గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 06 నుంచి 23 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతారణం పొడిగా ఉండవచ్చు. 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా వడగండ్లతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు. వేసవి పెసర, మినుము, నువ్వు పంటలను విత్తుకోవాలి.
వరి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడమైంది. నివారణకు 2గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ క్లోరాంట్రినిల్ప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం చలి మంచు వాతావరణం కనుక అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులను గమనించినట్టయితే నివారణకు ఎకరానికి 0.6గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కెండుసార్లు పిచికారి చేయాలి.
మొక్కజొన్న: రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టు గమనించడమైంది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీ. నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100గ్రా. థైడికార్బ్ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఎమమేక్టిన్ టెంజోయేట్ 0.4 గ్రా. లేదా థైమేమిధాక్సాన్ 9.5 శాతం, లానుసైహలోత్రిన్ 12 శాతం 0.5 మి.లీ లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పైరు మొలిచిన 10 నుండి 15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు క్లోరోపైరిఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పైరు 25 నుంచి30 రోజుల దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరానికి 3నుంచి 4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.
ద్రాక్ష: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో పక్షికన్ను తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రా. ప్రొఫినెట్ మందును లీటరు నీటిలోకలిపి కత్తిరింపుల తరువాత 20 రోజులలోపు పిచికారి చేయాలి. ద్రాక్షలో పెంకు పురుగు గమనించడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోరిపైరాపాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. ఉదృతి గమనించి 2 మి.లీ ఫిప్రోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తామర, తేనె మంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్, 2.5 మి.లీ వేపనూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలుసు పురుగు ఆశించేందకు కూడా అవకాశం ఉంది. నివారణకు 2.5 గ్రా ఎసిపేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత పగటి వేడి, రాత్రి చలి వాతావరణ పరిస్థితుల వల్ల మామిడిలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్టయితే 2 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో గుండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.5 మి.లీ ట్రైజోఫోస్ లేదా 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్యుజేరియం ఎండు తెగులు సోకే సూచనలున్నాయి. నివారణకు 3 గ్రా. కాపర్ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రా. కర్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల దగ్గర నేల తడిచే విధంగా పిచికారి చేయాలి. మిరపలో వైరస్ తెగులు ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఈ వైరస్ వ్యాప్తి వాహకాలైన రసం పీల్చే పురుగులను అదుపు చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో తామర పురుగులు కూడా ఆశించేందుకు అనుకూలం. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయా
- సేకరణ : మోత్కూరు యాదయ్య
Authorization