- ఆశావహుల్లో ఉత్కంఠ
- మున్సిపాలిటీ ఎన్నికలపై గ్రామాల్లో చర్చ
నవతెలంగాణ- కరీంనగర్ రూరల్
కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం నేడు ప్రకటిస్తుందా..లేదా రేపు ఖరారు చేస్తుందా అనే విషయంపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో భాగంగా మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీగా అవతరించింది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం తెర లేపగానే కొత్తపల్లి పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికారులు ఇప్పటికే వార్డుల విభజన పూర్తి చేశారు. ఓటర్ లిస్టులో తప్పుగా ఉన్న పేర్లను, డబుల్ పేర్లను తొలగించి ఓటర్ లిస్టును సైతం సిద్ధం చేశారు. వివిధ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలను నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం గురువారం, శుక్రవారం శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లోనే మున్సిపాలిటీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ తంతు పూర్తి అయితే ఈ నెల 20న మున్సిపాలిటీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ నాయకులు తమకు పార్టీ టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీజేపీ నాయకులు ఎంపీ బండి సంజరు కుమార్ ఇంటి చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. రిజర్వేషన్లను అనుకూలిస్తే బరిలో నిలిచి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.
ఓటర్లు..వార్డులు..
కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీలో 9421 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4803, పురుషులు 4618 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్టీలు 101, ఎస్సీలు 1709, బీసీలు 6462, ఇతరులు 1149 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు కొత్తపల్లి మున్సిపాలిటీని 12 వార్డులుగా విభజించారు. వార్డుల వారీగా ఓటర్లు మొదటి వార్డులో 814, రెండో వార్డులో 852, మూడులో 765, నాలుగులో 713, ఐదులో 888, ఆరులో 879, ఏడో వార్డులో 743, 8వ వార్డులో 719, 9వ వార్డులో 809, పదో వార్డులో 782, 11వ వార్డులో 732, 12వ వార్డులో 760 మంది ఓటర్ల లిస్టును సిద్ధం చేశారు. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పలువురు రాజకీయ నాయకులు తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే మూడు పాఠశాలలను ఎంపిక చేసినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
Authorization