తోటకూరలో తెల్లమచ్చ తెగులు నివారణ ఎలా?
- కృష్ణారెడ్డి, గండిమైసమ్మ (మేడ్చల్ జిల్లా)
ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపెలు ఏర్పడతాయి. ఆకుపై భాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండుబారిపోతాయి. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంజోజెబ్ మందును కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
పెసరలో బూడిద తెగులును ఎలా నివారించాలి?
- లక్ష్మీరాజం, గంగాధర (కరీంనగర్ జిల్లా)
గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. ఆకులపై బూడిద రంగు మచ్చలు కనబడి, అవి క్రమంగా పెద్దవై ఆకులపైన కొమ్మలకు వ్యాపిస్తుంది. నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ లేదా ఒక గ్రాము థయోఫాసేట్ మిథైల్ లేదా ఒక మి.లీటరు కరాథేన్ లేదా 2 మి.లీటర్ల హెక్సాకొనజోల్ లేదా ఒక మి.లీటరు ట్రైడిమార్ఫ్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
మిరపలో తలమాడు తెగులు ఉధృతిని ఎలా అరికట్టాలి?
- మల్లారెడ్డి, వేములవాడ (రాజన్న సిరిసిల్లా జిల్లా)
లేత చిగుళ్లు మాడిపోయి, కొమ్మల కణుపుల వద్ద కుళ్లు కనబడి కొమ్మలు విరిగిపోతాయి. నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వరిలో గింజ మచ్చ తెగులు నివారణ ఎలా?
- నారాయణ, కందుకూరు (రంగారెడ్డి జిల్లా)
పొటాకు తొడిమలపై నల్లటి లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్లిపోతాయి. వెన్నులు పాక్షికంగా బయటకు వస్తాయి. లేదా తాలు గింజలుగా రంగు మారి తాలుపోతాయి. నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కార్బండజిమ్, మాంకోజెబ్ లేదా ఒక మి.లీటరు ప్రొటికొనాజోల్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
లిల్లీ తోటలో కాండం, మొగ్గ కుళ్లిపోతోంది. ఏం చేయాలి?
- బషీర్, రాయికోడ్ (సంగారెడ్డి జిల్లా)
లిల్లీలో వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, పూమొగ్గ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.
- సేకరణ: మోత్కూరి యాదయ్య
Authorization