Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే బాధపడి పోతుంటారు. ''ఇలా మాట్లాడితే.. లేదా ఇలా చేస్తే.. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని ఇబ్బంది పడడం మనం చాలా సార్లు ఎదుర్కొన్నదే''.. అయితే మన శరీరం గురించి కానీ.. మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి కానీ.. లేదా మనం మాట్లాడే మాటలు, చేసే పనులు.. ఇలా దేని గురించైనా సరే.. ఇబ్బంది కానీ బాధ కానీ పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మరి, ఎక్కువ మంది అమ్మాయిలు ఏ విషయంలో ఇబ్బంది పడతారో.. దాని గురించి అసలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు లేదో తెలుసుకుందాం...
నో చెప్పడం
మీరు మీ పనంతా పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగా మీ కొలీగ్ ''కాస్త ఈ పని చేసి పెట్టవా.. నాకు చాలా పని ఉంది'' అంటూ అడగగానే.. ఇంట్లో అర్జంట్ పని ఉన్నా.. ఒప్పుకోకపోతే అవతలి వ్యక్తి ఏమనుకుంటారో అని ఇబ్బందిపడుతూ ఒప్పుకుంటారు. తన పనిని మీకు అప్పగించిన కొలీగ్ మాత్రం కాసేపట్లో ఇంటికి వెళ్లిపోతే.. మీరు తన పనిని మీ భుజాలపై వేసుకొని రాత్రి వరకూ పనిచేస్తూ ఉండిపోతారు. అందుకే కేవలం పని విషయంలోనే కాదు మీకు నచ్చని విషయం ఏదైనా సరే.. దానికి ఖరాఖండీగా నో చెప్పేయండి. అవతలివారు ఏమనుకుంటారో, భవిష్యత్తులో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో, అంటూ ఇలా రకరకాల కారణాలు మీకు మీరే చెప్పుకొని మీకు నచ్చని పని చేయకండి. కొన్నిసార్లు ఎదుటివాళ్లు మీరు మంచివాళ్లు కాదనుకున్నా తప్పులేదు.
సమయం తీసుకోండి
ప్రతిఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. మీ బంధం అద్భుతమైనది అనుకున్న కొన్ని రోజులకే వివిధ కారణాల వల్ల ఇద్దరూ విడిపోవాల్సి రావచ్చు. దీంతో మనసుకు బాధనిపించడం సహజమే. ఇలాంటి సందర్భాల్లో ఏడిస్తే మనం బలహీనులమని ఎదుటివారు ఎక్కడ అనుకుంటారో అని ఇబ్బందిపడితే నష్టం మనకే. కాబట్టి మీలోని బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేయండి. మర్చిపోవడానికి మీకంటూ కాస్త సమయాన్ని ఇచ్చుకోండి. త్వరగా మర్చిపోలేకపోతుంటే మీరు బలహీనులని భావించొద్దు. మీరు అవతలి వ్యక్తిని అంత బలంగా ప్రేమించారు కాబట్టి మర్చిపోవడానికి కాస్త సమయం పడుతుందని భావించి జీవితంలో ముందుకెళ్లండి.
మనసు తేలికపడుతుంది
చాలాసార్లు బ్రేకప్‌ని తట్టుకోవడానికి స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తాం. లేదంటే కొన్ని వ్యసనాలకు బానిసలౌతుంటాం. కోపంతో అతడికి ఫోన్ చేసి తిడితే.. ఆ తర్వాత బాధపడుతూ కూర్చోకండి. ఇవన్నీ మీ మనసు ఎప్పటి నుంచో ఫీలవుతున్న విషయాలు. అవే మీలో నుండి బయటకొచ్చేశాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి మీరు బాధపడకండి. మీ మనసు తేలిక పడిందని ఆనందించండి.
బరువు పెరగడం
కాస్త బరువు పెరిగితే చాలామంది అమ్మాయిలు తెగ బాధపడిపోతుంటారు. అయితే ఆ బరువు మీకు నచ్చిన రెస్టరెంట్లలో, మీకెంతో ఇష్టమైన వ్యక్తులతో కలిసి కూర్చొని తినడం వల్ల పెరిగారని గుర్తుచేసుకోండి. ఆ అందమైన జ్ఞాపకాల ముందు ఈ కొద్దిపాటి బరువు ఏపాటిది? అందుకే దీని గురించి బాధపడడం మానండి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.
మీ కోసం ఖర్చు చేయడం
చాలామంది కుటుంబం గురించి ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. కానీ తమకోసం ఏదైనా కొనాలంటే మరీ ఎక్కువ ఖర్చు చేస్తున్నామని బాధపడుతూ ఉంటారు. అయితే మీరు ఖర్చు చేసేది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. దాన్ని మీకోసం ఖర్చు చేయడంలో ఏమాత్రం తప్పు లేదని గుర్తుంచుకొని బాధపడడం మానేయండి.
నచ్చని ఉద్యోగంలో
చాలామంది చేసే ఉద్యోగం తమకు నచ్చకపోయినా చేయాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు. కానీ చేసే ఉద్యోగం పెద్దగా నచ్చకపోయినా మనం చేసే ప్రతి ఉద్యోగం మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అందుకే ఈ పాఠాలను నేర్చుకుంటూ మీకు నచ్చిన ఉద్యోగం కోసం వెతుక్కోవాలే తప్ప.. నచ్చని ఉద్యోగంలో ఉన్నామని బాధపడకూడదు.
మీ తప్పుకాదు
మీ బెస్ట్‌ఫ్రెండ్, మీరు కొన్నేళ్ల నుంచి కలిసి ఉన్నారు. కానీ మీ ముందు బాగుంటూ మీ వెనుక మీ గురించి తప్పుగా చెబుతోందని తెలిసిందా? లేక మీ ఇద్దరి మధ్యా ఏదైనా గొడవ వచ్చి విడిపోయారా? అయితే దీని గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తితో విడిపోవడం మీకే మంచిది. కొన్ని రోజులు స్నేహితురాలు లేని లోటు తెలుస్తుంది. కానీ తనని వదులుకోవడం మీ తప్పుకాదు కాబట్టి బాధపడకండి.
మీ నిర్ణయంపై మీరు
మిమ్మల్ని తక్కువగా చూసేవారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వేరే మహిళలు ఉంటే వారికి మీ సహకారం అందించడంతో పాటు, అదే పరిస్థితిలో మీరున్నా మీకోసం మీరు నిలబడడం ఎంతో అవసరం. దీని గురించి మీరేమీ తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. ఎవరితోనైనా అభిప్రాయాల్లో బేధాలొస్తే మీ నిర్ణయంపై మీరు నిలబడడం అవసరం. మీరు పెద్దవారు కాబట్టి మీకు ఏం కావాలో మీకు తెలుసు. కానీ మీ అభిప్రాయభేదాలను గొడవ వరకూ తీసుకురాకుండా ప్రయత్నించడం మంచిది.
సక్సెస్ సాధించడం
ఒక మహిళ సక్సెస్ సాధిస్తోందంటే కేవలం పని వల్లే కాదని.. ఇంకేదో చేస్తోందని అనే వాళ్లు ఎంతోమంది. కానీ మీరు ఎలాంటి పనులు చేశారో మీకు తెలుసు కాబట్టి వారు అనే మాటలను పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు పడే కష్టానికి మీ దారిలో వచ్చే ప్రతి విజయాన్ని మీరు పొందాల్సిందే..!