గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 31-36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22-27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
సాగు సూచనలు
వరి : ముదురు నారు వేసే పరిస్థితుల్లో కుదుర్లు దగ్గర దగ్గరగా అంటే ఒక చదరపు మీటరుకు 44 కుదుర్లు, కుదురుకు 4-5 మొక్కలు ఉండే విధంగా కొనలు తుంచి నాటుకోవాలి. నాటు వేసిన నాలుగు రోజుల్లో ఎకరానికి లీటరు బ్యూటక్లోర్ లేదా 35 గ్రాముల ఆగ్జాడైఅర్జిల్ లేదా 400 మి.లీటర్ల ప్రిటిలాక్లోర్ లేదా 4 కిలోల బెన్ సల్ఫురాన్ మిథైల్ 0.6శాతం, ప్రిటిలాక్లోర్ 6శాతం గుళికల మిశ్రమాన్ని 20కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో నీరు పల్చగా ఉండేటట్టు చూసుకొని వేయాలి. కలుపు మందు వేసిన రెండు నుంచి మూడు రోజుల వరకు పొలంలో నుంచి నీరు బయటికి పోకుండా చూడాలి. నాటిన 20 నుంచి 30 రోజుల మధ్య ఎకరానికి కార్బోపురాన్ 3 జీ గుళికలు 10కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానీలిప్రోల్ గుళికలు 4 కిలోల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి వేసినట్టయితే కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగులను నివారించొచ్చు.
వరిలో తాటాకు తెగులు గమనించడమైంది. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. గత వారం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరిలో ఆకునల్లి ఉధృతి గమనించడమైంది. దీని నివారణకు లీటరు నీటిలో 5 మి.లీటర్ల డైకోపాల్ లేదా ఒక మి.లీటరు స్పైరోనోమేసిఫిన్ కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అగ్గి తెగులు సోకే సూచనులున్నాయి. దీని నివారణకు లీటరు నీటిలో 0.5 గ్రాము ట్రైసైక్లాజోల్ లేదా 0.5 మి.లీటరు ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీటరు కాసుగామైసిన్ కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న: ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకొని పూత దశలో ఉన్న పైరుకు ఎకరానికి 45 నుంచి 50 కిలోల యూరియా, 30 నుంచి 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని పైపాటుగా వేయాలి.
పత్తి: ప్రస్తుతం కురిసే వర్షాలను ఉపయోగించుకొని పైపాటుగా పైరు 60 రోజుల దశలో ఎకరానికి 50 కిలోల యూరియా, 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి వేయాలి. ప్రస్తుత వాతావరణం వివిధ రకాల ఆకుమచ్చ తెగుళ్లు సోకేందుకు అనుకూలం. నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 2 గ్రాముల ప్లాంటామైసిన్, ఒక గ్రాము స్ట్రైఫ్టోమైసిన్ కలిపి మొక్క అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. కిలో యూరియాలో 2.5 గ్రాముల స్ప్రింట్ లేదా సాఫ్ కలిపి మొక్క మొదళ్ల దగ్గర వేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే సూచనలున్నాయి. పైరు 60 రోజు దశలో ఉన్నట్టయితే నివారణకు మొనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్పత్తిలో కలిపి మెత్తటి బ్రష్‌తో కాండం లేదా భాగంలో బొట్టులాగా పూయాలి. ఒకవేళ పైరు 60 రోజులపైన ఉన్నట్టయితే లీటరు నీటిలో 2 మి.లీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాము ఎసిటామిప్రిడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ , 1.6 మి.లీటర్ల మొనోక్రోటోఫేస్ కలిపి పిచికారీ చేయాలి.
కంది: కందిలో ఎండు తెగులు ఉధృతి పెరిగే సూచనలు ఉన్నాయి. నివారణకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, 5 కిలోల వేపపిండి, 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరానికి వేయాలి. కందిలో ఆకు చుట్టూ పురుగు ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు లీటరు నీటిలో 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 2 మి.లీటర్ల క్లోరోపైరిఫాస్, ఒక మి.లీటరు డైక్లోరోవాస్ కలిపి పిచికారీ చేయాలి.
సోయాచిక్కుడు: ప్రస్తుత వాతావరణంలో కాండం తొలిచే ఈగ ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల ప్రోఫెనోఫాస్, ఒక మి.లీటర్ల డైక్లోరోవాస్ లేదా 0.3 మి.లీటరు క్లోరా స్త్రనిలిప్రోల్ కలిపి పిచికారీ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగులు కాయల్లో రంధ్రాలు చేసి నష్టం కలుగజేస్తాయి. నివారణకు లీటరు నీటిలో 0.3 మి.లీటరు క్లోరాస్త్రనిలిప్రోల్ కలిపి పిచికారీ చేయాలి.
ఆముదం: ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బూజు తెగులు ఆశించేందుకు అనుకూలం. ముందు జాగ్రత్త చర్యగా ఒక గ్రాము కార్బండజిమ్ లేదా ఒక మి.లీటరు ప్రొపికొనజోల్ మందును వర్షం కురవడానికి 6 నుంచి 8 గంటల ముందు, వర్షం కురిసిన తర్వాత 6 నుంచి 8 గంటల వ్యవధిలో లీటరు నీటికి కలిపి మొక్క అన్ని భాగాలు తడిచేలా పిచికారీ చేయాలి. ఈ పంటలో పొగాకు లద్దె పురుగు ఉనికి కనిపించింది. దీని నివారణకు కొన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. పొలంలో ఎకరానికి 10 పక్షి స్థావరాలను అమర్చాలి. లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా ఒక మి.లీటరు నోవాల్యూరాన్ లేదా 1.5 గ్రాముల బయోడికార్బ్ మందును కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పరిస్థితుల్లో బెండ, వంగ, టమాట తదితర పంటల్లో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. ఎకరానికి 10 నుంచి 20 మైనం పూసిన పసుపు రంగు అట్టలు పెట్టాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 2 మి.లీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ లేదా ఫిప్రోనిల్ కలిపి పిచికారీ చేయాలి. వంగ, బెండలో కాయ తొలిచే పురుగు ఉధృతి పెరిగే ప్రమాదముంది. తల్లి పురుగు నివారణకు ఎకరానికి 40 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. వంగలో పురుగు ఉధృతి అధికంగా ఉంటే లీటరు నీటిలో 0.4 మి.లీటరు ప్లుబెండమైడ్ లేదా 2 మి.లీటర్ల ప్రొఫినోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. దోస జాతి కూరగాయల్లో పెంకు పురుగు ఉధృతి పెరిగే సూచనాలున్నాయి. నివారణకు లీటరు నీటికి 2 మి.లీటర్ల క్లోరోపైరిఫాస్ కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని కూరగాయల్లో ఆకు మచ్చ తెగులు సోకే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తగా లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ లేదా 2 మి.లీటర్ల సాఫ్ కలిపి పిచికారీ చేయాలి.
Authorization