తేలికపాటి ఎర్ర చెలక నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కొర్ర పంటను సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. కొర్రలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
విత్తే సమయం: వేసవిలో జనవరి రెండో పక్షం నుంచి విత్తుకోవచ్చు.
నేలలు: తేలికపాటి ఎర్ర చెలక నేలలు, నల్లరేగడి నేలలు, మురుగు నీటి పారుదల సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి.
విత్తన మోతాదు: ఎకరానికి 2.0 కిలోలు.
విత్తే పద్ధతి: విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనం, సన్నని ఇసుక నేలలు కలుపుకుని వరుసల మధ్య 30 సెం.మీ మొక్కల మధ్య 10 సెం.మీ దూరంలో గొర్రుతో విత్తుకోవాలి.
ఎరువులు: ఎకరానికి 3నుంచి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. ఎకరానికి 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో మరో 8 కిలోల నత్రజనిచ్చే ఎరువును పైపాటుగా వేయాలి.
అంతర పంటలు: కొర్ర, కంది, సోయాచిక్కుడు, 5:1నిష్పత్తి.
కలుపు నివారణ,అంతర కృషి : విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర సేద్యం చేయాలి.
గులాబి రంగు పురుగు: లార్వాలు మొవ్వును తొలిచి తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. దీని నివారణకు 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వెర్రి కంకి తెగులు: తేమతో కూడిన వాతావరణంలో అకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్ 35 డబ్ల్యుఎస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అగ్గి తెగులు: మెక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
Authorization