గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 39 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణ్నోగతలు 22 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
సూచనలు
కంది పంటను పత్తి, మొక్కజొన్న పంటలలో అంతర పంటగా విత్తుకోవాలి. మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంటలను బోదెలు, సాళ్ల పద్దతిలో విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోన(ఆర్ఎన్ఆర్ 15048) వరి విత్తనాన్ని జులై 10 నుంచి నారుమడి పోసుకోవాలి. తేలికపాటి నేలల్లో పత్తి, సోయాచిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయకూడదు. దక్షిణ తెలంగాణ జిల్లాలో మొక్కజొన్న పంటను తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా సాగు చేయరాదు. మధ్యకాలిక వరి రకాలను కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండజిమ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందు కలిపి విత్తనశుద్ది చేసుకుని నారుమళ్లు పోసుకోవాలి. పెసర, సోయాచిక్కుడు పంటలలో కిలో విత్తనానికి 2.5 గ్రా. కార్బండజిమ్, 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి.
కూరగాయలు
కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాట, వంగ మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతిగల ప్రాంతాలలో బెండ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
మామిడిలో కత్తరింపులు
పెద్ద చెట్ల కాయల కోత తర్వాత 20 నుంచి 25 రోజులు చెట్లకు విశ్రాంతినిచ్చి ఆ తర్వాత కత్తిరింపులు చేయాలి. చెట్లపై ఎండిన కొమ్మలను, తెగుళ్లు, పురుగులు ఆశించిన కొమ్మలు, కాయ కాడలను, లోపల అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించి తీసివేయాలి. చెట్ల నుంచి కిందికి వేళాడుతున్న కొమ్మలను భూమి నుంచి 75 నుంచి 100 సెం.మీ ఎత్తువరకు తొలగించాలి. కత్తిరింపుల తర్వాత సిఫారసు మేరకు ఎరువులు, నీటి తడలు ఇవ్వాలి.
వరి
తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్-15048) విత్తనాన్ని ఇప్పుడు నారు మడి పోసుకోవచ్చు. ఈ విత్తనాన్ని ఇంకా సమకూర్చుకోలేని రైతులు తమ దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం గానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.
Authorization