గడిచిన మూడు రోజులలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 31 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణ్నోగతలు 24 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్టయితే నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆలస్యంగా కోతకు వచ్చే నీలం, రుమానీ రకాల్లో పండు ఈగ బెడద నివారణకు 2 మి.లీ మలాథీయాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో బూడిద తెగుళ్లు వ్యాప్తికి అనుకూలం. నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ డైనోకాప్ లేదా 1 మి.లీ అజాక్సిస్ట్రోబిన్ లేదా 0.4 గ్రా. మైక్లోబ్యుటానిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బత్తాయి, నిమ్మ: వడగళ్ల వానకు దెబ్బతిన్న మొదళ్లు కొమ్మల మధ్య బోర్టోపేస్టును రాస్తే శిలీంధ్రాల నుంచి రక్షణ లభిస్తుంది. కొత్తగా బత్తయి, నిమ్మ తోటలను పెట్టదలుచుకున్న రైతులు ముందుగా ఈ నెలలో 1 మి. పొడవు, వెడల్పు లోతుగల గుంటలను6×6మీ. దూరంలో తీసుకుని బాగా ఎండనివ్వాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
కోళ్ల యాజమాన్యం: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి. కోళ్లు వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగార్స్ను అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి, స్ప్రింకర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినేందుకు మెత్తటి దాణాను పెట్టి, తాగేందుకు చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి.
Authorization