Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా ముమ్మరంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దాని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నది. ఒక్కరోజుకు దాదాపు రెండు లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలతో పాటు దాదాపు 200 దేశాలు, చిన్నచిన్న భూభాగాలతో సహా విశ్వమంతా కరోనా వైరస్ గుప్పిట్లోనే ఉంది. ప్రపంచమంతా ఇంత పెద్ద ఆపదలో ఉంటే కొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు దాచేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఆసుపత్రులలో బెడ్లు చాలక, పని చేయడానికి కావలిసినంత మెడికల్ స్టాఫ్ లేక, డాక్టర్లు పని చేసి అలసిపోతుంటే బ్లాక్ మార్కెటీర్లు సిలిండర్లను ఎక్కువ ధరకు అమ్ముకోవడం, దాచిపెట్టేయడం ఎంత బాధాకరం. ప్రపంచ అంతా కరోనా విపత్తుతో బాధపడుతోంది. కరోనా వచ్చిందంటే అయిన వాళ్ళు కూడా దగ్గరకు రాలేని పరిస్థితి. కొన్ని చోట్ల శవాల్ని తరలించడానికీ డాక్టర్లే ట్రాక్టర్ డ్రైవర్లుగా మారుతున్నారు. ఇంత ఆపద సమయంలో మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కాలక్షేపం చేద్దాం. కాలక్షేపానికి వ్యర్థాలతో బొమ్మలు ఎలా చేయాలో నేర్చుకుందాం...
పౌడర్ డబ్బాతో
వాడి పారేసే పౌడర్ డబ్బాలు, కొబ్బరి నూనె సీసాలు వంటి ప్లాస్టిక్ డబ్బాలతో ఎన్నో కళాత్మక వస్తువులు సృష్టించవచు. మా ఇంట్లో పాండ్స్ పౌడర్ డబ్బా అయిపోయింది. ఇది పెద్ద సైజుది. సరే దీనితో ఏదైనా చేద్దామని పక్కన పెట్టాను. ఎర్రటి ఊలు దారాన్ని తీసుకొని దానికి ఫెవికాల్ రాస్తూ అతికించాను. పాండ్స్ పౌడర్ డబ్బా కాస్తా ఎర్రటి వూలు డబ్బాగా మారిపోయింది. సరే దీన్ని లేసులతో అలంకరిద్దామనుకున్నా. అంతలో పిస్తా పప్పులు తిని వాటి తొక్కలు పడేసి వెళ్ళాడు మా అబ్బాయి. వాటిని చూసిన తర్వాత ఓ ఐడియా వచ్చింది. ఆ పిస్తా తొక్కలతో వూలు డబ్బాను అలంకరించాను. వీటికి ఇంకా కుందన్లు గోలీలు, లేసులు, ముత్యాలు ఏదైనా అతికించుకోవచ్చు. ఇలా తయారైన డబ్బాను ఇలాగే అలంకరించవచ్చు. లేదా పౌడరు డబ్బా మీదున్న మూతను తీసివేసి ఫ్లవర్‌వేజ్‌గా ఉపయోగిం చవచ్చు.
మట్టి కుండలతో
చిన్న చిన్న మట్టి కుండలు బయట చాలా దొరుకుతాయి. ఇవి రకరకాల ఆకారాల్లో కూడా దొరుకుతాయి. వాటిని తెచ్చి వాటికి రంగులు వేసి అలంకరిం చవచ్చు. బిందెలా ఉన్న ఈ చిట్టి కుండను తీసుకొని నేను మొద టగా పసుపు రంగును వేశాను. తరువాత ఎమ్సీల్తో పూలు, పండ్లు తయారు చేసి అతకాలనుకున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ అలాగే చేసేదాన్ని. ఈసారి కొత్త ఐడియా వచ్చింది. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి 'క్లే' మెటీరియల్ దొరుకుతున్నది. అది కూడా రంగుల్లో. ఈ రంగుల మట్టినుపయోగించి ఆ కుండను తయారు చేద్దామనుకున్నాను. ఆకుపచ్చని మట్టితో ఆకులు చేశాను. ఎరుపు రంగుతో పూలు తయారు చేశాను. కొన్ని బులుగు రంగు, వంగరంగు పువ్వుల్ని చేశాను. కుండనంతా పువ్వులు ఆకులతో అలంకరించాను.
ఐస్‌క్రీం పుల్లలతో
చిన్న చిన్న ఐస్‌క్రీం పుల్లలు కాకుండా పొడుగాటి ఐస్‌క్రీం పుల్లల్ని తీసుకోవాలి. ఒకప్పుడు వీటితో ఎన్నో రకాల ఆకారాలు తయారు చేసేవారు. మా చిన్నతనంలో ఇళ్ళు కట్టేశాళ్ళం. ఫ్లవర్వేజులు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు అంత శ్రమ లేకుండా సులభంగా చేయవచ్చు. దీని కోసం ఒక దీర్ఘచతురస్రాకార అట్టను తీసుకోవాలి. దాని మీద ఎరుపు రంగును గానీ బులుగు రంగును గానీ వేసుకోవాలి. ఆ తర్వాత దానిపై ఈ ఐస్‌క్రీం పుల్లల్ని ఫ్లవర్ వేజ్ ఆకారంలో అతికించుకోవాలి. ఇది కేవలం బొమ్మలాంటిది. మా చిన్నప్పటివైతే 3డి ఎఫెక్ట్‌లో ఉండేవి. చాలా సమయం తీసుకునేవి. నేను పువ్వుల కోసం టాబ్లెట్ల కవర్లను వాడాను. ఐస్‌క్రీం పుల్లల్లాగా ఉండే మా హాస్పిటల్‌లోని 'టంగ్ డిప్రెసార్ల'ను వాడాను. ఆల్చిప్పలో నుంచి ముత్యం ఎలా తయారౌతుందో తెలిపేలా టాబ్లెట్ కవర్లను కత్తిరించి చక్కగా పువ్వుల్లా అతికించాను. ఐస్‌క్రీం పుల్లలపై అక్కడక్కడా తళుకులు అతికించాను. ఫ్లవర్‌వేజ్, పువ్వులు తయారయ్యాయి.
అట్టముక్కలతో
కొత్త ఫ్యాన్లు, గ్రైండర్లు కొన్నప్పుడు వాటిలో గుండ్రంగా ఉన్న అట్ట ముక్కలు వస్తాయి. ఒక వేళ ఇవేవీ లేకపోయినా మామూలు అట్టముక్కనే గుండ్రంగా మడిచి టేప్ అతికించేయవచ్చు. ఇప్పుడు ఈ గుండ్రటి అట్టల్ని పెన్ హౌల్డర్గా తయారు చేద్దాం. అందు కోసం మఖమల్ బట్టను ఈ గుండ్రటి అట్టకు చుట్టాలి. దాన్ని చక్కగా అతికించాలి. తర్వాత ఒక చిన్న అట్టముక్కను తీసుకొని దాని అడుగు భాగాన్ని మూసేయాలి. అప్పుడే కదా పెన్నుల్ని పెట్టుకుంటే పడిపోకుండా ఉండేది. ఇలా తయారు చేసిన గుండ్రటి డబ్బా మీద ఏమైన తళుకులు, లేసులు అతకవచ్చు. కానీ నేనేం చేశానంటే ఒక సాఫ్ట్టారుని తీసుకొని ఈ డబ్బాకు కుట్టేశాను. ఫెవికాల్తో అతికితే సరిపోతుంది గానీ ఎందుకైనా మంచిదని ఒక కుట్టు వేశాను. ఒక చిన్న పిల్లవాడి బొమ్మ అది. ఆ పిల్లవాడు ఈ డబ్బాను పట్టుకున్నట్టుగా చేతుల్లో ఉన్నట్టుగా అతికించాను. ఇప్పుడు సరికొత్త పెన్హౌల్డర్ తయారయింది. ఇంట్లో పిల్లలు ఆడుకొని వదిలేసిన బొమ్మలతో ఇలా తయారు చేసుకోవచ్చు.
మందుల కవర్లతో
చిన్న పిల్లల కోసం తయారు చేసే మందులు చాలా వరకు తియ్యగా ఉండేలా తయారు చేస్తారు. లేకుంటే పిల్లలు తాగడానికి ఇష్టపడరు. అలాగే మందు బిళ్ళలు వచ్చే ప్యాకింగులు కూడా కంపెనీ వాళ్ళు ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ఆ ప్యాకెట్ల మీద రంగుల బొమ్మలు వేస్తారు. ఆ బొమ్మలతో నేను ఎన్నో చార్టులు తయారు చేశాను. పచ్చని చిలకమ్మలు, నోరూరించే మామిడి పండ్లు, నవ్వించే జోకర్లు ఇలా ఎన్నో రకాల బొమ్మలుంటాయి. మిగల పండిన మామిడి పండు నొకటి కట్ చేసి ఉంచాను. కడుపునొప్పికి వేసే ఓ టాబ్లెట్‌కు కవర్‌గా ఓ డ్రాగన్ బొమ్మ ఉంది. నేను ఈ డ్రాగన్ బొమ్మను చాలా నీట్‌గా కత్తిరించి ఉంచాను. ఒక ప్రపంచ పటాన్ని తీసుకొన్నాను.
ఒక కార్డుబోర్డు మీద మఖమల్ బట్ట అతికించి ఉంచుకున్నాను. దానిమీద డ్రాగన్ బొమ్మను, తలకిందులుగా ప్రపంచ పటాన్ని అతికించాను. ఈ డ్రాగన్ బొమ్మను పర్యావరణ కాలుష్యంగా చిత్రించి దాని ధాటికి తల్లకిందులైన ప్రపంచం అని చెప్పాలని నా ఉద్దేశ్యం. నేనీ బొమ్మను పాతికేండ్ల కిందట తయారు చేశాను. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ బొమ్మ సరిగ్గా సరిపోతున్నట్లనిపించింది. అందుకే మీకు పరిచయం చేస్తున్నాను.
- డా|| కందేపి రాణీప్రసాద్