రకాలు : మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలున్నాయి.
ప్రవర్థనం: కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ, అంటు మొక్కలు (లేయరింగ్) ద్వారా గానీ ప్రవర్థనం చేస్తారు.
నాటటం: మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్ నుంచి డిసెంబరు వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు. సాయంత్రం సమయంలో నాటడం వల్ల మొక్క బాగా అతుకుతుంది. అంటు మొక్కలను వరుసల మధ్య మొక్కల మధ్య1.25-2.00 మీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి.
కత్తిరింపులు : మల్లె తోటలో లేత చిగుర్ల నుంచే పూలు వస్తాయి కనుక ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి నెలలో ఆకును రాల్చడం, కొమ్మ కత్తిరింపులు సరిగ్గా చేపట్టాలి. కొమ్మలు కత్తిరించడానికి 10నుంచి 15 రోజుల ముందు నీరుకట్టడం ఆపేయాలి.
నీటి యాజమాన్యం: కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టడం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభా వాన్ని బట్టి 8నుంచి 10 రోజులకొకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ ద్వారా కూడా నీటి సదుపాయం కల్పించవచ్చు.
ఎరువులు: ప్రతి మొక్కకు 8నుంచి 10 కిలోల పశువుల ఎరువుతోపాటు 60నుంచి 120గ్రా. నత్రజని, 120గ్రా. భాస్వరం, పొటాష్ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. తదుపరి సూచించిన మోతాదును దఫాలుగా వేయడం మంచిది.
దిగుబడి: పూల దిగుబడి పెంచుటకు లీటరు నీటికి 2.5గ్రా. జింక్ సల్ఫేట్, 5.గ్రా.మెగ్నీషియం, సల్ఫేట్ సూక్ష్మ ధాతువులను కలిపి రెండు, మూడు దఫాలుగా పిచికారి చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారు 3నుండి 4 టన్నుల దిగుబడి పొందవచ్చు.
సస్యరక్షణ పురుగులు
మొగ్గ తొలుచు పురుగులు: పురుగు లార్వా , పువ్వు మొగ్గల్లోనికి చొచ్చుకుపోయి పూల భాగాలను తినివేస్తూ తీవ్రదశలో మొగ్గలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ముడుచుకుపోయేటట్టు చేస్తుంది. నివారణకు గాను మలాథియాన్ లేక క్వినాల్ఫాస్ లీటరు నీటికి 2 మి.లీ మందును కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
నల్లి : ఈ పురుగు ఉధృతి పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. పురుగులు అకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి.నివారణకు గంధకపు పొడిని ఎకరాకు 8నుంచి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి.
ఎండు తెగులు: తెగులు తొలి దశలో మొక్క కింది భాగం ఆకులు ఎండిపోతాయి. ఆ తర్వాత పై భాగాన ఉన్న ఆకులు కూడా ఎండి రాలిపోతాయి. తీవ్ర దశలో మొక్కంతా ఎండి చనిపోతుంది. నివారణకు మొక్కల చుట్టూ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి భూమిని తడపాలి.
Authorization