రాష్ట్రంలో బీడీ వర్కర్ల సంఖ్య వేలల్లో ఉంది. ఆ కుటుంబాలన్నీ ఈ పనిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. కష్టం చేస్తే తప్ప పూటగడవని బతుకులు. రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసరాలు. యేడాదికేడాది రెట్టింపవుతున్న ఇంటి అద్దెలు. పిల్లల చదువులు. వీరికి వచ్చే ఆదాయం కనీసం ఇంటి ఖర్చులకు కూడా సరిపోదు. అందుకే 'నడుములు పోయేట్టు కూర్చొని బీడీలు చుడతాం. అయినా రోజుగడవడం కూడా కష్టమౌతుంది' అంటున్న బీడీ కార్మికుల సమస్యల గురించి నేటి కొలువులో...
బీడీలపై ఆధారపడి కుటుంబాన్ని నడిపే ఒంటరి మహిళల సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతుంది. ఇండ్లల్లో ఉండి చేసుకునే పని కావడంతో చాలా మంది మహిళలు బీడీలు చుట్టడానికి ఆసక్తి చూపుతుంటారు. పైగా వారికి ఇది తప్ప వేరే జీవనాధారం దొరకడం కష్టం. పగలంతా కూర్చుంటే తప్ప బీడీలు చేయలేరు. అలాంటి వెయ్యి బీడీలు చేస్తే వచ్చే డబ్బు చాలా తక్కువ. వయసు పెరిగే కొద్ది మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అటు ఇంటిపని, ఇలు పిల్లల పని చూసుకుంటూ చేయాలి. కూర్చొని కూర్చొని నడుములు నొప్పులు వస్తాయి. మునివేళ్ళతో బీడీలు చుట్టీ చుట్టీ చేతులు కాయలు కాస్తాయి. ఎంత కష్టమైనా కుటుంబం కోసమే వీరి తపన. అందుకే ఎన్ని ఆరోగ్య సమస్యలొచ్చినా వాటిని పక్కనపెట్టి బీడీలు చుట్టుకుంటున్నారు.
పించన్ పెంచాలి
ఏడో తరగతి వరకు చదువుకున్నా. చిన్నప్పటి నుంచే బీడీలు చేసేదాన్ని. అమ్మవాళ్ళు మగ్గం నేసేవారు. నా పెండ్లి అయి 20 ఏండ్లు అవుతుంది. కట్నం కోసం వేధించే వాళ్ళు. ఎన్ని హింసలు పెట్టినా అక్కడే ఉండేదాన్ని. నరకం అనుభవించా. నా భర్తకు అనుమానం ఎక్కువ. ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లల్ని అస్సలు పట్టించుకోడు. దాంతో నాన్న నాతో ఆ షాపు పెట్టించాడు. ఆ షాపు చూసుకుంటూ, బీడీలు చేసుకుంటూ బతికేదాన్ని. దాంతో పాటు మిషిన్ కూడా కుట్టేదాన్ని. నా భర్త నన్ను, పిల్లల్ని వదిలేసి రెండో పెండ్లి చేసుకున్నాడు. పోలీస్స్టేషన్, కోర్టుల చుట్టూ తిరిగినా లాభం లేదు. పైగా అంత డబ్బు నా దగ్గర లేదు. ఇప్పుడు నాది ఒంటరిబతుకైపోయింది. బాబుకు ఆరోగ్యం బాగోలేకపోతే ఒక్కపైసా ఇవ్వలేదు. ఏం పట్టించుకోలేదు. ఇద్దరు పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు బీడీలు చేసుకుంటూ ఇండ్లల్లో పనులు చేసుకుంటున్నా. వచ్చిన డబ్బుతోనే పిల్లల్ని చదివించుకుంటూ, పనులు చేసుకుంటూ బతుకు తున్నాను. మాకు ఇచ్చే పించన్ పైసలు పెంచితే బాగుంటుంది.
