గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 25 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 38 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వేసవి పెసర, మినుము, నువ్వు పంటలను విత్తుకోవాలి.
వరి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడమైంది. నివారణకు 2గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ క్లోరాంట్రినిల్‌ప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం చలి మంచు వాతావరణం కనుక అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులను గమనించినట్టయితే నివారణకు ఎకరానికి 0.6గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కెండుసార్లు పిచికారి చేయాలి.
పెసర, మినుములో విత్తనశుద్ధి: వేసవి పంటగా పెసర, మినుమును ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రా. థయోమిక్సామ్ లేదా 5 మి.లీ మోనోక్రొటోఫాస్‌ను కలిపి విత్తనశుద్ధి చేసినట్టయితే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ పంటను మొదటిసారిగా పొలంలో సాగు చేసినట్టయితే 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను ఎకరానికి సరిపడే విత్తనాలను బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశక మందుతో శుద్ధి చేసి, ఆరబెట్టిన తరువాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి.
మొక్కజొన్న:
రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టు గమనించడమైంది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2నుంచి 3 లీ. నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100గ్రా. థైడికార్బ్‌ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఎమమేక్టిన్ టెంజోయేట్ 0.4 గ్రా. లేదా థైమేమిధాక్సాన్ 9.5 శాతం, లానుసైహలోత్రిన్ 12 శాతం 0.5 మి.లీ లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పైరు మొలిచిన 10 నుండి 15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు క్లోరోపైరిఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పైరు 25 నుంచి30 రోజుల దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరానికి 3నుంచి 4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.
ద్రాక్ష: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో బూడిద తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 0.5 మి.లీ అజాక్సిస్ట్రోబిన్ లేదా 0.7 మి.లీ క్రిసోక్షిమ్ మిథైల్ లదేఆ 1 మి.లీ హెక్షాకొనజోల్ లేదా 0.4 గ్రా. మైక్‌లో బ్యుటానిల్ మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో కత్తిరింపుల తర్వాత 60 నుంచి 90 రోజుల మధ్య లేద ఆ కోతకు 50 రోజుల ముందు పిచికారి చేయాలి. మజ్జిగ తెగులు సోకుటకు అనుకూలంగా ఉంది. నివారణకు 1.75 గ్రా కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 2.25 గ్రా. పొసిట్లైల్ లేదా 0.5 మి.లీ అజాక్సిస్ట్రోబిన్ లేదా 0.7 మి.లీ క్రిసోక్షిమ్ మిథైల్ మందును లీటరు నీటికి కలిపి ప్రత్యామ్నాయంగా 5 నుంచి 7 రోజుల వ్యవధిలో కత్తిరింపుల తర్వాత 25 నుంచి 55 రోజుల మధ్య పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తామర, తేనె మంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్, 2.5 మి.లీ వేపనూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో గుండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.5 మి.లీ ట్రైజోఫోస్ లేదా 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్యుజేరియం ఎండు తెగులు సోకే సూచనలున్నాయి. నివారణకు 3 గ్రా. కాపర్‌ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రా. కర్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల దగ్గర నేల తడిచే విధంగా పిచికారి చేయాలి. మిరపలో వైరస్ తెగులు ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఈ వైరస్ వ్యాప్తి వాహకాలైన రసం పీల్చే పురుగులను అదుపు చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి పంటలైన సోర, కాకర, బీరకాయలలో పండు ఈగ ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. టమాటలో ఆకుమాడు తెగులు ఆశించేందుకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 మి.లీ ప్రోపికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ప్రసుత్త వాతావరణ పరిస్థితులలో టమాటలో తామర పురుగులు ఆశించేందుకు అనుకూలం ఉంది. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization