పశువులను రెండు రకాలుగా పోషిస్తుంటారు. స్వేచ్ఛగా వదిలేసే విధానం. పశువులను కట్టేసి మేత అందించే విధానం. పశువులను స్వేచ్ఛగా వదిలినప్పుడు కట్టేసేందుకు వీలు లేకుండా 'లూజ్హౌసింగ్' పద్దతిలో షెడ్లు నిర్మించాలి. ఈ పద్దతిలో పాలు పిండేందుకు మాత్రమే పశువులను కట్టివేస్తారు. రాత్రి, పగలు పశువులు ఫెన్సింగ్ లోపలే తిరుగుతుంటాయి. ఖాళీ స్థలంలో ఒకవైపు నివాసం ఏర్పాటు చేస్తారు. అక్కడ పశువులు వేడి, చలి, వర్షం నుండి కాపాడుకుంటాయి. ఒకే నీళ్ల ట్యాంకు, మేత తొట్టి ఉంటుంది. దాణాను పాలు పిండేముందు ఒక గదిలో అందిస్తారు. ఈ పద్దతిలో నిర్మాణం చౌకగా పూర్తవుతుంది. అన్ని రకాల వయసుగల పశువులను ఈ పద్దతిలో పెంచవచ్చు. కొండ ప్రాంతాలు, అధిక వర్షాలున్న ప్రాంతాల్లో తప్ప వెచ్చని ప్రాంతాల్లో ఈ పద్దతి బాగుంటుంది. ఇక పశువులను కట్టేసే పద్దతిలో పాకలను 'ట్రైస్టాల్స్ స్ట్రాంచియన్' పద్దతిలో నిర్మిస్తారు. ఈ పద్దతిలో పశువులను ఒకే వరుసలో లేదా రెండు వరుసల్లో పెంచుతారు. ఒకే దగ్గర మెడకు తాడు లేదా గొలుసుతో కట్టేసి మేత అందించడం, పాలు పిండడం చేస్తారు. ఈ పద్దతిలో అయితే పశువులు ఎండ తీవ్రతకు గురికావు. వ్యాధుల నివారణ సులభం. పశువులను శుభ్రపర్చడం కూడా తేలికగా ఉంటుంది. చలిగాలులు, వర్షాలుండే ప్రాంతాల్లో ఈ పద్దతి బాగుంటుంది.
పశువులకు కావాల్సిన మేతను ఉత్పత్తి చేసేందుకు, పాడిపశువులు, దూడల కొరకు షెడ్ల నిర్మాణం, పశుగ్రాసం, దాణా నిల్వకు గదులు, ఇతర అవసరాలకు అంటే బయో ప్లాంట్ నిర్మాణానికి, వర్మికంపోస్టు, షెడ్ల నిర్మాణం, వాహనాలు, యంత్ర సామాగ్రి, తదితర అవసరాలను బట్టి భూమి పల్లపు ప్రాంతంలో కాకుండా ఎతైన ప్రాంతంలో ఉండడం శ్రేయస్కరం. వాణిజ్య పరంగా పాడిపశువులను పెంచేందుకు ఎంపిక చేయబడే స్థలానికి విద్యుత్ సౌకర్యం, రవాణా సౌకర్యం, సమీపంలో పశువైద్యశాలలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. పాల మార్కెట్కు దగ్గర పాడిపశువుల పెంపకం ఎంతో మంచిది. ప్రతి 5 పాడి పశువులకు ఒక ఎకరం భూమి, పశుగ్రాస సాగుకు 300 చ.గ ఇతర వసతులకు అవసరం.
