గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 40 డిగ్రీల సేల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
సూచనలు
గత కొన్ని రోజులుగా కురిసిన, రాబోవు ఐదు రోజుల్లో కురిసే వర్షాలను ఉపయోగించుకుని రైతులు వర్షాదార పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, సోయాచిక్కుడు, పెసర, పత్తి, కంది పంటలను తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ, బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుంచి 20 సె.మీ లోతు తడిసిన తర్వాతనే విత్తుకోవాలి. కంది పంట, పత్తి, మొక్కజొన్న పంటలో అంతర పంటగా విత్తుకోవాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జ, సోయాచిక్కుడు వంటి పంటలను బోదెలు, సాళ్ల పద్దతిలో విత్తుకోవాలి. వరిసాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకుని జనుము, జీలుగ, పచ్చిరొట్టపైరుగా ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేనిచో పచ్చిరొట్టగా విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోన(ఆర్ఎన్ఆర్ 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడిగా పోసుకోకూడదు. తేలికపాటి నేలల్లో పత్తి, సోయాచిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయకూడదు. దక్షిణ తెలంగాణ జిల్లాలో మొక్కజొన్న పంటను తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా సాగు చేయరాదు. మధ్యకాలిక వరి రకాలను కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండజిమ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందు కలిపి విత్తనశుద్ది చేసుకుని నారుమళ్లు పోసుకోవాలి. పెసర, సోయాచిక్కుడు పంటలలో కిలో విత్తనానికి 2.5 గ్రా. కార్బండజిమ్, 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి.
కూరగాయలు
ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
Authorization