ప్ర. బెండలో ఎర్రనల్లి నివారణ ఎలా ?
- రవి, మోతె గ్రా, మండలం, నల్లగొండ జిల్లా
జ. పంట చివరి దశలో చిన్న, సన్న ఎర్ర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటరు నీటిలో కరిగే గంధకపు పొడి 3గ్రా. లేదా డైకోఫాల్ 5మి.లీ కలిపి పిచికారి చేయాలి.
ప్ర. మిరపలో ఆకుముడత తెగులు (జెమినివైరస్) నివారణ ?
- భాను, ముంగిమడుగు గ్రా,మహబూబ్నగర్ జిల్లా
జ. ఇది తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకుని పడవ ఆకారంలోకి మారిపోతాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగాను, పసుపు రంగు కలిగి ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకుల మీద బొబ్బలు ఏర్పడి ముడుచుకుంటాయి. నివారణకు ట్రైజోఫాస్ 200 మి.లీ లేదా థయోమిథాక్సాం 40 గ్రా. మందులను మార్చిమార్చి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
ప్ర. కందిలో ఆకుచుట్టు పురుగు నివారణ చెప్పండి?
- రాము, బీమని గ్రా, మం, మంచిర్యాల జిల్లా
జ. కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని, లోపల ఉండి గీకి తింటాయి. దీని వల్ల ఆకులు తెల్లగా కనబడతాయి. నివారణకు మొనోక్రొటోఫాస లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్ర. పాలకూర ఆకులపై ఎర్రటి మచ్చలు వస్తున్నాయి, నివారణ చెప్పండి?
ఎన్. సైదానాయక్, చిత్కూర్ గ్రా,మం, సూర్యాపేట జిల్లా
జ.పాలకూర ఆకులపై సెర్కొస్పోరా శిలీంధ్రము ఎర్రటి గోధుమ రంగు మచ్చలుగా ఏర్పడి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందును కలిపి పిచికారీ చేయాలి. మందు పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి.
Authorization