పండ్లు, పూలు, కూరగాయలు వంటి ఉద్యానపంటల్లో వివిధ రకాల ప్రవర్థన పద్ధతులు ద్వారా మొక్కల్ని ఉత్పత్తి చేస్తారు. విత్తనాలు, నేలంటు, గాలి అంటు, మొగ్గంటు, కొమ్మంటు, కొమ్మల కటింగ్స్ వంటి ప్రవర్థన పద్ధతులున్నాయి. కూరగాయలు, ఏకవార్షికపూలు, బొప్పాయి, కొబ్బరి వంటి పంటల్లో విత్తనం ద్వారా, గులాబీ మల్లె, మందారం వంటి పూలు పంటల్లో కటింగ్ ద్వారా, అరటిని దుంపలు లేదా టిష్యూకల్చర్ పద్ధతిలో ఎక్కువగా ప్రవర్ధనం చేస్తారు. మామిడి, నిమ్మ, సపోట, జామ, పనస వంటి పండ్ల మొక్కల్ని కొమ్మంటు పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేయడం సరైన పద్ధతి. ఈ కొమ్మంటు పద్ధతిలో చేర్పు అంటూ, మొగ్గ అంటు, వెనీర్ అంటు, చీలిక అంటు, అనే పలు రకాల పద్ధతులు ఉన్నాయి. పంటను బట్టి అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవాలి. ప్రవర్ధన పద్ధతులపై రైతులకు అవగాహన ఉంటే సర్సరీల నుంచి నాణ్యమైన మొక్కల్ని ఎంపిక చేసుకునే వీలుంటుంది.
జామలో...
ఇటీవల కొందరు ఎటువంటి యోగ్యత ప్రమాణాలు పాటించకుండా జామ మొక్కలను క్లోనింగ్ పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేసి మార్కెట్ డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విధానం వల్ల సరైన కూకటి వేరు వ్యవస్థ లేని జామ మొక్కలు తయారవుతున్నాయి. దాని స్థానంలో ఏర్పడే పీచు వేరు వ్యవస్థ నేలలో పై పొరల్లో మాత్రమే వ్యాపించి ఉంటుంది. అందువల్ల ప్యూజేరియా ఎండు తెగులు, నెమటోడ్స్ ఎక్కువగా ఆశించే వీలుంటుంది. ఈ తెగుళ్ళు నేల ద్వారా వ్యాప్తి చెంది జామ తోటలు త్వరగా క్షీణిస్తున్నాయి.
లైసెన్స్ ఉన్న నర్సరీల నుంచే
జామ తోటలు పెంచాలనుకునే రైతులు, లైసెన్స్ పొందిన నాణ్యతా ప్రమాణాలను పాటించే సర్సరీల నుంచి అధిక దిగుబడి వచ్చే రకాలు ఎంపిక చేసుకోవాలి. శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసిన ఐ.హెచ్.ఆర్, ఐ.సి.ఏ.ఆర్ వంటి జాతీయ సంస్థల ద్వారా సిఫార్సు చేసిన జామ రకాలను తయారు చేసే లైసెన్స్ ఉన్న నర్సరీల నుంచి మాత్రమే మొక్కలు కొని తోటలు పెంచటం శ్రేయస్కరం.
కూకటి వేరు సరిగా ఏర్పడదు
కొమ్మ అంటు పద్ధతి వల్ల తగు రీతిలో బలమైన వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. మొక్క పెరుగుదల దిగుబడి సామర్ధ్యం ఆయువు, వేర్లు భూమిలోకి పూనే పటుత్వం అన్నీ సమకూరుతాయి. కొమ్మ అంటు పద్ధతి ప్రధానంగా కూకటి (కంగటి) వేరు వ్యవస్థ కలిగిన మామిడి, జామ, సపోట, ఉసిరి, పనస, చింత, జీడిమామిడి వంటి పంటలకు సిఫారసు చేయబడింది. ఈ పంటల్లో నేల అంటు పద్ధతి క్లోనింగ్ పద్ధతి వంటివి సరైన / తగిన పద్ధతులు కావు. ఈ పద్ధతుల్లో కూకటి వేరు సరిగా ఏర్పడదు. తద్వారా భూమిలోకి వేళ్లు పూనుకునే సమర్ధత, నిలకడగా దిగుబడి ఇచ్చే కాలం తగ్గుతుంది.
Authorization