Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విలయ తాండవం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నది. దానిని ఎదుర్కోవడానికి డాక్టర్లూ, వాక్సిన్ కనుక్కోవడానికి సెంటిస్టులూ పోరాడుతూనే ఉన్నారు. కానీ అప్పటి వరకూ ఏంచేయాలి అన్నదే సమస్య. కరోనాకు రక్షణ నియమాలు పాటిస్తూ, మాస్క్, శానిటైజర్ల వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూనిటీని పెంచుకోవడమే అంటున్నారు డాక్టర్లు. ఇమ్యూనిటీ అంటే ఏమిటి? రోగనిరోధక శక్తి. మన దేహంలోని ఏవైనా బాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి జొరబడుతున్నపుడు రక్తంలోని తెల్ల రక్తకణాలు ఎదురుదాడి చేస్తాయి. అంటే ఇవి దేశాన్ని కాపాడే సైనికుల వంటివి అన్నమాట. తెల్లరక్త కణాలు మన దేహానికి కాపలా కాస్తాయి. దేహ రక్షణ వ్యవస్థ పటిష్టంగా లేనపుడు బయటి నుంచి వచ్చిన బాక్టీరియా, వైరస్లు శరీరంలోకి దూరతాయి. ఇవి శరీరంలో ఒక్కో వ్యవస్థపై దాడి చేస్తూ పోతాయి. కణాల మీద దాడి చేసి అక్కడి ఆహారాన్నంతా తినేస్తూ దాని నివాసాన్నంతా వైరస్ తన సైన్యంతో నింపేయడమే వ్యాధి రావడమంటే. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని క్రమపద్థతిలో తినడం, శరీరానికి కావల్సిన వ్యాయామాన్ని అందించడం చేయాలి. అందరూ సాధ్యమైనంత వరకు బయట తిరడం మానుకోవాలి. ఇంట్లోనే వుంటూ బయట పడేసే వస్తువులతో కొత్త వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు నేర్చుకుందాం...
మాడిపోయిన బల్బులతో
ఇంట్లో బల్బులు మాడిపోతే ఏం చేస్తాం.. వెంటనే బయట పారేస్తాం.. అంతేకదా! కానీ ఈ సారి అలా పాడేయవద్దు. వాటిని ఒకపక్క దాచి పెట్టండి. మరి మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బల్బులను తీసుకొని వాటిపై డిజైన్లు వేయండి. మామూలు పారదర్శకంగా కనిపించే బల్బులకన్నా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులలో ఉన్న బల్బులు తీసుకుంటే బాగుంటుంది. వాటి మీద మొత్తం డిజైన్ వేయవచ్చు. లేదా ఏదైనా ఒక ఆకారాన్ని తీసుకురావచ్చు. నేను ఇక్కడ ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న రెండు బల్బులను తీసుకున్నాను. ఒక వేళ మీ ఇంట్లో రంగుల్లో లేకపోతే ప్లెయిన్ బల్బుకే రంగులు వేసుకోవచ్చు.
నేను ఆకుపచ్చ బల్బును చేపలాగా, ఎరుపు బల్బును అమ్మాయి లాగా మార్చాను. చేప బొమ్మకు మొదటగా పెద్ద కన్నును వేశాను. తర్వాత ఎమ్‌సీల్ కలుపుకొని దానికి పొడవైన ముక్కును పెట్టాను. పొడవు ముక్కుగల చేపల్ని 'ప్రిస్టస్' అంటారు. దానికి ఎర్రటి నోరును కూడా పెట్టాను. తర్వాత బల్బు వెనక భాగమంతా పొలుసులు ఉన్నట్లుగా పెయింట్ చేశాను. తర్వాత ఎరుపు బల్బుకు కళ్ళు, ముక్కు, నోరు, జుట్టు పెట్టి అమ్మాయిగా మార్చాను. ఇంకా జుట్టుకు పెయింట్ బదులు నల్ల ఊలును అతికితే ఇంకా బాగుంటుంది.
ఫోమ్ షీట్‌తో పువ్వులు
పూర్వ కాలంలో మేము 'సోలావుడ్' పేపర్‌తో రకరకాల బొమ్మలు తయారు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా మెత్తగా ఉండే ఫోమ్ షీట్లు దొరుకుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పలచని స్పాంజి ముక్కలు అనుకోవచ్చు. కాకపోతే ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇవి రంగు రంగుల్లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకుని సైజుల వారీగా కత్తిరించుకోవాలి. ఒక్కొక్క దాన్ని పూల రెక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ముక్క కింద పెట్టి ఆ తర్వాత కొద్దిగా చిన్నది, దానిపైన మరింత చిన్నది ఇలా పెట్టుకుంటే పువ్వు ఆకారం వస్తుంది. ఇలా పువ్వులన్నీ తయారు చేసి ఉంచుకోవాలి. తర్వాత సన్నని బంగారు రంగులో ఉండే తీగలు తెచ్చుకొని వాటికి ఈ పువ్వుల్ని చుట్టుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడా పువ్వులు మరికొన్ని చోట్ల ఆకులతో చూడముచ్చటైన పులకుండీ తయారవుతుంది.
