Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెప్పులు కరవకుండా ఉండా లంటే వాటిని కొనేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ధరించడానికి సౌకర్యవంతంగా ఉన్నాయో లేదో ముందే పరిశీలించాలి. అందుకే మీరు కొనుగోలు చేయాలనుకొంటున్న వాటిని పాదాలకు తొడుక్కొని అటూ ఇటూ నడవాలి. ఆ సమయంలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే వాటిని కొనకపోవడమే మంచిది. అలాగే ఆన్ లైన్లో చెప్పులను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే.. మన పాదానికి సరిపోయే చెప్పులు వేర్వేరు బ్రాండ్లలో వేర్వేరు సైజుల్లో దొరుకుతాయి. దీని మీద పూర్తి అవగాహన ఉంటేనే ఈ పని చేయండి. లేదంటే దుకాణంలో తీసుకోవడమే ఉత్తమం. కొన్న తర్వాత ఏమైనా ఇబ్బంది కలిగితే ఎలాంటి జాగ్త్రతలు తీసుకోవాలో చూద్దాం...
- మీరు ధరించే బూట్లు మీ పాదాలను ఇబ్బంది పెడుతుంటే ఎక్కడెక్కడ గాయాలయ్యే అవకాశం ఉందో అక్కడ షూ లోపలి భాగంలో బ్యాండ్ ఎయిడ్ అతికిస్తే సరిపోతుంది. షూకి బ్యాండ్ ఎయిడ్ అతికించడం ఇష్టం లేకపోతే పాదాలకు వేసుకోవచ్చు. దీనికోసం స్కిన్ ఫ్రెండ్లీ వైట్ టేప్ కూడా ఉపయోగించవచ్చు.
- మీ పాదరక్షలు కొత్తవైనా లేదా పాదాలకు సరిపోకపోయినా కచ్చితంగా అవి మీ పాదాలను కరిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాస్త దళసరిగా ఉండే సాక్స్ని పాదాలకు ధరించాలి. ఇవి చెప్పుల వల్ల మీ పాదాలు రాపిడికి గురవకుండా చేస్తాయి. అలాగే షూ వదులుగా అయ్యేలా చేస్తాయి.
- కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆముదం.. వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని వరసగా మూడు రోజుల పాటు కొత్త షూ లేదా చెప్పుల లోపలి వైపు రాయడం వల్ల అవి పాదాలను కరవకుండా ఉంటాయి. ఈ చిట్కాను వాటిని ధరించడానికి ముందే పాటించాల్సి ఉంటుంది.
- షూ ధరించడానికి ముందు దానిలో సాక్సును కూరాలి. ఆ తర్వాత సాక్స్ వేడెక్కే వరకు హెయర్ డ్రయర్తో బ్లో డ్రై చెయ్యాలి. వేడెక్కిన సాక్స్ బూట్లను వదులుగా అయ్యేలా చేస్తాయి. కాబట్టి అవి పాదాలను కరుస్తాయనే భయం అవసరం లేదు.
- తొడుక్కొన్నప్పుడు కాలివేళ్లు లేదా మడమలు కొన్నిచోట్ల బిగుతుగా ఉన్నాయనే భావన కలగొచ్చు. అలాంటి చోట్ల క్యాండిల్ వ్యాక్స్ లేదా క్రేయాన్ వ్యాక్స్ రాయాలి. చెప్పు లోపల వ్యాక్స్ రాయడం వల్ల పాదాల చర్మం రాపిడికి గురి కాకుండా ఉంటుంది.
- షూ బైట్ ప్రొటెక్టర్ ఉపయోగించడం ద్వారా షూ వల్ల పాదాలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఇది మందంగా, మెత్తగా, ట్రాన్సపరెంట్గా ఉంటుంది. ఇవి షూ బైట్ నుంచి పాదాలను కాపాడటం మాత్రమే కాకుండా పాదరక్షలు అసౌకర్యంగా లేకుండా చేస్తాయి.
- అయితే చెప్పులు అందంగా ఉన్నాయి కదా అని అవి మీ పాదాలకు సరిపోకపోయినా, అసౌకర్యంగా ఉన్నా పట్టించు కోకుండా వాటిని కొనుగోలు చేయద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని పక్కన పెట్టి ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే పాదరక్షలు మీ పాదాలకు రక్షణగా ఉండాలి కానీ.. అవి మీకు ఇబ్బంది కలిగించకూడదు.