గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 33 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 23 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వర్షాల వల్ల వర్షాధార పంటలలో నిలిచిన వర్షపు నీటిని తీసేయాలి. రాబోయే ఐదు రోజుల్లో వర్షపాత సూచనలున్ననందున వర్షాలు కురిసిన తర్వాత వర్షాదార పంటలలో పైపాటు ఎరువులను వేసుకోవాలి.
పత్తి
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొనోక్రోటోఫాస్ మందు, నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్‌తో విత్తిన 60 రోజుల పైరుకు పూయాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు గమనించడమైంది. నివారణకు 0.2 గ్రా ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రా ధయోమిక్సామ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు కూడా ఆశించుటకు అనుకూలం. నివారణకు థయోడికార్బ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్న
మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టుగా గమనించడం జరిగింది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీ. నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రా. థైడికార్బ్‌ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండులుగా చేసి మొక్క సుడులలో వేయాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.4 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
సోయాచిక్కుడు
సోయాచిక్కుడు పొగాకు లద్దె పరుగు గమనించడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోర్పైరిపాస్ లేదా 1.మి.లీ నోవల్యూరాన్ లేదా 0.4 గ్రా ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. సోయా చిక్కుడులో రసం పీల్చే పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు
కూరగాయల పంటలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు గమనించడమైంది. నివారణకు పురుగు సోకిన కొమ్మలన కత్తిరించాలి. 2 మి.లీ ప్రొఫెనోపాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Authorization