- వ్యవసాయం-వాతావరణం
గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 08 నుంచి 19 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 00 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు. గత రెండు మూడు రోజుల్లో కురిసిన వర్షాల వల్ల ఆరుతడి పంట పొలాల్లో నిలిచిన మురుగు నీటిని తీసివేయాలి. నువ్వులు, పెసర, మినుము పంటలను విత్తుకోవాలి.
వరి: తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్టయితే వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రిపూట కప్పి ఉదయం వేళల్లో తీసేయాలి. ప్రతి రోజు సాయంత్రం నారుమడికి నీరు పెట్టాలి. ఉదయం నీటిని తీసేయాలి. ఎకరం పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియా పైపాటుగా నారు విత్తిన 10 నుంచి 15 రోజుల్లో చల్లాలి. వరిలో నారుమడులలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను 200 చ.మీ నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి.
కంది: కందిలో మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు గమనించడమైంది. నివారణకు మారుక మచ్చల పురుగు 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ లేదా 0.75 మి.లీ. నోవాల్యూరాన్తో పాటు 1.0 మి.లీ డైక్లోరోవాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. శనగపచ్చ పురుగు నివారణకు ఈ కింది యాజమాన్య పద్దతులను పాటించాలి.
శనగపచ్చ పురుగు లార్వాలను తినేందుకు వీలుగా ఎకరానికి 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
పురుగుల ఉనికిని గమనించేందుకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
పురుగు, గుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి.
మొక్కజొన్న: రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టు గమనించడమైంది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీ. నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100గ్రా. థైడికార్బ్ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఎమమేక్టిన్ టెంజోయేట్ 0.4 గ్రా. లేదా థైమేమిధాక్సాన్ 9.5 శాతం, లానుసైహలోత్రిన్ 12 శాతం 0.5 మి.లీ లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పైరు మొలిచిన 10 నుండి 15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు క్లోరోపైరిఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పైరు 25 నుంచి30 రోజుల దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరానికి 3 నుంచి 4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి. గత రెండు మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు ప్రస్తుత మంచు వాతావరణానికి గింజ ఏర్పడే దశలో రబీ జొన్నలో గింజ బూజు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులును గమనించినట్టయితే నివారణకు 0.5 మి.లీ ప్రొపికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జొన్న: ప్రస్తుతం జొన్న గింజ ఏర్పడే దశలో ఉన్నందున గింజ బూజు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు నివారణకు 0.5 మి.లీ ప్రోపికనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ద్రాక్ష: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని 90 రోజుల ఆముదం పంటకు 2 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో పక్షికన్ను తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రా. ప్రొఫినెట్ మందును లీటరు నీటిలో కలిపి కత్తిరింపుల తరువాత 20 రోజులలోపు పిచికారి చేయాలి. ద్రాక్షలో పెంకు పురుగు గమనించడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోరిపైరాపాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. ఉదృతి గమనించి 2 మి.లీ ఫిప్రోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనె మంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్, 2.5 మి.లీ వేపనూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నిమ్మ జాతి పంటలు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నిమ్మజాతి పంటలో నల్లి ఆశించుటకు అనుకూలం. నివారణకు 3.0మి.లీ ప్రోపర్జైట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జామ: జామ పండులో ఈగ ఉధృతి గమనించడమైంది. నివారణకు ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను తోటలో అమర్చాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో గుండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.5 మి.లీ ట్రైజోఫోస్ లేదా 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్యుజేరియం ఎండు తెగులు సోకే సూచనలున్నాయి. నివారణకు 3 గ్రా. కాపర్ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రా. కర్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల దగ్గర నేల తడిచే విధంగా పిచికారి చేయాలి. మిరపలో వైరస్ తెగులు ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఈ వైరస్ వ్యాప్తి వాహకాలైన రసం పీల్చే పురుగులను అదుపు చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో తామర పురుగులు కూడా ఆశించేందుకు అనుకూలం. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పశుపోషణ: కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి, ఆవులు, బర్రెలకు గొంతువాపు వ్యాధి, ఆవులు, ఆంబోతులలో జబ్బవాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి.
ప్రత్యామ్నాయం: రాష్ట్ర వ్యాప్తంగా వేసిన పత్తి పంటను డిసెంబరు నెలాఖర వరకు తీసివేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేపదే పేర్కొంది. కానీ నీటి వసతి కింద పత్తి వేసిన రైతులు ఇంకా కొనసాగిస్తున్నారు.
Authorization