Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం పట్ల సరైన స్పష్టమైన అవగాహన లేక మనసు పరిపరి విధాల పరిగపెడుతూ ఉంటుంది. ముందు ఒక ఆలోచన వస్తుంది. అంతలో దృష్టి ఎటో మరలిపోయి మరో ఆలోచన చేస్తాం. ఇలా మన జీవన విధానంలో భయాలు, ఆందోళనలు, సందేహాలు కలిగి ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడతాం. గతంలో జరిగిన దానికి విచారిస్తూ వర్తమానాన్ని మరిచిపోతాం. ఇలాంటి ఆలోచనలతో వర్తమానంలో జరిగే వాటికి, భవిష్యత్తులో జరగబోయే వాటికి మనమే కారణమవుతాం.
గతంలోనే మునిగి తేలుతుంటే వర్తమానాన్ని ఎలా ఎదుర్కోగలం? అలాగే భవిష్యత్‌ను భయంకరంగా ఊహించుకుని బెంగపడవద్దు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రతిదీ మనకు అనుకూలంగా జరుగుతాయని భావించకూడదు. ప్రతికూలంగా జరుగుతాయని మానసికంగా సిద్ధపడితేనే ధైర్యంగా ఉండగలుగుతాం. సమస్యలను ఎదుర్కొన గలుగుతాం. అప్పుడు మనసు వైకల్యం చెందదు.
మన ఆలోచనల్లో స్పష్టత ఉంటే, సందేమాలు కలగవు. ఒక వేళ కలిగినా ఆ సందేహాలకు సమాధానాలు వాటంతట అవే లభిస్తాయి. ఎవరి సలహాలూ సూచనలూ పాటించకుండానే సందేహ నివృత్తి కలుగుతుంది. ఒక నిబద్ధతతో, మార్గనిర్దేశనంతో మనం ముందుకు సాగాలి. చిన్న చిన్న విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి భూతద్ధంలో చూసి భయపడకూడదు. పట్టించుకోకుండా పక్కకు నెట్టేయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. జీవితంలో ఎందరికో సహాయం చేసి ఆదుకుంటాం. మనం చేసిన సహయానికి ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెప్పకపోతే బాధపడతాం. ఇలాంటివి ఆశించకుండా మనకు నచ్చింది చేసుకుంటూ పోవాలి. దీనివల్ల ఆత్మసంతృప్తితోపాటు అనవసరమైన చికాకులు ఉండవు.
మనం పలుకరింపుగా చిరునవ్వు నవ్వితే, అవతల వాళ్ళు చిరునవ్వుతో స్పందించకపోతే కుంగిపోతాం. క్షోభపడతాం. ఇంతటి అహంకారమా అనుకుంటాం. అటువంటప్పుడు మనలోనూ అహంకారం ఉండచ్చు కదా అన్న ఆత్మ విమర్శ మనకు సాధారణంగా ఉండదు. ఎదుటివారిలో ఏ లోపం ఉందనుకుంటామో, ఆలోపం మనలో ఉండకుండా జాగ్రత్తపడాలి. మిన్ను విరిగి మీద పడిపోతున్నా, ప్రశాంతంగా ఉంటూ అనుకున్న వాటిని సాధించుకుంటున్న ఎందరో ఉత్తములు మనకు ఎదురవుతూనే ఉంటారు. వాళ్లను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే అపజయాలే విజయాలుగా పరిణమిస్తాయి.