- దేశంలోని ఉత్తమ స్టేషన్లలో స్థానం
- రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎంపిక
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చొప్పదండి
- జాతీయ స్థాయి సర్వేకు అర్హత
ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రత్యేకతకు చొప్పదండి పోలీసులు మరో ఖ్యాతిని అందుకునేలా ముందడుగు వేస్తుంది. దేశంలోని పోలీస్స్టేషన్లలో ఉత్తమ స్థానాల్లోనే చొప్పదండి ఎంపికకానుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు పోలీస్స్టేషన్లకు స్థానం లభించగా అందులో చొప్పదండి ఒకటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ను జాతీయ స్థాయిలోనే ఉత్తమ ఠాణాగా నిలిపేందుకు అవసరమైన ఒక్కొక్క మైలురాయిని దాటుతున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ జాబితాలో ఈ స్టేషన్‌ను నిలబెట్టేలా అనునిత్యం శ్రమిస్తున్నారు. దీనికి గాను ఆధునిక సాంకేతికత సహా శాంతిభద్రతల పరిరక్షణలో భిన్నమైన పంతాలో నడుస్తూ ఆచరణలో ముందుంటున్నారు.
నవతెలంగాణ-చొప్పదండి
జాతీయ స్థాయి సర్వేకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండితో పాటు రాష్ట్రంలోని మరో రెండు పోలీస్స్టేషన్లు ఎంపికయ్యాయి. వీటితో పాటు జాతీయ స్థాయిలో 77 పోలీస్స్టేషన్లు ఇందుకోసం పోటీపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు పోలీస్స్టేషన్లలో ఒకటిగా చొప్పదండి పోలీస్‌స్టేషన్ పోటీలో నిలిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏకైక పోలీస్‌స్టేషన్ చొప్పదండి బరిలో నిలవడం విశేషం. ఇప్పటికే ఆన్లైన్లో అందుతున్న సేవలలో తగిన గుర్తింపును పొందింది. అంతేకాకుండా త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ స్థాయి పరిశీలకులు నిర్వహించే సర్వేకు అర్హత సాధించింది.
లభించిన గుర్తింపు సేవలు
సాధారణంగా అందించే సేవలతో పాటు ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించిన స్టేషన్లను కేంద్ర హోం మంత్రిత్వశాఖ గుర్తిస్తుంది. ఆన్లైన్ వేదికగా పొందిన అర్జీల ఆధారంగా పోటీలో ఉండే పోలీస్స్టేషన్లను ఎంపిక చేసి ర్యాంకులో నిలబెట్టేందుకు అవసరమైన మార్కులను పాయింట్ల రూపంలో అందిస్తుంది. ప్రత్యేకంగా ఆన్లైన్లో సేవలను వినియోగిస్తున్న తీరు ఆధారంగా చొప్పదండి పోలీస్‌స్టేషన్ పోటీలో ముందు వరుసలోకి వెళ్ళింది. సీసీటీఎన్ఎస్.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం సేవల్లో మెరుగైన పనితీరును కనబర్చింది. దీంతో 50 శాతం మార్కుల ప్రగతిలో ప్రతిభ ఆధారంగా ముందువరుసలో నిలిచింది.
పరిశీలనకు రానున్న కేంద్ర బృందం
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్స్టేషన్లకు గాను రాష్ట్రవ్యాప్తంగా మూడు పోలీస్స్టేషన్లు ఎంపిక కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చొప్పదండి పోటీలో నిలిచింది. అయితే త్వరలో క్షేత్రస్థాయిలో ఇక్కడి స్థితిగతులను స్వయంగా పరిశీలించేందుకు గాను కేంద్ర బృందం రానున్నట్టు విశ్వసనీయమైన సమాచారం. జాతీయ స్థాయి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి మార్కులు వేయనున్నారు. 70శాతం మార్కుల కోసం జరిగే తనిఖీలో భాగంగా వారు నివేదిక అందించనున్నారు. దీని ఆధారంగా జాతీయస్థాయిలో మూడు అత్యుత్తమ పోలీస్స్టేషన్లతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల వారీగా ఉత్తమ పోలీస్‌స్టేషన్ ఏదనేది అధికారికంగా వెల్లడిస్తారు. దీంతో కీలకమైన ప్రక్రియ కోసం చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ను ముస్తాబు చేస్తున్నారు. సౌకర్యాల కల్పనతో పాటు సేవల్లో ప్రత్యేకతను చాటేలా తీర్చిదిద్దుతున్నారు. దీనికి గాను కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
పరిగణలోకి తీసుకునే అంశాలు
కేంద్ర ప్రభుత్వ అధికారులు త్వరలో నిర్వహించే సర్వేలో భాగంగా చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో అందించే సేవలను ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. సిబ్బంది పనితీరు, నేరాల విషయంలో స్పందిస్తున్న తీరు, సామాజిక బాధ్యత, వినియోగిస్తున్న సాంకేతికత దస్త్రాల వినియోగం, హెల్ప్‌డెస్క్, స్నేహపూరిత వాతావరణం, ఫిర్యాదుదారులు సందర్శకులకు ప్రత్యేకంగా వెయిటింగ్ గది వంటి వాటిని పరిశీలించనున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాలు, పోలీసులతో ప్రజల పరస్పర సంబంధాలు, సౌకర్యవంతమైన వాతావరణం, వసతుల కల్పన ఇలా అన్ని కోణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇవే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు సహా ఇతర విషయాలను ప్రజలతో పాటు సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు. మహిళలకు రక్షణ, ఎస్సీ ఎస్టీల నేరాల తీరు, ఆస్తి సంబంధిత నేరాల ఆధారంగా పోలీస్‌స్టేషన్ పనితీరును అంచనా వేయనున్నారు. ఈ సమయంలో పోలీస్‌స్టేషన్ వాతావరణం, పచ్చదనం పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇలా అన్ని రకాలుగా ఇక్కడి పరసరాల రూపురేఖలను మార్చేలా పోలీసులు తగిన కసరత్తులు చేస్తున్నారు. 5 ఎస్ విధానంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేయనుండగా చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ను మరింత ఆప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఉత్తమ స్టేషన్‌గా అన్ని కోణాల్లో ముందుంచేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా అన్నింటిలో టాప్‌లో నిలిచి జాతీయస్థాయిలో 77 పోలీస్స్టేషన్లలో ఒకటిగా చొప్పదండి పోలీస్‌స్టేషన్ నిలవడంతో సీపీ కమలాసన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ను కరీంనగర్ సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ స్థాయిలో చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ను నిలిపేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు.
Authorization