Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తూ ఐదెంకల్లో వేతనం అందుకుంటున్నా.. జీవితంలో ఏదో సేవా స్ఫూర్తి లోపించిందనే వేదన ఎంతో మంది ఉద్యోగుల్లో కనిపిస్తుంది. తమకు వచ్చిన పని సమాజ హితానికి ఉపయోగించటం లేదనే భావన ఎక్కువగా నెలకొంది. ప్రొఫెషనల్ సేవల నిమిత్తం ఎన్నో ఎన్జీఓలు నిపుణులకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించలేక రాజీపడుతున్నాయి. ఉచిత సేవ కోసం ఎదురుచూస్తున్న ఎన్జీఓలు ఎక్కడో ఉంటున్నాయి. ఉచితంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్న వారు మరెక్కడో ఉంటున్నారు. 'చెజుబా' ఈ ఇద్దరినీ కలుపుతోంది.
ఉచిత సేవలు
సమాజ హితానికి కేరాఫ్ అడ్రస్‌గా ఎదుగుతోన్న చెజుబా, గ్లోబల్ వాలంటీర్ ఫ్లాట్‌ఫామ్‌గా మారింది. కిరిగిస్థాన్లోని ఎస్ఓఎస్ ఎన్జీఓ లేఖల తర్జుమా పనిని ఆన్లైన్ వాలంటీర్ల సాయంతో కేవలం మూడు వారాల్లోనే పూర్తి చేసింది. ఆన్లైన్ వాలంటీర్ ఎంత శక్తివంతమైనదో రుజువు చేసింది. సాయానికి నయా నిర్వచనం ఇచ్చిన చెజుబా, స్వచ్ఛంద సంస్థలకు సహాయ పడాలంటే ఆర్థిక తోడ్పాటో, సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకోవటం మాత్రమే కాదు.. అవసరమైన ప్రొఫెషనల్ వృత్తి నైపుణ్యం అందించటం అని చెబుతోంది. చెజుబా ఆన్లైన్ వాలంటీర్లో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 38 దేశాల నుంచి 3500 ఎన్జీఓలు రిజిస్టర్ చేసుకున్నాయి. 103 దేశాలకు చెందిన ఆన్లైన్ వాలంటీర్లు తమ సేవలు ఉచితంగా అందించేందుకు చెజుబాతో కలిసి నడుస్తున్నాయి.
ఆలోచన ఆవిష్కరణ ఇలా
సుఖేంద్ర, జగన్‌లు ఐఐటీ దన్బాద్ (ఐఎస్ఎం)లో క్లాస్మేట్స్. అక్కడ చదువుతున్న రోజుల్లోనే కోల్‌కతకు చెందిన ఓ సంస్థ సహకారంతో ఎన్జిఓలతో కలిసి పనిచేశారు. రష్యా, మలేషియా, మయన్మార్‌లలో అనాథ పిల్లల విద్యకు పాటుపడుతున్న సంస్థలకు ఉచిత సేవలు అందించారు. ఆ ఆలోచనకు ఆకర్షితులైన సుఖేంద్ర, జగన్‌లు కాలేజ్‌లోనే సదరు సంస్థ బ్రాంచీ తెరిచారు. కానీ, ఎన్జీఓలు ఉన్న ప్రదేశాలకు వెళ్లటం, బస వంటి ఏర్పాట్లు పూర్తిగా వాలంటీర్లు చూసుకోవాలి. ఖర్చుతో ముడిపడిన కార్యక్రమానికి పెద్దగా స్పందన రాలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సుఖేంద్ర మయన్మార్‌లో పని చేస్తుండగా చెజుబా ఆలోచన తట్టింది. అప్పటి వరకు ఎన్జీఓలకు సాయం అనగానే అవి ఉన్న ప్రదేశాలకు వెళ్లి చేయటమే. కానీ ఎన్జీఓలకు అంతకుమించి అవసరాలు ఉన్నాయని, వాటిని వాలంటీర్లు తాము ఉంటున్న చోటు నుంచే అందించవచ్చని తెలుసుకున్నాడు. జగన్, అడెలాలతో కలిసి చెజుబా అంకురానికి అంకురార్పణ చేశాడు. బర్మీస్ భాషలో థ్యాంక్యూను చెజుబా అంటారు. ప్రొఫెషనల్ సేవలను ఉచితంగా అందించే అంకురానికి 'చెజుబా' అని పెట్టారు.
వినూత్న ఆలోచనలతో
చెజుబా ఆన్లైన్ వాలంటీర్లో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. సామాజిక సేవా ద్పక్పథం కలిగిన వారికి చెజుబా ఓ సోషల్ మీడియా వేదికగా రూపొందాలని వ్యవస్థాపకుల ఆశయం. అందుకు 'గివింగ్ బ్యాక్ టూ సోసైటీ' నినాదంతో ఆన్లైన్ వాలంటీర్లను ఆకర్షిస్తోంది. ఆన్లైన్ వాలంటీర్లు తాము అందించిన సేవలకు గాను చెజుబా ఇంపాక్ట్ పాయింట్లు పొందుతారు. ఈ పాయింట్లను సైతం మంచి పనికి ఉపయోగించుకునే సౌకర్యం చెజుబా కల్పిస్తోంది.
