- ఆపరేషన్ చేస్తున్న వీడియో ఎడిట్ చేసి పోస్టు నవతెలంగాణ - హుజూరాబాద్ రోజురోజుకు టిక్‌టాక్ వీడియాల పిచ్చి శృతిమించుతోంది. ఓ వైద్యుడు చేస్తున్న ఆపరేషన్ వీడియోను ఎడిట్ చేసి కొందరు టిక్‌టాక్ చేయడం కలకలం రేపింది. ఆదివారం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. హుజూరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఓ వ్యక్తికి ఆపరేషన్ చేస్తుండగా తీసిన వీడియోపై కొందరు ఇటీవల వచ్చిన విజిల్ సినిమాలోని మాటలు కలిపి ఎడిట్ చేసి టిక్‌టాక్‌లో పెట్టారు. మాకు సంబంధం లేదు : డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి టిక్‌టాక్ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆపరేషన్ వీడియో వైరల్ కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆపరేషన్ చేస్తుండగా సాధారణంగా వీడియో తీసి పేషంట్ బంధువులకు ఇస్తామన్నారు. అలాగే అరుదైన శస్త్ర చికిత్సల సమయంలో వీడియో తీస్తామని తెలిపారు. ఎవరో కావాలనే ఆపరేషన్ థియేటర్లో మామూలుగా తీసిన వీడియోను ఎడిట్ చేసి టిక్‌టాక్‌లో పెట్టారని చెప్పారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని తెలిపారు.