మొక్కలకు నతజ్రని, భాస్వరం, పొటాషియం, గంధకం, మెగ్నీషీయం, కాల్షియం వంటి ముఖ్య పోషకాలతో పాటు జింకు, ఇనుము, మాంగనీసు, బోరాన్, మాలిబ్డినమ వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. మొక్కల పెరుగుదల, పంట దిగుబడికి ఈ పోషకాలు అందుబాటు నేల స్వభావంపై ఆధార పడి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం అంటే కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియంపైనే దృష్టి సారించి సూక్ష్మ పోషకాల వినియోగం పక్కన పెడుతున్నారు. మొక్కకు తక్కువ మోతాదులో అవసరమైనందున వీటిని సూక్ష్మ పోషకాలంటారు. కానీ మొక్క ఎదుగుదలలో వీటి ఆవశ్యకత తక్కువేమీ కాదు.
సున్నపు పాలు ఎక్కువగా ఉన్న భూముల్లో బోరాన్ లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇసుక నేలల్లో బోరాన్ లభ్యత తక్కువ, మట్టి కణాలు విడిపోవడం వల్ల సూక్ష్మ పోషకాల విలువలు కూడా తక్కువగా ఉంటాయి. సాధారణంగా నేల ఉదజని సూచిక పెరిగే కొద్దీ బోరాన్ లభ్యత తగ్గుతుంది. నేలలలో అధిక తేమ ఉంటే బోరాన్ లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొత్తగా సాగులోకి తెచ్చి భూముల్లో పైపొర తవ్వడం వల్ల కూడా లోపం రావచ్చు. అధిక మోతాదులో నత్రజని ఎరువుల వాడకం వల్ల కూడా ఈ లోపం రావచ్చు.
పంటలకు బోరాన్ ఆవశ్యకత: మొక్క కణజాలు సరిగ్గా అభివృద్ది చెందడానికి న్యూట్రిక్ ఆమ్లం తయారీలో బోరాన్ కీలక పాత్రవహిస్తుంది. కీలాగ్రాన్ని పుప్పొడి సవ్యంగా చేరుకొని ఫలదీకరణ ప్రక్రియలో బోరాన్ కీల పాత్ర వహిస్తుంది. మొక్కలకు తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ వివిధ ప్రక్రియలలో ప్రముఖ పాత్ర వహించడమే కాక కావాల్సిన ఎంజైమ్‌లను తయారు చేయడంలో స్థూలపోషక పదార్ధాలు మొక్కకు సక్రమంగా ఉపయోగపడడంలో కూడా బోరాన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. గింజకట్టు దశలో బోరాన్ లోపం తలెత్తితే విత్తనం నిర్మాణం దెబ్బతిని వంకరలు తిరిగి బెండు తయారవుతుంది. హార్మోన్ల కదలికలో ప్రధాన పాత్ర వహించి మొక్క పెరుగుదలకు కావాల్సిన వివిధ ప్రకియల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది.
పండ్ల తోటల్లో బోరాన్ లోప లక్షణాల నివారణ
నిమ్మ ఆకులు ఈనెల పసుపుగా మారి చీలిపోయినట్టు కనిపించి రాలిపోతాయి. కాండంపై పగుళ్లు ఏర్పడి జిగురు కారుతూ ఉంటుంది. పండ్లపై నీరు కారి లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్లుతున్నట్టు తయారవుతాయి. పండ్లు పగిలి దలసరిగా మారి లోపలి గుజ్జు గట్టిగా తయారవుతుంది. నివారణకు 0.1 లేదా 0.2 శాతం బోరిక్ ఆమ్లం ద్రావణాన్ని పిచికారి చేయాలి. లేదా చెట్టుకు 50 గ్రా. బోరిక్ యాసిడ్‌ను పొదల్లో పైపాటు సమయంలో వేయాలి.
బొప్పాయి: కాయలు పండ్లపైన వివిధ రకాల బొడిపెలు వచ్చి అక్కడక్కడ చిన్న పగుళ్లపతో పైతోలు గరుకుగా ఉంటుంది. కాయ ఆకారాన్ని కోల్పోతుంది. నివారణకు లీటరు నీటికి 2.5గ్రా. బోరాక్స్ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
మామిడి: కాయ దిగువ భాగం గరుకుగా నల్లగా ఉండి కాయలు పక్వానికి రాకముందే రాలిపోతాయి. ఉదజని సూచిక ఎక్కువ గల చౌడు నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మామిడి కాయల్లో వచ్చే పగుళ్లకు బోరాన్ లోపం ఒక కారణంగా చెప్పవచ్చు. దీని నివారణకు 15 రోజుల వ్యవదిలో రెండుసార్లు 0.5 శాతం బోరాక్స్‌ను చెట్టుపై పిచికారి చేసి ఈ లోపాన్ని నివారించవచ్చు.
