వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వల్ల ఉష్ణతాపానికి గురై, కోళ్లు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. మార్చి చివరి వారంలోనే ఎండలు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇప్పుడే ఇలాగుంటే, ఇక ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది. కోళ్ల శరీర నిర్మాణం పూర్తిగా ఈకలతో కప్పి ఉంటుంది, కాబట్టి చలికి తట్టుకుంటుంది కానీ వేసవికి కాదు. ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కోళ్లు తమ శరీరం లోని తాపాన్ని బయటకి పంపించలేక, త్వరగా వడ దెబ్బకు గురవుతాయి. వత్తిడికి గురై, వ్యాధి నిరోధక శక్తి తగ్గి, బలహీన పడి రోగాల బారిన పడతాయి. దాణా సరిగా తినలేక, లేయర్ కోళ్ళలో గ్రుడ్లు, బ్రాయిలర్ కోళ్ళలో మాంసం ఉత్పాదకత తగ్గిపోయి, రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదముంటుంది. కాబట్టి కోళ్ల రైతులు చిన్న పాటి యాజమాన్య మెళకువలను పాటిస్తే, వేసవి నష్టాలను తగ్గించుకోవచ్చు.
- వేసవిలో కోళ్ల షెడ్లను సాధ్యమైనంత వరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. షెడ్లో కోళ్లను ఎక్కువగా కిక్కరిసి ఉంచకూడదు.
ి షెడ్ చుట్టూ కొద్దిపాటి ఎత్తు వరకు గడ్డిని పెంచడం, లేక నీడనిచ్చే చెట్లను పెంచడం వల్ల వేడిని అరికట్టొచ్చు.
- షెడ్ పై కప్పు భాగానికి తెల్లని రంగువేసి లేదా ఆపై గడ్డి పర్చి స్ప్రింకర్లతో తడిపితే మంచిది. షెడ్ లోపల ఫోగర్స్ ని అమర్చుకోవాలి. షెడ్ పక్కలకు గొనె సంచులు కానీ, తడకలు కానీ ఏర్పాటు చేసి తడుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల షెడ్ లోపల వేడి కొంచం తగ్గుతుంది.
షెడ్డులో చల్లని నీటి తొట్టెలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
- వేసవిలో కోళ్లు నీళ్లు ఎక్కువగా తాగి, దాణా తక్కువగా తింటాయి. కాబట్టి ఎండ తీవ్రతను బట్టి కోళ్ల దాణాలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాల శాతం పెంచాలి. మాంసకృత్తులను తగ్గించాలి. దాణా కూడా ఉదయం, సాయింత్రం అంటే చల్లని వేళలో ఎక్కువగా ఇస్తూ ఉంటే ఎక్కువ మోతాదులో తింటాయి. మిట్ట మధ్యాహ్నం పూట దాణా వేయకూడదు.
- వేసవిలో పేలు, నల్లులు వంటి బాహ్య పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. మలాథియాన్ తదితర మందులను షెడ్లో ఉంచాలి. కోళ్లపై పిచికారీ కూడా చేయాలి.
- వేసవిలో కోళ్లకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధులు ప్రబలకుండా టీకాలు సాయంత్రం వేళల్లో వేయించాలి.
Authorization