విప్లవాత్మక మార్పులు
బహుళ జాతి సంస్థలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి బడ్జెట్ ఖర్చు కాకుండా మిగిలిపోతుంది. కొన్ని సంస్థలు స్వయంగా సిఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమాలు చేస్తున్నాయి. చెజుబాతో చేతులు కలిసి సిఎస్ఆర్ సహా ఉద్యోగుల్లో హ్యాపినెస్ కంట్రిబ్యూషన్ తీసుకురావచ్చు. దీనిలో భాగంగా ఐటీ కంపెనీల ఉద్యోగులు వారంలో ఓ గంట ఎన్జీఓలకు అవసరమైన పని చేసి పెడతారు. ఉద్యోగుల్లోనూ తమ వృత్తి నైపుణ్యం సమాజహితానికి ఉపయోగపడిందనే సంతోషం వారిని మానసికంగానూ మంచి స్థితిలో నిలిపేందుకు దోహదం చేయనుంది. ఈ మేరకు టాటా, ఐటీసీ, నాస్కామ్, కాగ్నిజెంట్ వంటి సంస్థలతో చెజుబా నిర్మాణాత్మక చర్చలు జరుపుతోంది. హ్యాపినెస్ కంట్రిబ్యూషన్ సత్ఫలితాల్ని అందిస్తే ఆన్లైన్ వాలంటీర్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
ప్రశంసలు అందుకున్నారు
సామాజిక మార్పులో చెజుబా తొలి అడుగులు మంచి ఫలితాలు సాధించాయి. ఆన్లైన్ వాలంటీర్‌తో పాటు ఇటీవల సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థతో ఆన్సైట్ వాలంటీర్ సేవలు సైతం ప్రారంభించింది. గురుకుల డిగ్రీ కాలేజీల విద్యార్థినిలతో గివ్ (గర్ల్ ఇంపాక్ట్ వాలంటరీ ప్రోగ్రామ్) కార్యక్రమం చేసింది. ఎంపిక చేసిన విద్యార్థినులను బెంగళూరు కేంద్రంగా పని చేసే వివిధ ఎన్జీఓలతో కలిసి పని చేయించారు. గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, విద్యా రంగాల్లో పని చేస్తున్న ఎన్జీఓలు అధికంగా చెజుబా సేవల నుంచి లబ్ది పొందుతు న్నాయి. స్టార్టప్ ఇస్తాంబుల్- 100లో చెజుబాలో చోటు లభించింది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ టాప్-50 అంకుర కంపెనీల జాబితాలో చెజుబా నిలిచింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాకు చెజుబా షార్ట్‌లిస్ట్‌లో నిలిచింది.
చెజుబా సేవలు వినియోగం
చెజుబా ద్వారా ఎన్జీఓలు ఎటువంటి పనులైనా చేయించుకోవచ్చు. ఎన్జీఓలు తమ వెబ్సైట్ డెవలెప్మెంట్, సోషల్ మీడియా పేజీలు, రైటింగ్ ప్రొఫెషనల్స్ ఫ్రూఫ్ రీడింగ్, అనువాదం, ఆడిటింగ్.. ఇలా అన్ని రకాల సేవలను ఎన్జీఓలు వినియోగించుకోవచ్చు. ముందుగా చెజుబాతో తమ ఎన్జీఓను రిజిస్టర్ చేసుకోవాలి. అవసరమైన పని వివరాలతో చెజుబాలో పోస్ట్ పెట్టాలి. ఆన్లైన్ వాలంటీర్‌కు సిద్ధంగా ఉన్న వాలంటీర్లు సైతం తమ వృత్తి నైపుణ్యం వివరాలతో చెజుబాతో రిజిస్టర్ కావాలి. చెజుబా వేదికగా ప్రొఫెషనల్ సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎన్జీఓలకు ఆన్లైన్ వాలంటీర్లు ఆ పని చేసి పెడతారు. ఇందుకు ఎన్జీఓలు ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన పని లేదు. వాలంటీర్లు ఎటువంటి ఫీజు ఆశించరు. ఇలా ఎన్జీఓలు తమకు అవసరమైన ఎన్ని పనులైనా అందుబాటులోని ఆన్లైన్ వాలంటీర్ల సాయంతో పూర్తి చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇంటర్నెట్లో డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.చెజుబా. నెట్‌ను విజిట్ చేయండి.
సృష్టిలోని ప్రతి నైపుణ్యం సమాజ హితానికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్పం చెజుబా తీసుకుంది. సమాజ హితం లక్ష్యంగా సాగుతున్న చెజుబా ప్రయాణంలో మనమూ భాగస్వాములం అవుదామా మరి..!
- శ్రీనివాస్