సకల శ్రమలకు చిరునామ ఆమె
వ్యవ'సాయం'లోకనిపించని శక్తి ఆమె
కష్టాల సేద్యంలో తరగని సంపద ఆమె
నేలతల్లి ఒడిలో శ్రమైక జీవి ఆమె
మట్టితో పెనవేసుకున్న బంధమే ఆమె
పంటకు ప్రాణం ఆమె
సాలులో నాగలి ఆమె
విత్తే విత్తనంలో ఆమె
కాసే కాయలో ఆమె
అన్నం పెట్టె అన్నపూర్ణ ఆమె
భూమి పుత్రిక ఆమె
విజయ గీతిక ఆమె.
పాడి పంటలు వర్థిల్లాలి అంటే మహిళ చేయి పడాల్సిందే. ఆమె చేయి పడనిదే మొలకెత్తదు, పైరు పంటనివ్వదు. ఆమె నడుం బిగించనిదే ఒక్క పనీ ముందుకు సాగదు .ఒక్క మాటలో చెప్పాలంటే మహిళ లేనిదే వ్యవసాయం లేదు. దుక్కి దున్నే కాడి నుంచి పంట ఇంటికి వచ్చే వరకూ మహిళా రైతుల పాత్ర అనిర్వచనీయం . మహిళలు ఇటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే అటు వ్యవసాయ రంగంలోనూ తమ గుర్తింపును చాటుకుంటున్నారు. పల్లె సీమల్లో వ్యవసాయ పనిలో మహిళల పాత్ర ఎక్కువ. వ్యవసాయంలో యాంత్రీకరణ విధానం విస్త తంగా పెరిగినప్పటికీ మహిళా రైతులు లేనిదే పంట చేతికందదు. నిద్రలేచింది మొదలు ఇంటిపని, వంటపని పూర్తి చేసుకుని, సద్దులను మూటగట్టుకుని సరైన సమయానికి పంట పొలాలకు చేరుకునే మహిళలు సాయంత్రం 6 గంటలు దాటితే గానీ ఇండ్లకు చేరుకోరు.
కాలం ఏదైనా, పంట మరేదైనా మహిళా రైతులు నడుం బిగించాల్సిందే. ముందుకు సాగాల్సిందే. . నాట్లు వేయాలన్నా, విత్తనాలు జల్లాలన్నా, కలుపు తీయాలన్నా మహిళలే కనిపిస్తారు. విత్తనాల కొనుగోళ్లు, పంట ఉత్పత్తుల విక్రయాలు, ఎరువులు చల్లడాలు తదితర పనులను మగవారు చేస్తున్నప్పటికీ వ్యవసాయంలో కీలక పనులను మహిళలే నిర్వహిస్తారు.
వ్యవసాయమే ఆసరా
వ్యవసాయం తప్ప ఇంకో పని ఎరుగ. మట్టిని నమ్ము కుని ఉన్నం. పని జేస్తేనే పైసలు. అందుకే ఏండ్ల కొద్ది వ్యవసాయం జేస్తున్నం. ఎండాకాలం, వానకాలం అంటూ తేడా ఏమీ లేదు. ఏ కాలంలో అయినా వ్యవ సాయం జేస్తం. కాలం మంచిగుంటే కడుపు నిండి నట్టయితది. కూలి పనులు జేసేటప్పుడు డబ్బుల కోసం డిమాండ్ ఉండది. అందరూ ఒకే మాట మీద ఉండి పనులు చేసి అవసరమైనప్పుడు డబ్బులు తీసుకుంటం.
-పుష్ప , మెట్పల్లి, జగిత్యాల జిల్లా
పొద్దంతా తోటల్లోనే...
ఊహతెల్సినప్పటి నుంచే తెల్సిన పని వ్యవసాయమే. కాయకష్టం జేస్తేనే పూట గడుస్తది. ఏ సీజన్లో అయిన పనికి పోతాం. తోటల పని ఉంది రావాలి అని రెండు మూడ్రోజుల ముందే తోట యజమాని పిలుస్తడు. అన్ని రకాల పనులు జేస్తా. ఉదయం 9 గంటలకు పనికి వస్తే మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు అయిపోతది. పొద్దంతా పని చేస్తే మాకు వచ్చేది మూడు వందలు. అయినా మాకు వ్యవసాయం అంటేనే ఇష్టం.
- నల్ల పెద్దగంగు, మెట్పల్లి, జగిత్యాల జిల్లా
చిన్నప్పటి నుంచి వ్యవసాయమే..
చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. సొంత భూమి ఉంది. ఏటా రెండు సార్లు పంటదీస్తాం. రెండు సీజన్లలో పొలం సాగుచేస్తాం. పొద్దు పొద్దున్నే పొలంలకి వస్తే సాయంత్రం అయినంకనే ఇంటికి పోతం. ఎక్కువ మహిళలే వ్యవసాయం చేస్తున్నరు. కష్టమేం ఉండదు. వ్యవసాయం చేయంటం అంటే ఇష్టం..
-ఆకుల లక్ష్మి, మెట్పల్లి, జగిత్యాల జిల్లా
వ్యవసాయ క్షేత్రంలో మహిళలు
- ఒక హెక్టారు వ్యవసాయ క్షేత్రంలో పురుషులు ఏడాదికి 1212 గంటలు పని చేస్తే మహిళలు 3485 గంటలు పని చేస్తున్నారు.
- వ్యవసాయ శాస్త్రవేత స్వామినాథన్ ప్రకారం.. పశువుల పెంపక కేంద్రాలు, వ్యవసాయమనే కళ, విజ్ఞానం మహిళలను నుంచే ప్రారంభమయ్యాయి.
- వ్యవసాయ రంగం అభివృద్ధిలో మహిళల కృషి ఉంది. హర్టికల్చర్, ఫిషరీస్, పశుపోషన, సోషల్ ఫారెస్ట్రీ రంగాల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
- వ్యవసాయ భూమి సిద్ధం చేయడంలో 31 శాతం మంది మహిళలు, విత్త నాలను శుభ్రపరచడంలో 80 శాతం, సాగు కార్యకలాపాలలో 86 శాతం, పంట కోయటం, ఎండబెట్టడం, నిల్వ చేయటంలో 84 శాతం మహిళలు తమ పాత్ర పోషిస్తున్నారు.
-వినోద్ మామిడాల
Authorization