వాణిజ్యపరంగా బయటి ప్రదేశాలలో పాలీహౌస్‌లలో సాగు చేయడానికి అనువైన పంట. బహువార్షిక పూల పంట.పూలల్లో గులాబిని రాణి పువ్వుగా పిలుస్తారు. గులాబి పువ్వుల నుంచి సుగంధ తైలం, పూల రెక్కలతో రోజ్‌వాటర్, గులంఖండ్ అనే పదార్ధం కూడా తయారు చేస్తారు.
రకాలు :సాగులోనున్న గులాబిలను ఈ కింది విధంగా విక్రయించవచ్చు.
హైబ్రిడ్ : గులాబి పెద్ద పరిమాణంలో ఉండి కొమ్మకు ఒకటిగా పూస్తాయి. ఉదా: గ్లాడియేటర్, అమాలియా, రక్తిమ, గ్రాండ్గల, బకల్హామి, పింక్ పాంథర్, ఆదిత్య, మదర్‌థెరిసా.
ప్లోరీబండాస్ : గులాబీలు మధ్యంతర సైజులో గుత్తులుగా పూసి ఎక్కువ రోజులుంటాయి. ఉదా: ల్యూటిన్, రెడ్ట్రెంప్, వైట్‌గోల్డ్,ఆకాష్దీప్.
మినీయేచర్: మొక్కలు చిన్నవిగా చిన్న ఆకులు కలిగి అతి చిన్న పూలను పూస్తాయి. ఉదా: పింక్స్ప్రే, నర్తకి, ప్రీతి, బేబీ చాక్లెట్
పాలియంతాస్: చిన్నచిన్న పూలు వేసవిలో పూస్తాయి. మ్కెలు హెడ్జింగ్‌కు అనువైనవి.
తీగ గులాబీలు : మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులుగా పూస్తాయి.
వాతావరణం
సూర్యరశ్మి ఉన్న వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులు పూల దిగుబడి, నాణ్యతపై మిక్కిలి ప్రభావం చూపుతాయి. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 15డిగ్రీల సెల్సియస్ అనుకూలం. 18 డిగ్రీల సెల్సియస్ వద్ద గులాబీలలో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. గులాబీలను నీడపడకుండా ఉండే ప్రదేశాల్లో పెంచాలి. నీడ ఎక్కువగా ఉన్నట్లయితే తెగుళ్ల బెడద ముఖ్యంగా బూడిద తెగులు ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా మొక్కలు సన్నగా బలహీనంగా ఉంటాయి.
నేలలు : తేలిక నేలలు అనువైనవి. నేల ఉదజని సూచిక 6.0-6.5 ఉంటే మంచిది. బరువైన నీరు ఇంకని నేలు గులాబి సాగుకు అనుకూలం కావు.
ప్రవర్థనం: హైబ్రీడ్ టీస్ ప్లోరిబండాస్ రకాలను 'బడ్డింగ్' ద్వారా ప్రవర్ధనం చేస్తారు. సాధారణంగా 'టీ' బడ్డింగ్ పద్దతిలో చేస్తారు. మినియేచర్లు, తీగ రకాలను , రూట్ స్టాక్లను కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు.
నాటేదూరం: నేల స్వభావం, రకాన్ని బట్టి 75-120సెం.మీ ఎడంగా నాటాలి. ఎకరానికి 6వేల నుండి 7వేల మొక్కలు అవసరం అవుతాయి.
నాటే సమయం: గులాబీ మొక్కలను జనవరి చివరి వరకు నాటుకోవచ్చు.
నీటి యాజమాన్యం : మొక్కలను నాటి తర్వాత కొత్త చిగుళ్లు వచ్చే వరకు తేలికపాటి నీటి తడులను ఇచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి 8నుంచి 10 రోజుల మధ్య కూడా నీరు పెట్టాలి. డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీరు అందించవచ్చు.
