Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-పాల్వంచ
తనపై నమ్మకముంచి తనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వనమా విస్తృతంగా పర్యటించి రూ.1.25 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.27.50లక్షల వ్యయంతో రాహుల్ గాంధీ నగర్లో సిమెంట్ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులకు, రూ.30 లక్షల వ్యయంతో స్థానిక సీ కాలనీ సెంటర్ వద్ద ఆటో స్టాండ్ నిర్మాణం, రూ.16 లక్షల వ్యయంతో కాంట్రాక్ట్ కాలనీలో రోడ్లు, రూ.10.50 లక్షల వ్యయంతో నెహ్రూనగర్‌లో రాతిచెరువు వద్ద డ్రెయిన్ల నిర్మాణం, రూ.41 లక్షల వ్యయంతో అయ్యప్పనగర్ నుండి పాత పాల్వంచ వరకు మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వనమా మాట్లాడుతూ తనపై నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎన్నటికీ మరువనని, వారి సమస్యలపై నిత్యం శ్రమిస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను దశలవారీగా అమలు చేస్తున్నానన్నారు. అభివృద్ధిలో తానెప్పుడూ వెనుకంజ వేసేది లేదన్నారు.
వనమాను ఘనంగా సత్కరించిన
రాహుల్ గాంధీనగర్ మహిళలు
అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన వనమాకు ఆయా ప్రాంతాల ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. రాహుల్ గాంధీ నగర్ మహిళలు మంగళహారతులు పట్టారు. గజమాలతో, పట్టు శాలువాలతోను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఏఈ రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి కుమారి, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఇంజినీర్ రవి, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, శ్రీరామమూర్తి, ముత్తయ్య పాల్గొన్నారు.