సాక్స్ క్లాత్‌తో పువ్వులు
బజార్లో పలుచని సాక్స్క్లాత్ అని దొరుకుతుంది రంగురంగుల్లో. ఒక వేళ అది దొరక్కపోయినా మనం ఇంట్లో వాడుకునే స్కిన్ రంగు పలుచటి సాక్స్లుల పనికొస్తాయి. పాడైపోయినవి ఉంటే వాటిని ముక్కలుగా కత్తిరించుకుని వాడుకోవచ్చు. పైన చెప్పిన సన్నని బంగారు రంగు తీగలు దీనిక్కూడా కావాలి. అలాంటి తీగలు తెచ్చి గుండ్రంగా వంచి, దాని మీద ఈ సాక్స్ క్లాత్‌ను పరిచి చివర్లు ముడి వేయాలి. ఇలా ఆరు పూల రెక్కలు తయారు చేసి వాటినన్నిటినీ కలిపి ముడేయాలి. అలాగే ఒక ఆకును కూడా చేసి ఈ పువ్వు కింది భాగంలో వేలాడేయాలి. ఇలా ఆకున్న పువ్వును తయారుచేయాలి. ఈ పువ్వును పిల్లలకు తలలో పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. అలా కాదంటే ఎక్కువ పూలు తయారు చేసి పూలకుండీలో పెట్టుకోవచ్చు.
సన్నని వైరుతో సీతాకోకచిలుక
లోపల ఖాళీగా ఉండే గొట్టం లాంటి వైరు దొరుకుతుంది. మా చిన్నప్పుడు ఈ వైరుతో చాలా రకాలు అల్లేవాళ్ళం. లోపల సన్నని తెల్లవైరు దూర్చి కావాల్సిన విధంగా అల్లుకునే వాళ్ళం. ఎక్కువగా కర్టెన్లు అల్లుకునే వాళ్ళం. ఇది కూడా నా చిన్నప్పటిదే మీకిప్పుడు చూపిద్దామని తీసుకువచ్చాను. నారింజరంగు, ఆకుపచ్చ రంగు రెండు రకాల వైర్లు తీసుకొని నేను సీతాకోక చిలుకను తీర్చిదిద్దాను. మధ్యలో గొట్టం లాంటి ఖండితాలుగా ఉండే శరీరం, శరీరానికి రెండు వైపులా విశాలంగా పరుచుకొని రంగుల చుక్కలు పెట్టుకున్న రెక్కలు, చిన్న తల, తలకు రెండు వైపులా రెండు శృంగాలు, రెండు కళ్ళు.. ఇది సీతాకోక చిలుక ఆకారం. చిలక, నెమలి వంటివి కూడా అల్లాను. కానీ ఇంట్లో దొరకలేదు. ఇదొక్కటే కనిపిస్తున్నది. గొట్టం వైరుతో సీతాకోక చిలుక బాగున్నదా!
కొబ్బరితో
ఇంట్లో కొబ్బరి కాయ నెల రోజుల పాటు అలాగే వుంచాను. తర్వాత చూస్తే పైన పెంకు పగిలింది గానీ లోపల కొబ్బరి విడివడలేదు. రెండు చిప్పలు కలిపే ఒకే దానిగా కోలగా నిండుగా ఉంది. దానిని కోసి వాడుకో బుద్ధి కాలేదు. అందుకే ఒక పక్కన దాచి పెట్టాను. మొదట దానిపై కత్తితో గాట్లు పెట్టి చిత్రాన్ని చేద్దామనుకున్నాను. కానీ రంగుల కుందన్లు ఎదురుగా ఊరిస్తే కనిపించాయి. వెంటనే రంగుల కుందన్లు, ముత్యాలతో దీన్ని అలంకరించడం మొదలుపెట్టాను. చాలా అందంగా తయారయింది. దాన్ని నిలువుగా పెట్టి చూస్తే అద్దాలు అతికించిన కుంకుమ డబ్బాలా కనిపించింది. మీరే చూడండి. అమ్మవారికి పెట్టిన కొబ్బరి కాయను పారేయకుండా ఇలా అలంకరించుకుని జాగ్రత్తగా పెట్టుకున్నాను.
న్యాయ వ్యవస్థ చిత్రం
ఇది కూడా చాలా రోజుల కిందటిదే. కాబట్టే చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నది. నేను ఒక డ్రాయింగ్ వేశాను న్యాయ వ్యవస్థపై. దాదాపు ఇరవై ఏండ్ల కిందట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మా ఊరు వచ్చినపుడు వారికి బహుకరించటం కోసం ఈ చిత్రాన్ని తయారు చేశాను. దీనిలో న్యాయ దేవతను, అంబేద్కర్‌ను, మూడు సింహాలనూ, జెండానూ పెన్నుతో గీశాను. దీనికో కవితను జోడించాను.
- డా|| కందేపి రాణీప్రసాద్