ఎన్నికల నిర్వహణలో ప్రొసిడింగ్ అధికారులదే కీలకపాత్ర
- వేములవాడ మున్సిపల్ కమిషనర్ గంగారాం నవతెలంగాణ-వేములవాడ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ప్రొసిడింగ్ అధికారులదే కీలకపాత్ర ఉంటుందని మున్సిపల్ కమిషనర్ గంగారాం అన్నారు. త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్బంగా పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్హాల్లో గురువారం ప్రొసిడింగ్, అసిస్టెంట్ ప్రొసిడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు, మాస్టర్ ట్రైనర్లు యాదగిరి, శ్రీధర్, కమలాకర్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సందర్భగా ముఖ్య సర్టిఫికెట్లు, బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఎన్నికల సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమావళిని అనుసరించి నడుచుకోవాలని, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి తప్పుఒప్పులు దొర్లకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.