Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు వదిలిన చోటే
ఉబికే కన్నీటి ధారల్లో నిన్నే చూసుకుంటూ
జారిపోయే కాలానికి అడ్డు పడకుండా
జ్ఞాపక పుటలను తాజా చేసుకుంటూ
ఇక్కడే.. నువ్వు వదిలిన చోటే ఆగి ఉన్నాను
బతుకు దారుల్లో
సాఫీగా సాగిపోయే మలుపులెన్నో ఎదురైనా
జీవించిన ఆ పురా క్షణాలకే ఇంకా మైమరిచిపోతూ
తీయని వేదనలో రగిలే మనసు
అద్దంలో నన్నో, నేనైన నిన్నో పట్టి చూపుతుంటే...
ఇక్కడే.. నువ్వు వదిలిన చోటే ఆగి ఉన్నాను
ప్రియా!
సమయం మహా మోసకారి
అప్రస్తుతంలో ప్రస్ఫుటమై
కోల్పోయిన ప్రస్తుతాన్ని పశ్చాత్తాపంలో ముంచెత్తి
దిగులు సంద్రమై వీపును అంటిపెట్టుకుంది
అందుకే
ద్ణుఖ తావులేని నీ చిరునవ్వుల సంతకాన్ని
గుండె గదుల్లో భద్రపరుచుకుని
ఇక్కడే.. నువ్వు వదిలిన చోటే ఆగి ఉన్నాను
ఎద చేసే లయాత్మక సవ్వడిలో
కన్నులు చెప్పే అద్భుత రహస్యాలకు తుదీ మొదలు లేనేలేవు
గుండెను చెవులు చేసి వినే
నిష్కల్మష నా 'జాను' సృష్టికే ఒక్కటి
అడుగిడిన చోటల్లా
ఉనికే నక్షత్ర దీపమై వెలుతురు పంచుతుంటే
అగాథపు చీకటిని కోరతానా?
అందుకే...
ఇక్కడే.. నువ్వు వదిలిన చోటే ఆగి ఉన్నాను
- నస్రీన్ ఖాన్,
9652432981