగా ఓడించలేం. మన భాగస్వామి మనకి తోడు ఉన్నప్పుడు ఎంతటి పుకార్లు ఆయినా మనం నవ్వుకుంటూ వదిలేస్తాం. అందుకే ఆ సమయంలో వారి మద్దతు చాలా ముఖ్యం.
నమ్మినవారితో పంచుకోండి..
ఎవరైనా మీ గురించి గాసిప్స్ సృష్టించినప్పుడు వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే, అన్నింటి కంటే బాధాకరమైన విషయం ఏంటంటే నమ్మక ద్రోహం. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేసినప్పుడు మనం తట్టుకోలేం. ఆ సమయంలో పుకార్ల కంటే నమ్మక ద్రొహం చేశారనే బాధే ఎక్కువ ఉంటుంది. కానీ ఇది నిజం. పుకార్లు ఎక్కువగా మనకు తెలిసిన వ్యక్తి నుంచే వస్తుంటాయి. ఎందుకంటే వారికే మన గురించి ఎక్కువ తెలుస్తుంది.
నమ్మిన వారితో పంచుకోండి
ఒక బంధం నుంచి విడిపోయిన తర్వాత గాసిప్స్ పుట్టడం సాధారణమే. ఒకరి జీవితాల గురించి తెలుసుకోవటానికి చాలా మంది ఆతృత చూపిస్తూ ఉంటారు. అది నిజామా కాదా అని కూడా ఆలోచించారు. ఎందుకంటే ఏదో తెలుసుకోవాలన్న ఆతృతతో ఇంకొకరికి చెబుతారు. అయితే ఇటువంటి పుకార్లు విన్నప్పుడు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీరు ఇవన్నీ ఒంటరిగా అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు విశ్వసించగల ఓ స్నేహితుడు మీకు ఉంటే మీరు అతనిని లేదా ఆమెను నమ్మొచ్చు. ఆ సమయంలో మీ స్నేహితుడితో ఇవి పంచుకున్నప్పుడు మనసు తేలిక అవుతుంది. అందుకే ఇలాంటప్పుడు ఎల్లప్పుడూ తెలిసినవారి సాయం తీసుకోండి. ఇలాంటి పుకార్లను ఎదిరించే ధైర్యం కూడా వస్తుంది.