పాడిపశువులకు గృహవసతి
పశువులను అతి చలి, అతి వేడి నుంచి కాపాడుకోవడానికి గృహ వసతి అవసరం. అందుకు అనుకూలంగా పాకలు నిర్మించుకోవాలి. పశువుల పాక నిర్మాణానికి తగిన స్థలం ఎంపిక చేసుకోవాలి. పశువుల పాక కొరకు ఎత్తయిన నీరు నిలవని, గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. అది రైతుల ఇంటికి దగ్గర ఉంటే ఇంకా మంచిది. నేరుగా సూర్యరశ్మి ప్రసరించకుండా పాకను నిర్మించుకోవాలి. చుట్టు పక్కల చెట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పాక నిర్మాణం-వసతులు
పాకలో ప్రతి పశువుకు 1 నుంచి 1.2 మీటర్ల వెడల్పు, 1.5 నుంచి 1.7 మీటర్ల పొడవు చొప్పున స్థలం కేటాయించాలి. పాకలో ప్రతి పశువుకు తగినంత స్థలం ఉండాలి. పాక పొడవు 6 మీటర్లు, వెడల్పు 2.5 మీటర్లుండాలి. దానికి వాకిలి 8 మీటర్ల పొడవు ఉండాలి. వాకిలి షెడ్డు కన్నా కనీసం మూడు రెట్లు అధికంగా ఉండాలి. ఆరురెట్లు అధికంగా ఉంటే మరీ మంచిది. వాకిలి చుట్టు కంచెగానీ, గోడగానీ నిర్మించి చెట్లు పెంచుకోవాలి. పాకలో నేలను సిమెంటుతోగానీ, మొరంతోగానీ, నాపరాళ్లతోగానీ ఏర్పాటు చేసుకోవాలి.
పెట్టుబడి
వాణిజ్యపరంగా చేపట్టేవారు భూమి కొనుగోలు(భూమిలేనివారు) షెడ్లు, ఇతర గదుల నిర్మాణం, డైరీ యంత్ర పరికరాల కొనుగోలుకు, పాడిపశువులు కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చును స్థూలపెట్టుబడిగా పరిగణించాలి. ఈ మొత్తాన్ని రైతు స్వయంగా సమకూర్చువచ్చు లేదా అవసరం మేరకు బ్యాంకు నుంచి రుణం ద్వారా పొందవచ్చు.
పాడి పశువులు
పశుగ్రాస వసతిని అనుసరించి పాడిపశువుల సంఖ్య ఉండాలి. ఒక ఎకరం భూమితో పశుగ్రాస సాగుతో 5 పాడిపశువులను పోషించవచ్చు. మేలుజాతి పశువుల, (సంకరజాతి ఆవులు లేదా ముర్రా జాతి బర్రెలను ఎంపిక చేసుకోవాలి.
విద్యుశ్చక్తి: డైరీ ఫారంలో రోజువారీ కార్యక్రమాలైన యంత్రాలతో పాలు పితకడానికి, చాఫ్కట్టర్లతో గడ్డిని కత్తిరించడానికి శీతలీకరణ ద్వారా పాలు నిల్వ చేయడానికి, రాత్రిపూట వెలుతురు కొరకు విద్యుశ్చక్తి అవసరం ఉంటుంది.
నీటి వసతి: పశుగ్రాస సాగు, పాకల శుభ్రతకు, పాడిపశువులు తాగేందుకు నీటి సౌకర్యరం పుష్కలంగా ఉండాలి.
రవాణా సౌకర్యం: ఎంపిక చేయబడిన స్థలానికి రోడ్డు సౌకర్యం ఉండాలి. పాలకు వీలైనంత తొందరగా మార్కెట్కు వాహన సదుపాయం సమకూర్చుకోవాలి.
యంత్రసామాగ్రి, పరికరాలు: పాలు పిండేందుకు, గడ్డి కత్తిరించేందుకు యంత్రాలు, పశుగ్రాసాన్ని కోయడానికి బ్రష్ కట్టర్స్, పాకలు శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటితోపాటు డైరీ నిర్వహణకు పనిముట్లు, పాలక్యాన్లు, బక్కెట్స్ వంటివి కొనుగోలు చేయాలి.
కార్మికులు: 2 నుంచి 5 పాడి పశువులు గల ఒక రైతు కుటుంబం అనుభవంతో పాలు తీయగలరు. కానీ పెద్ద మొత్తంలో పాడిపశువులు కలిగిన వారు తప్పకుండా ప్రతి 10 పాడిపశువులకు ఒక కార్మికుని పెట్టుకోవాలి. ఆ వ్యక్తి కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. పశువుల పెంపకం, మేత వేయడంలో అనుభవం ఉన్నవానికి నియమించుకోవాలి.