కొబ్బరి: కాపుకు వచ్చిన తొలిదశలో ముఖ్యంగా 10నుంచి 12 ఏండ్ల వయసు గల మొక్కలు బోరాన్ లోపానికి గురవుతాయి. లేత ఆకులు చిన్నవిగా, మెళికతిరిగి చివర రెండుగా చీలి ఉంటాయి. మొవ్వు కుదించుకొని పోయి గట్టిగా తయారవుతుంది. ఆకులు ఈనెలు లేకుండా కురచబారి నల్లని కట్టెముక్కలుగా మొవ్వు చుట్టూ కనిపిస్తాయి. ఎదిగిన చెట్లలో ఆకుల్లోని ఈనెలు విడిపదక, అంటుకుపోయి ఉంటాయి. బోరాన్ లోప నివారణకు 1.0-1.5 మీటర్ల గొయ్యి తీసి ప్రతి అడుగుమట్టి నమూనా సేకరించి, భూసార పరీక్ష చేయించుకోవాలి. భూమిలో బోరాన్ లభ్యత 0.3 పిపిఎం కన్నా తక్కువ ఉంటే నివారణకు ఏడాది లోపు మొక్కలకు 1.0-1.5గ్రా. బోరాక్స్ వాడాలి. 1-3 ఏండ్ల మొక్కలకు 10-15గా, 5 ఏండ్లు పైబడిన మొక్కలకు 50-75 గ్రా. వాడాలి.
కూరగాయ పంటల్లో బోరాన్ లోప లక్షణాలు - నివారణ
దుంపలైన క్యారేట్, ముల్లంగి మొదలగు పంటల్లో బోరాన్ లోపిస్తే లేత ఆకులపై ఎరుపు లేదా ఇటుక రంగు మచ్చలేర్పడి ఆకారాన్ని కోల్పోతాయి.ఈనెల పెరుగుదల తగ్గి ఆకులు పెళుసులుగా మారి ముడుడుకు పోతాయి. మొగ్గలు రాలి, లేత చిగర్లు ఊదారంగులోకి మారుతాయి. ఎకరానికి 8కిలోల బోరాక్స్లేదా 2 గ్రా. బోరాక్స్ ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
టమాట: లేత ఆకులు పసుపు నారింజ పండు రంగులో ఉండి ఆకులు కిందికి వంకర తిరిగి ఉండడం బోరాన్ లోప ముఖ్య లక్షణం. పెరుగుదల బాగా తగ్గిపోతుంది. లేత ఆకులు, ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగతా భాగం పసుపు రంగుకు మారి ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం, మిగతా భాగాలు బాగా పెళుసుగా ఉంటాయి. కాయలు పగిలిపోతాయి. నివారణకు ఒక లీటరు నీటిలో 2 గ్రా. బోరాక్స్ కలిపి కావాల్సిన మేర ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారి చేయాలి. నాటే ముందు ఎకరానికి 8 నుంచి 12 కిలోల చొప్పున బోరాక్స్ వేస్తే ఈ లోపం రాకుండా ఉంటుంది.
క్యాబేజీ: క్షార నేలల్లో బోరాన్ లోపం వచ్చే అవకాశం ఉంది. పైరు పక్వానికి వచ్చే సమయంలో బోరాన్ లోపం వచ్చినప్పుడు ముదురు గోధుమ రంగుకు మారుతుంది. బోరాన్ లోప నివారణకు ఆమ్ల లక్షణాలు గల నేలల్లో ఎకరానికి 4-6 కిలోల బోరాక్స్ వాడి నివారించుకోవచ్చు.లోప నివారణకు 0.3-0.4 శాతం బోరిక్ ఆమ్లం రెండుసార్లు అంటే మొక్క నాటిన రెండు వారాల తర్వాత, పువ్వు ఏర్పడడానికి రెండు వారాల ముందు మొక్కలపై పిచికారి చేయాలి.
అరటి: బోరాన్ లోపం వల్ల ఆకులు చాలా మందంగా ఏర్పడతాయి. కాయలు పగిలిపోతాయి. కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు ఒక్కో చెట్టుకు 10గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. ప్రత్యామ్నాయంగా ఆకులపై 0.2 శాతం బోరాక్స్ (లీటరు నీటికి2 గ్రా) కలిపిన ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఈ విధంగా పండ్లు, కూరగాయ పంటల్లో బోరాన్ లోప లక్షణాలను గుర్తించి సరైన నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.
- కె. భవ్యశ్రీ
అసిస్టెంట్ ప్రొఫెసర్
అగ్రికల్చర్ కాలేజీ, సిరిసిల్ల
Authorization