కత్తిరింపులు: గులాబీ పూలు కొత్త చిగుర్లపైన పూస్తాయి. కనుక కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. సంవత్సరానికి ఒకసారి అంటే మన రాష్ట్రంలో వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కొమ్మకత్తిరింపులు చేసేందుకు అనుకూలం. కొమ్మలను కత్తిరించేటప్పుడు చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలను తెగులు, లేక పురుగు ఆశించిన కొమ్మలను, బలహీనంగ ఉన్న కొమ్మలను, రూట్స్టాక్పైన వచ్చే కొమ్మలను వెంటనే కత్తిరించాలి. ఆరోగ్యంగా బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపలి వైపు ఉన్న మొగ్గకు సుమారు 5 మి.మీ పైన పదునైన సికేచరుతో కొమ్మలను ఏటవాలుగా కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకు బ్లెటాక్స్పేస్టు పూయాలి.
ఎరువులు: కొమ్మలను కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7నుంచి 8 కిలోల పుశువుల ఎరువు, 3నుంచి 5కిలోల వేరుశనగ, వేపపిండి చెక్కను వేయాలి. తరువాత 15నుంచి 20 రోజులకు యూరియా, భాస్వరం, పొటాష్ ఎరువులను 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100గ్రా. చొప్పున వేయాలి. ఇదే మోతాదును రెండు మూడు దఫాలుగా వేయాలి. సూక్ష్మ ధాతువులయిన మాంగనీస్ సల్ఫేట్ 15గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ 20గ్రా.ఛిలేటెడ్ఇనుము 10గ్రా. బోరాక్స్ 5గ్రా కలిగిన మిశ్రమాన్ని 2గ్రా. లీటరు నీటకి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
పూత-దిగుబడి: వాణిజ్యపరంగా సాగు చేసిన గులాబీలు నాటిన సంవత్సరం తర్వాత మొదలై 7నుంచి 8 సంవత్సరాల వరకు పూస్తాయి. 3సంవత్సరాల మొక్క300 గులాబీల వరకు పూస్తుంది. మార్కెట్ కొరకు గులాబీలు మొగ్గగా ఉన్నప్పుడే కోయాలి.
సస్యరక్షణ - పురుగులు
తామరపురుగులు: ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి. మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు. దీని నివారణకు డైమిథోయేట్ 2మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పెంకు పురగులు: రాత్రిపూట ఆకులను తినినష్టపరుస్తాయి.కార్బరిల్ 3గ్రా.లీటరు నీటికి లేదా మిథైల్పెరాధియాన్1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పేనుబంక : ఈ పుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకుల కొనలు, మొగ్గ నల్లగా మారుతాయి. నివారణకు డైమిథోయేట్ 2.మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎర్రనల్లి: వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఎర్రనల్లి ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల మొత్తం మొక్క ఆకులు రాలిపోతాయి. నివారణకు 3గ్రా. నీటిలో కరిగే గంధకంలేదా డైకోఫాల్ 3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొగ్గ తొలుచు పురుగు: లార్వాలు పూలమొగ్గలను తొలుస్తాయి. పూమొగ్గలు విచ్చుకోవు. నివారణకు క్వినాల్ఫాస్ 2.మి.లీ లీటరు నీటికి లేదా కార్బరిల్ 3గ్రా చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి తెల్లటి పదార్దమేర్పడి ఆకులు ముడుచుకు పోతాయి. లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి. పూల రేకులు రంగు మారిసడలి, ఎండిపోతాయి. నివారణకు డైనోకాప్1.మి.లీ లేదా కార్బండజిమ్ 1.0గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారంచవచ్చు.
నల్లమచ్చలు: గుండ్రటి నల్లమచ్చలు ఆకులకు రెండు పక్కలా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి. వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. నివారణకు బావిస్టిన్ 1గ్రా. బెనోమిల్ 1గ్రా. లేదా క్లోరథలోనిల్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎండు రోగం: మొక్కపైభాగం నుండి కిందికి ఎండిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్తిరించి కొమ్మ నుండి మొదలవుతుంది.తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుకు మారుతాయి. కాండం, వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు కత్తిరింపు చేసిన కొమ్మకు వెంటనే రాగిధాతు సంబంధమైన మందును (బ్లైటాక్స్) పేస్ట్‌లాగా చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూయాలి. లేదా పచ్చిపేడ, మట్టితో కలిపిన పేస్ట్ పూసి కూడా ఈ తెగులును నివారించుకోవచ్చు.
Authorization