- లక్ష్మి
ఆదాయం చాలటం లేదు
చిన్నప్పటి నుంచి బీడీలు చేస్తున్నా. నా చిన్నతనంలో వెయ్యి బీడీలు చేస్తే 20రూపాయలు ఇచ్చేవారు. పెండ్లి తర్వాత కూడా బీడీలు చేస్తూనే ఉన్నాను. ప్రభుత్వం మాకు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ప్రస్తుతం వెయ్యి బీడీలు చేస్తే 145 రూపాయలు ఇస్తారు. గుర్తింపు కార్డు ఉంది కాబట్టి వెయ్యి బీడీలు చేస్తే పదిరూపాయలు పీఎఫ్ ఇస్తారు. గతంలో నెలకు 20 వేల బీడీలు చేసేదాన్ని. పిల్లలు పుట్టాక ఇంటి పనులు, పిల్లల పనులే సరిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా చేయలేక పోతున్నా. కాపేపు కూర్చుంటే నడుము నొప్పి. ఒకవేళ ఆరోగ్యం బాగోలేక బీడీలు చేయకపోతే గుర్తింపు కార్డులు రద్దు చేస్తారు. అందుకే భయపడాల్సి వస్తుంది. ప్రతి నెలా మా పేరు మీద కచ్చితంగా బీడీలు జమ కావాలి. వచ్చిన ఆదాయం మా కుటుంబ ఖర్చులకు కూడా రావు. ఇంటి అద్దె పెరిగిపోతుంది. బయట ధరలు పెరుగుతున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ లెక్కేసుకుంటే మా ఆదాయం దేనికీ సరిపోదు.
- వరమ్మ
మా గురించి పట్టించుకునేదెవరు?
నాకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నారు. మా వారు కిరాణా షాప్లో పని చేస్తాడు. ఆయనకు వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే. పిల్లల్ని బాగా చదివించాలి. అందుకే ఇద్దరం కష్టపడుతున్నాం. బయటకు వెళ్ళి వేరే పనులు చేసుకునే అలవాటు లేదు. దాంతో చిన్నప్పటి నుంచి తెలిసిన బీడీ పనే చేసుకుంటున్నాం. బీడీలు చుట్టీ చుట్టీ బొక్కలు అరిగిపోతున్నాయి. కూర్చొని కూర్చొని నడుములు నొప్పి పుడతాయి. చేతులు కాయలు కాస్తాయి. కాళ్ళూ, చేతులు గుంజుతుంటాయి. అయినా రోజు గడవాలంటే పనిచేసుకోకతప్పదు. రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామన్నాడు. అదేదో మా లాంటి వాళ్ళకు ఇస్తే కనీసం ఇంటి అద్దెన్నా తప్పుతుంది. అయినా మా గురించి పట్టించుకునేవారు ఎవరు. గతంలో ఊర్లో ఉండి బీడీలు చేసుకునేదాన్ని. నా గుర్తిపు కార్డు కూడా అక్కడే ఉంది. పిల్లల చదువుల కోసం సిటీకి వచ్చేశాం. బీడీలు చేయపోతే కుటుంబం గడవడం కష్టం. అందుకే ఎంత కష్టమైనా చేసుకుంటున్నా.
- యాదమ్మ
చేసుకుంటేనే బతుకు
మావారు పాన్ డబ్బా నడుపుతారు. నేను చిన్నప్పటి నుంచే బీడీలు చేస్తుంటాను. ఇప్పుడు అస్సలు చేతగావడం లేదు. కానీ చేసుకుంటేనే బతుకు. చేయకపోతే ఇల్లు గడవడం కష్టం. మా అబ్బాయి పాలపాకెట్లు వేస్తాడు. గతంలో బీడీలు బాగా చేసేదాన్ని. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే నడుములు బాగా నొప్పి పుడుతున్నాయి. కాళ్ళూ చేతులు గుంజుతున్నాయి. అందుకే పదిరోజుల నుంచి అస్సలు చేయలేకపోతున్నా. బలవంతంగా చేద్దామంటే వచ్చిన డబ్బులు దవాఖానాకే సరిపోతాయి. మాకు పీఎఫ్ తప్ప ఇఎస్ఐ సౌకర్యం లేదు. ఉంటే కనీసం అక్కడ మందులైనా తెచ్చుకోవచ్చు, ఖర్చుతగ్గుతుంది.
- సురేఖ
Authorization